– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
రాష్ట్రంలో పదేపదే గ్యాస్ (విషవాయువు) లీకేజీ ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుపట్టారు. విశాఖ అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ప్రకటన విడుదల చేశారు. అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ జరిగి దాదాపు 200 మంది అస్వస్థతకు పాలవటం విచారకరం. బాధితుల్లో గర్భిణీలు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గతంలో విశాఖ ఎల్జి పాలిమర్స్ వాయువు లీకేజీ ఘటనలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తదుపరి నంద్యాల ఎస్పీవై ఆగ్రోఫ్యాక్టరీలో, ఏలూరు పోరస్ కంపెనీలో, హ్యాట్సన్ డైరీలో అమోనియా లీకేజీ వంటి ఘటనలు జరిగాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు నిర్వహణ అంశంపై సకాలంలో స్పందించలేదు. రెగ్యులర్ గా తనిఖీలు చేయటం, భద్రతా ప్రమాణాలు పాటింపచేయటం వంటివి విస్మరించింది.
అచ్యుతాపురం అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన ఉచిత వైద్య సహాయం, నష్ట పరిహారం అందించాలి. ఈ దుర్ఘటనకు కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.