ఇదేనా లౌకికవాదం? అంటూ ఆంధ్రజ్యోతిలో (2015) మార్చి 24న సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్‌కుమార్ రాసిన వ్యాసంపై వ్యాఖ్యానిస్తూ ఈ నెల ఏప్రిల్ 2న సంకుచిత లౌకికవాదం వద్దు అంటూ బండి ప్రదీప్‌కుమార్, మనది లౌకికవాదం కాదా? అంటూ 7వ తేదీన చాణక్య రాశారు.స్థూలంగా సురేష్‌కుమార్ రాసిన, ఉదహరించిన అంశాలు ఉదాహరణలు సరిగానే ఉన్నప్పటికీ, లౌకికవాదమంటే మతవ్యతిరేక వాదమన్నట్టూ, అలాగైతే అది సంకుచితవాదమవుతుందని ఒకరూ, హిందువులకు హిందువులమని చెప్పుకునే హక్కులేకుండా చేసేవాదమే లౌకికవాదమన్నట్లు మరొకరూ రాశారు. నూరేళ్ళుగా ప్రజాస్వామిక రాజకీయాలతో నడుస్తున్న దేశంలో, 68 ఏళ్ళుగా లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన క్రింద జీవిస్తున్నామనుకుంటున్న దేశంలో లౌకికవాదమంటే ఏమిటో ఇంకా చర్చించుకునే దశలోనే వున్నామా?
లేక దాన్ని బ్రహ్మపదార్ధంగా మార్చి మసిబూసి మారేడుకాయగా మిగల్బదలుచుకున్నామా? అని ప్రశ్నించుకోవాల్సిన స్థితికి చేరాము. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చిన సందర్భంలో ఆయనతో సుద్దులు చెప్పించుకోవాల్సి రావటమేకాక, కేంద్రప్రభుత్వం రిపబ్లిక్ దినోత్సవంనాడు రాజ్యాంగంలోని “లౌకిక, సోషలిస్ట్” పదాలను మినహాయిస్తూ కావాలని విడుదల చేసిన ప్రకటన కూడా యాదృచ్చికంగా జరగలేదనుకోవాల్సి వుంది. వీటన్నిటి దృష్టా “లౌకికవాదం” సైద్ధాంతికంగా, చారిత్రకంగా, ఆచరణ సంబంధమైన స్పష్టతను కోరుతోందని అర్ధమవుతోంది. అనేక అసంగతాలను వీడి ‘లౌకికవాదం’ సమస్య యొక్క కీలకాంశాలకే పరిమితమై యిది రాస్తున్నాను.
ఇంతకీ ఏమిటీ లౌకికవాదం?
ఇందుకు మన సంప్రదాయంలోని ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడతాను. తెలుగువారింట జరిగే మంత్రాల పెళ్ళిళ్ళలో ఒక ముఖ్యమైన మంత్రం యిలా వుంటుంది. ధర్మేచ, అర్ధేచ, కామేచ…. త్రయేషా నాతి చరితవ్యాః అని పురోహితుడు మంత్రం చదివి పెళ్ళికొడుకుతో నాతి చరామి అనిపిస్తాడు. ఇది అందరూ విన్నదే. ధర్మేచ అంటే సంసార ధర్మములో, అర్ధేచ – ఆస్తిపాస్తుల వ్యవహారాలలో, కామేచ – సమస్త జీవితాకాంక్షలలో…. ఈ మూడింటిలోనూ భార్యవైన నిన్ను అతిక్రమించి ప్రవర్తించను… అని భర్త చేసే ప్రమాణమే ఈ మంత్రo ఇచ్చే అర్ధం.
ధర్మార్ధ కామమోక్షాలనే నాలిగింటినీ కలిపి పురుషార్థాలు అంటారు. మన చర్చనీయంశం మోక్షానికి సంబంధించినది. మంత్రంలోనే త్రయేషా. (మూడింటి విషయంలో) అని వున్నది కనుక చాలా ఖచ్చితంగా మోక్షేచ ..ను ఈ మంత్రం నుండి మినహాయించారనేది స్పష్టం. ఎందుచేత? అన్నది జవాబు వెతుక్కోవలసిన ప్రశ్న.
