Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో భారీగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి

ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 17, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి సాధించిందని, ఏటా సగటున 12.70% వృద్దితో అన్ని రంగాల్లో భారీ వృద్ధి నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు.

గత చంద్రబాబు నాయుడు పాలనలో 2018-19 సంవత్సరంలో రూ.8,73,721.11 కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి, సీఎం జగన్ పాలనలో 2022-23లో రూ.13,17,728.15 కోట్లు వృద్ధి నమోదు చేసిందని అన్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో జగన్ పాలనలో రాష్ట్ర జీఎస్ డీపీ రూ. 4.44 లక్షల కోట్లు వృద్ధి నమోదు చేసిందని అన్నారు.

రాష్ట్రంలో భూమి సంబంధిత సమస్యలన్నింటికీ ఒకేసారి పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని, పేదోడికి ప్రభుత్వం అందించిన భూమిపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం పేదోడికి పట్టం కట్టిందని అన్నారు.

రాష్ట్రంలో పేదోడికిచ్చిన 27.41 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కల్పించి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. నిరుపేదలకు కొత్తగా రాష్ట్రంలో 46వేల ఎకరాల భూమి పంపిణీ చేసిందని అన్నారు. లంక భూములకు అసైన్మెంట్ పట్టాలు అందించిందని, చుక్కలు, షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగించిందని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన భూములు రీసర్వే దేశానికే అదర్శమని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలో పచ్చకుండావాలు స్వైర విహారం
తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలో పచ్చ కండువాలు స్వైరవిహారం చేస్తున్నాయని స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ అపవిత్ర పొత్తులకై తెగించిందని స్పష్టమవుతోందని అన్నారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని టోటల్ డ్రామాస్ పార్టీ అని విజయసాయి రెడ్డి అన్నారు.

కులగణనకు పురందేశ్వరి అనుకూలమా? వ్యతిరేకమా?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతి, మరింత మెరుగైన సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కులగణనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని విజయసాయి రెడ్ది ప్రశ్నించారు. వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న ఆమె చంద్రబాబు పాలసీనే తన విధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు బీసీ, ఎస్సీ కులాలను కించపరుస్తూ మాట్లాడారని, ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని, బీసీలు జడ్జీలుగా పనికిరారని, వారి తోకలు కత్తిరిస్తానని అన్న చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

కిందటి లోక్ సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ స్థానం నుంచి పోటీ చేసినపుడు 20 పోలింగ్ బూత్ లలో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదని అలాగే మరో 40 బూత్ లలో పది లోపే ఓట్లు పడ్డాయని, అయినప్పటికీ ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారని, అందరికీ అటువంటి అదృష్టం కలిసిరాదని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే చెల్లిందని అన్నారు.

తోకపార్టీల్లోనూ కుల పెత్తందారీ అహంకారం
ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం రాఘవులు చేసిన వ్యాఖ్యలు చూస్తే తోకపార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ మేరకు రాఘవులు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

LEAVE A RESPONSE