-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
విజయవాడ : హైకోర్టు రద్దు చేసిన ఎపిపిఎస్సి గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. 2018లో ఎపిపిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో లోపాలవల్ల ఎపీ హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2018లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలను 2022 మే 26న ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఎపీ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మార్చి 13న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దుచేస్తూ, మరో 6 నెలల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఎపిపిఎస్‌సిని ఆదేశించింది.
ప్రభుత్వరంగమైన ఎపిపిఎస్‌సికి సంబంధించిన ఉద్యోగాల వాల్యూయేషన్‌ను ప్రైవేటు కంపెనీ మాదిరిగా హ్యాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో చేయడం, అందుకు రూ.1.19 కోట్లు ఖర్చుచేయడం, అప్పటి ఎపిపిఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు మూల్యాంకనం బాధ్యతను ఒక థర్డ్‌పార్టీ ఏజన్సీకి అప్పగించడం పలు వివాదాలకు దారితీసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలొచ్చాయి.
ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో, ఎంత మొత్తాలు చేతులు మారాయో సిబిఐ చేత సమగ్రమైన విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఎపిపిఎస్సి అక్రమాలపై ఆందోళన చేయడం గమనార్హం. అయినప్పటికకీ ప్రతిపక్షాలు చెప్పేది ఏమాత్రం ఖాతరు చేయకుండా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా ఫలితాలను ప్రకటించింది.
చివరకు రాష్ట్ర హైకోర్టు ఆ ఫలితాలను రద్దుచేస్తూ, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. కాని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలానికిపైగా గడుస్తున్నా గ్రూప్`1 పరీక్ష నిర్వహించకుండా తాత్సారం చేయడం విచారకరం.
ఉద్యోగాల సాధన కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుని, నిరీక్షిస్తున్న అభ్యర్థులను తగు న్యాయం చేసేందుకు, తక్షణమే ఎపిపిఎస్సి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.