మొదటి మూడూ ఇహలోక సంబంధమైనవి. అంటే మన రోజువారీ జీవితానుభవానికి చెందినవి. వాటినే లౌకికమైనవి అంటారు. అవి మన చుట్టూ, మన కళ్ళముందు, మనతో వున్నవి. మనం అనుభవించేవి, మనం వ్యవహరించవలసినవీ… అంతే కాదు మనం సరిదిద్దుకోగలిగినవే ఈ మూడూ. అనగా కాలానుగుణంగా మార్పుకి గురయ్యేవి కూడా!
మోక్షమన్నది పరలోక సంబంధమైనది. సాంప్రదాయక విశ్వాసాల ప్రకారం వ్యక్తిగత మోక్ష0 ఉన్నదే కాని, భార్యా, బిడ్డల, బంధువుల, మిత్రుల సమేతంగా మోక్షమన్న భావనే లేదు. అంటే మోక్షం ఎవరికి వారిదే. కలసి ప్రయాణం చేస్తానని వాగ్దానం చేయలేనిది.కారణమేంటి… పరలోకమన్నది ఊహా ప్రపంచం. నిజంగా అక్కడ ఏమున్నదో, ఎలా వున్నదో అసలున్నదో లేదో దానికై ఖచ్చితమైన సాధ్యాసాధ్యాలేమిటో… పరిపరి విధాల వ్యాఖ్యానాలున్నాయేకానీ నిర్దుష్టత, పూచీ లేవు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చినవాడూ లేడు. అంటే మోక్షమన్నది విశ్వాసమే కాని మానవ అనుభవంలోకి, అమలులోకి వచ్చేది కాదు కనుక హామీ ఎవరూ యివ్వలేరు.
ఎవరి విశ్వాసాలకనుగుణంగా వారు ప్రయత్నించుకోదగినది కనుక మోక్షంకు భార్యాభర్తల బంధం ఏమీలేదని అర్ధం. (స్త్రీలకు మోక్షమే లేదనే వాదాన్నీ, పెళ్ళి తంతులోని పితృస్వామిక నీతుల్ని కాసేపు పక్కనుంచుదాం). సారాంశంలో వాస్తవికమైన ఇహలోక (లౌకిక) సంబంధ విషయాలలో మాత్రమే నిన్ను అతిక్రమించను అనే ప్రమాణాన్ని చేయగలరుగానీ పరలోక సంబంధమైన మోక్షానికి హామీ ఎవరూ యివ్వలేరు.కనుక పెళ్ళి మంత్రాలలో కూడా మోక్ష విశ్వాసాన్ని పక్కన బెట్టారన్నమాట!
ఈలాంటి రాజులు వుండిననేమి! మండిననేమి!!
ఇపుడు మనం రాజ్యం దగ్గరకూ, ప్రభుత్వాల దగ్గరకూ వద్దాం. మతవిశ్వాసాల ప్రకారం *ఎర్ర చందనం దొంగలకు ఆయుష్షు తీరి,పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయారు. యమధర్మరాజు ఆదేశాన్ని ఆయన భటుల్లాగా పోలీసులు పాటించటాన్ని తప్పుపట్టకూడదు* అని ఎవరైనా కోర్టులో వాదిస్తే ఎలా వుంటుంది? సామాజిక అసమానత్వాలు పెరగటానికి కారణం ఆయా వర్గాలవారి ఖర్మ అది వారి పూర్వజన్మ సుకృతం, లలాట లిఖితం ….. అని పురాణం శాస్త్రల్లవారు చెప్పినట్టే ప్రభుత్వాలు కూడా చెప్పేస్తే ఎలా వుంటుంది? బాబ్రీ మసీదు లోపల సీతారాముల విగ్రహాలను వందలాది సాయుధ పోలీసుల పహారాతో కాపాడుతున్నారుగదా! దేవుడ్ని మనుషులు కాపాడుతున్నారా? మనుషుల్ని దేవుడు కాపాడుతున్నాడా? అని ప్రశ్నిస్తే నిజమైన ఇహలోక రక్షకులెవరో బయటపడుతుంది గదా!లౌకిక ప్రపంచం అంటే మనం జీవించే ఇహలోక సంబంధమైనది. అది వాస్తవికమైనది కూడా!
గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అనే వాళ్ళను వెర్రివాళ్ళంటారు. వాస్తవిక ప్రపంచమేకాక మనుషుల ఆలోచనలలో ఊహా ప్రపంచాలు కూడా వున్నాయి. అందులో పరలోకమొకటి. అది కేవలం విశ్వాస సంబంధమైనది. ప్రజలలో విశ్వాసాలు మతాలవారీగా, దేవుళ్ళవారీగా పరిపరివిధాల ఉండొచ్చు. వాటిని మనం గౌరవించనూవచ్చు, చర్చించనూవచ్చు. కానీ చట్టాలు, శాసనాలూ, న్యాయవ్యవస్థ, పోలీసు బలగాలూ, అధికార గణాలు, ప్రజలకు పూచీ పడాల్సిన రాజకీయ పార్టీలు… ఒక్కమాటలో సమస్త ప్రభుత్వ అంగాలు – ప్రజల వాస్తవిక జీవన స్థితిగతులకు, మంచి-చెడులకూ బాధ్యత వహించాల్సిందే తప్ప వాటిని పరలోక, దైవ, మత విశ్వాసాలకు లంకె పెట్టటానికి కుదరదు.
కొత్త రాజధాని నిర్మాణం యొక్క ఫలితాలకు ప్రభుత్వాలు, నాయకులు బాధ్యత వహించాలిగానీ, వాస్తు యొక్క ప్రభావాల పేరుతో రాజ్యం తప్పించుకోలేదు. నిజానికి మతవిశ్వాసం ప్రకారం వ్యవహరించే వారి అనేకానేక చేతలు కార్యకలాపాలు కూడా లౌకికమైనవే. దేవుని దగ్గర బాజా, భజంత్రీలు వాయించాలంటే ఎంత మానవ శ్రమ కావాలి? పూలు, హారతి కర్పూరం, సాంబ్రాణి, ప్రసాదం, హుండీలు…. లెక్కింపులూ, ఒక్కటేమిటి సమస్తం ఇహలోక ప్రకృతి నుండి మానవ యత్నంతో సాధించేవే. ఇవన్నీ ఫక్తు లౌకికమైనవే కదా! ఈలాంటి పూజలు చేస్తే తమ ఈతి బాధలు నివారణవుతాయని ప్రజలు విశ్వసించటం వేరు.
ప్రభుత్వాలే పై విశ్వాసాల ప్రకారం ఆ పని చేయటం మొదలుపెడితే విదేశీ బ్యాంకుల్లో నల్లధనానికీ, అధిక ధరలు నేలకు దిగటానికీ, అవినీతి అంతం కావటానికీ, మహిళలు భద్రంగా జీవించగలగటానికీ దళితులు గౌరవంగా బతకటానికీ – యజ్ఞాలూ, యాగాలూ చేస్తాం… కొలుపులూ, బలులూ యిస్తాం –
పుష్కరాలూ – పూజలూ జరుపుతామంటే – నాటకంలో హరిశ్చంద్రుడన్నట్లు ఈలాంటి రాజులు వుండిననేమి! మండిననేమి!!
రాజ్యం పరమ లౌకికం!
ఆధునిక ప్రభుత్వాలు పాటించాల్సినది, అమలు పరచాల్సినవీ రాజ్యాంగాన్నీ అందులోని ఆదేశిక సూత్రాలనూగాని దేవుడు దయతలిస్తే అవినీతిని అరికడతాం అని అనటానికి లేదు. రాజ్యం యిహలోక సంబంధిత వ్యవహారాలను చక్కబెట్టటానికి ఏర్పాటయినదే కాని పరలోకాన్ని గురించిన, మత విశ్వాస సంబంధమైన హామీలను యివ్వటానికి రూపొందినది కాదు. అంతేకాక ఇహలోక లౌకిక సమస్యలకు ఇక్కడే, మనుషులమే, మనుషులు నిర్మించుకున్న రాజ్యాలే పరిష్కారం చూపాల్సిన బాధ్యత పడాలి తప్ప, భగవంతునిపైన భారంవేసి తప్పించుకోవటానికి వీలులేదు.
ప్రభుత్వాలే మత విశ్వాసాల ప్రకారం వ్యవహరించదలిస్తే ఆసుపత్రులకు బదులు స్వస్థత కూటములనూ, నేరస్తులను కనిపెట్టటానికి జ్యోతిష్యులనూ, సకాలంలో రైతులకు నీళ్ళు అందించటానికి వరుణ యజ్ఞాలు చేసే మాంత్రికులనూ, పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణత పెంచటానికి కాపీలకు బదులు, టెంకాయలను కొట్టించడానికి ప్రోత్సహిoచాల్సి వుంటుంది. వాటివల్ల ఫలితాలు రాకపోతే వారిని నేరస్తులుగా న్యాయస్థానాలలో విచారించాల్సి వుంటుంది. ఇది వినటానికే హాస్యాస్పదంగా లేదూ!!
చారిత్రక అనుభవాలు ఏం చెబుతున్నాయి?
అనేక మత విశ్వాసాల నడుమ సహజీవనం, సంఘర్షణలతో నడిచిన చారిత్రక అనుభవాలు అనేకం మనకున్నాయి. ఆర్య – అనార్య,శైవ-వైష్ణవ సంఘర్షణలు మనమెరిగినవే. హరిహరనాధ తత్త్వం ఎందుకు పుట్టింది? శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే; శివశ్చహృదయం విష్ణుః; విష్ణోశ్చ హృదయగుం శివహః అనే భావం ఎంత రక్తపాతాలనంతరం నిలదొక్కుకుంది?
ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందూ-ముస్లింల ఐక్యత బలంగా ఏర్పడిన మేరకు బ్రిటీషు పాలకులు ఓటమి అంచులకు చేరటం, ఆ ఐక్యతను బలహీనపరచగలిగిన ఫలితంగా గెలుపును పొందటం, ఈ చరిత్ర పాఠాల నుండే కదా విభజించు, పాలించును ఒక విధానంగా బ్రిటీషు పాలకులు అమలు జరిపారు! ఈనాడు కూడా మతాల నడుమ విద్వేషాలు పెంచేవారు. దేశాన్ని ఎలా అభివృద్ధి పరచగలరు?
రాచరిక యుగంలో అధికారాన్ని చేబట్టటానికి ప్రధానంగా భుజబలంమీద, సైన్య సమీకరణ శక్తిమీదా ఆధారపడ్డారు. ఆనాడు లిఖిత రాజ్యాంగం లేదు. ప్రజాభిప్రాయానికి చోటు లేదు. ప్రజల మీద సాంస్కృతికంగా పట్టు వున్న మత పెద్దల సలహాలు వుండేవి. చాలా సహజంగా సమాజంలో ఆర్థికంగా, సాంఘికంగా, ఆధిపత్యంలో వున్న కులాల, వర్గాల పెత్తనం రాజ్యం ద్వారా అమలు జరుగుతుండేది. అగ్రవర్ణ ఫ్యూడల్ పెత్తందారీతనాలతో, మత మౌఢ్యాల అగ్ని పరీక్షలతో సాంఘిక వివక్షలతో సామాన్యుల బతుకు పరమ దుర్భరంగా సాగింది. ఫ్రెంచ్ విప్లవాల్లాంటివి అలాంటి పరిస్థితుల నుండే పుట్టాయి. ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఫలితంగా హేతుబద్ధత, శాస్త్రీయ చింతన పెరిగి ప్రపంచాన్నంతా అవి ప్రభావితం చేశాయి.
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యవ్యవస్థలు పరలోక విశ్వాసంతో, అతీత శక్తుల మహత్తులతో కూడిన మత విశ్వాసాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి పోవటమే కాక రాజ్యం మత విశ్వాసాలతో సంబంధం లేకుండా లౌకికంగా వ్యవహరించటమన్నది మానవ నాగరికత ముందడుగుకు చిహ్నంగా నిలిచింది. ఐతే మతవిశ్వాసం కలిగి వుండటం, మత మార్పిడిని రాజ్యాంగ హక్కుగా పొందటం వ్యక్తుల హక్కుగా లౌకికవాదం గుర్తించింది. భారతదేశం లాంటి అనేక మతవిశ్వాసాల ప్రజలున్నచోట ప్రజల నడుమ మతసామరస్యం పెంపొందేట్లు, మత ఘర్షణలు చెలరేగకుండా చూడటం రాజ్యాంగం యొక్క విధిగా వుంటుంది.
సర్వమత సమభావం అన్నది ప్రజలలో పెంపొందాల్సిన సాంస్కృతిక విలువవుతుందేగాని, అది ప్రభుత్వ విధానం కాకూడదు. ఎందుకంటే అది ఆచరణసాధ్యం కానిది. పాలకుల హిందూ మత విశ్వాసాలే రాజ్యం విశ్వాసాలుగా నేడు అమలు జరుగుతున్నట్లే అది వుంటుంది. ఈ తరహా ఆచరణ మత మైనారిటీలలోనూ, దళిత, ఆదివాసీలలోనూ ఈ దేశం, రాజ్యం తమదికాదేమోననే భావం గూడుకట్టుకోడానికి ఆస్కారం యిస్తుంది. “సర్వమత సమభావమనేది” రాజ్యవిధానమనుకున్నప్పుడు, ప్రతి ప్రాజెక్టో, మరొకటో సమస్త ప్రారంభోత్సవాలకి అన్ని మతాలవారి ప్రార్ధనలూ, పూజాదికాలూ నిర్వహిస్తూ పోతుంటే ఎలా వుంటుందో ఒకసారి ఆలోచించండి.
మత మౌడ్డ్యాలపై పోరాటం! ఆధునిక ప్రగతికి ఒక సోపానo!!
మతభావజాలాలు, వాటి పేరిట అమలు జరిగే ఆచారాలు లోపరహితాలూ, విమర్శకు అతీతాలు కావు. కుళ్ళికంపు కొడుతున్న కుల వ్యవస్థను సమర్ధించే, స్త్రీలను కించపరిచే భావజాలాల నుండి మతాలు సంస్కరణ పొందాలి గదా! అలాగే ఒకనాటి మన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు – చంద్రుడు – ఇతర గ్రహాల చలనాలను లెక్కలు గట్టి చాలావరకు దిన, పక్ష మాస, సంవత్సరాలను, సూర్య-చంద్ర గ్రహణాలను దాదాపు సరిగానే నిర్ధారించిన ఘనచరిత్ర గలవారే అయినప్పటికీ… అవన్నీ భూకేంద్ర సిద్ధాంతంగా… అంటే భూమిచుట్టూ సూర్యుడూ… ఇతర గ్రహాలూ తిరుగుతున్నట్లుగా భావించి కట్టిన లెక్కలు. కొపర్నికస్, గెలీలియోలు… సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన పిదప ఖగోళశాస్త్రం మరింత శాస్త్రీయతను సాధించింది.
క్రిస్టియన్ మతగ్రంధాల ప్రకారం నాటి రాజ్యపాలకుల విధానంలో భాగంగా గెలీలియో, లియోర్దినో బ్రూనో లాంటివారు పాలకుల చిత్రహింసలను భరించారు. ప్రాణాలు కోల్పోవలసి వచ్చినా మతపీఠాలకూ, రాజ్యానికి తలవొగ్గకుండా శాస్త్రీయ ప్రయోగాల కొరకు నిలబడ్డారు. మనకు ఈనాటికీ మన గుడులలో వుండే నవగ్రహాలలో సూర్యుడు – చంద్రుడు వుంటారు. భూమి అసలు వుండదు. ఈ తల్లకిందుల విశ్వాసం ప్రాతిపదికపైనే జ్యోతిష్యాన్ని శాస్త్రమని నేటికీ కూడా వాదించేవారున్నారు. ఈలాంటి మతమౌధ్యాల్ని సంస్కరించే దమ్ము ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలకుండాలి. రాజకీయ పార్టీలకుండాలి. లేకుంటే మతమౌధ్యానికి ఆమోదం తెలిపినవారే కాగలుగుతారు.
ప్రజలలో వుండే మతవిశ్వాసాల్ని “సొమ్ము” చేసుకునే మోసగాళ్ళు ఏ కాలంలోనైనా వున్నారని సహ్రశిరచ్చేద అపూర్వ చింతామణి ని చదివినా, విశ్వనాథ సత్యనారాయణగారి స్వర్గానికి నిచ్చెనలు నవల చదివినా అర్ధమవుతుంది. ఈలాంటి వారిని లౌకిక రాజ్యాలు, వాటి చట్టాలు అదుపులో పెట్టాలి.సతీసహగమనాలూ, వితంతు వివాహాలు, స్త్రీలకు విద్య దళితులపట్ల అంటరానితనమూ, వివక్షలను మత ఆచారాల పేరిట గత కాలంలో ప్రోత్సహించటం మనమెరిగినదే.
వాటికి వ్యతిరేకంగా పోరాడి సంస్కరించుకుంటేనే గదా సమాజంలో కొన్ని ప్రగతిశీల మార్పులైనా వచ్చినది. కనుక రాజ్యం శాస్త్రీయ అభినివేశం (Scientific Temper)తో, మతంపట్ల ప్రజాస్వామిక దృక్పధంతో సంస్కరించే వైఖరితో వుండాలేకానీ మతాలను నెత్తిన పెట్టుకుని ఊరేగే దృష్టితో ఉండతగదు.
మనది ప్రధానంగా కులవ్యవస్థ! మత వ్యవస్థ కాదు!
ఒకనాడు విద్యారంగం బ్రాహ్మణుల గుత్తస్వామ్యంగా ఉండేది. బ్రిటీషువారి అవసరాలమేరకే అయినా లౌకిక విద్యలను నేర్చుకునే క్రమంలోనే కదా సమస్త కులాలలో విద్య వికసించింది. ఇప్పటికీ హిందూ మతం కర్మకాండలన్నీ బ్రాహ్మణ పూజారి, పురోహితుల గుప్పెటలోనే ఉన్నాయి. హిందూమత పెద్దలు తమ వ్యవస్థలో అంతర్గత సంస్కరణలకైనా తలపెట్టకపోగా, వాటి గురించి మాట్లాడటమే హిందూ వ్యతిరేకమన్నట్లుగా వ్యవహరిస్తూ వుంటారు.
ఒక్క మాటలో ప్రజాస్వామిక యుగంలో రాజ్యం లౌకికంగా… అంటే అన్ని మతాలకు సమాన దూరంగా ఉంటూనే మత వ్యవస్థలను ప్రజాస్వామికం గావించే కృషిని చేపట్టాల్సి వుంది. కుల-మత-ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ముఖ్యంగా ఎన్నికలకు వాటిని వినియోగించుకునే తత్త్వాన్ని నిరోధించాల్సి వుంది.
“హిందూ” మతవ్యవస్థ ఏకశిలా సదృశం కాదు. అది అనేక భావజాలాల, విభిన్న ఆచార వ్యవహారాల విశాల సమాఖ్య లాంటిది. కొత్త దేవుళ్ళను సృష్టించుకోగలిగిన స్వేచ్ళగలది. ఇందులో కుల బహిష్మరణలే వుంటాయి. మత బహిష్మరణలుండవు. కారణం? మన సాంఘిక కుల, కుటుంబ వ్యవస్థల చట్రం చాలా కఠినమైనది. మత విశ్వాసాలు యధేచ్చ గలవి. అదే సమయంలో ఈ కుల చట్రం కారణంగా అన్యమతస్తులెవరినీ లోపలికి రానివ్వని ఏక కవాట లక్షణం కూడా దీనికుంది. ‘హిందూత్వ’ వాదులు మతమార్చిడిపై చేసే ప్రకటనలన్నీ ఈ వాస్తవాన్ని దిగమింగుకోలేని ఆత్మవంచనాత్మకాలే! తమను తాము సంస్కరించుకోలేని భీరు గంభీరాలే!!
