-ఆ భయంతోనే ఈడీకి రికార్డులివ్వడం లేదు
-హైకోర్టు ఆదేశించినా రికార్డులు ఇవ్వకపోవడం వెనుక పెద్ద మతలబు
-డ్రగ్స్ దందా వెనుక టెర్రరిస్టు లింకులున్నాయ్
-డ్రగ్స్ సమీక్షల పేరుతో కేసీఆర్ చేసేవన్నీ కోతలే…
-సీఎం సన్నిహితులు, మంత్రుల బంధువుల చేతుల్లోనే పబ్ లు
-24 గంటలు పబ్ లు నిర్వహించుకునేలా, అర్ధరాత్రి దాటినా బార్లు నడిచేలా ఆదేశాలిచ్చిందెవరు?
-సీఎంకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ దందాలో ప్రమేయమున్న వారందరినీ అరెస్ట్ చేయాల్సిందే
-పార్టీలతో సంబంధం లేకుండా అనుమానితులందరి నమూనాలు తీసుకుని డ్రగ్ టెస్ట్ లు చేయాల్సిందే
-2017 నాటి డ్రగ్ కేసులోని రికార్డులన్నీ ఈడీకి సమర్పించాల్సిందే
-ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్ధితిలో రాష్ట్రం
-నేటికీ 15 జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్ధితి
-క్రిమినల్స్ ను ఎమ్మెల్సీ చేయాలనే ఫైల్ పై రబ్బర్ స్టాంప్ వేసే గవర్నర్ అయితేనే కేసీఆర్ ద్రుష్టిలో మంచివాళ్లు
-రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, న్యాయంగా వ్యవహరించే గవర్నర్ మంచోళ్లు కారేమో…
-రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ దందా వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులతోపాటు టీఆర్ఎస్ నేతల హస్తముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2017 నుండే డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రముఖుల ప్రమేయం ఉందని విచారణలో వెల్లడైందన్నారు. మరి నాటి కేసు విచారణ సంగతి ఏమైందని, ఈ కేసులో ఏం సాధించారో సమాధానం చెప్పాలన్నారు. నాటి కేసు రికార్డులను, ఆధారాలను సమర్పించాలని కేంద్ర సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్పించడం లేదని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై ఈడీకి పూర్తి వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించినా… చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వివరాలు ఇవ్వడానికి భయపడుతోందని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ దందా వెనుక సీఎం సన్నిహితుల, టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని…. ఈడీకి ఆధారాలు సమర్పిస్తే… వారి పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం ఆ వివరాలివ్వకుండా తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, మైనారిటీ మోర్చా జాతీయ కార్యదర్శి లాయక్ అలీ, పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి, యువ మోర్చా జాతీయ సభ్యులు శ్రీనివాస్, కార్పొరేటర్ అంజలి, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పై తెలంగాణ ప్రజలు తలదించుకునేలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ డ్రగ్స్, తాగుబోతుల, మాఫియాలకు అడ్డగా మారింది. యువత జీవితాలు నాశనమవుతున్నాయి. తల్లిదండ్రులు భయపడుతున్నరు.డ్రగ్స్ ను నిర్మూలించాలనే సోయి కేసీఆర్ కు లేదు. ఎందుకంటే ఆయన సోయిలో లేడు. ఆయనదంతా వైన్స్ దందా…ఆ మాఫియా సపరేట్…కేసీఆర్ మనుషులు, మంత్రి అనుచరులు వైన్స్ కోసం ఢిల్లీలో కూడా టెండర్లు వేస్తున్నరు.
ఎనకటికి ‘ఉడ్తా పంజాబ్’ వచ్చింది…. ఇప్పడు ‘ఉడ్తా హైదరాబాద్’ సినిమా తీయాల్సిన పరిస్థితి. పంజాబ్ లో ప్రభుత్వం కూలిపోవడానికి డ్రగ్స్ దందాయే కారణం… టీఆర్ఎస్ కు ప్రజలు గుణ పాఠం చెప్పబోయేది కూడా డ్రగ్స్ వ్యవహారమే.నిన్న డ్రగ్స్ తీసుకుంటున్నారని 17 మంది ఐటీ ఉద్యోగులను తీసేసినరు… డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది. సమీక్ష పేరుతో ఊకదంపుడు మాటలే తప్ప చేతల్లేవ్. డ్రగ్స్ నిర్మూలనకు వెయ్యి మందితో కమిటీ వేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమైనయ్… వెయ్యి మందితో కమిటీ దేవుడెరుగు… వెయ్యి మంది డ్రగ్స్ బాధితులు మాత్రం దొరికిండ్రు..
ఐదేండ్ల కింద (2017 మార్చి) డ్రగ్ కేసులో విచారణ పేరుతో కేసీఆర్ డ్రామా చేసిండు. ఆనాడు అకున్ సభర్వాల్ హీరో మాదిరిగా నిజాయితీగా కష్టపడి విచారణ చేసి లిస్ట్ రడీ చేస్తే….. కేసీఆర్ విలన్ మాదిరిగా అడ్డుకున్నడు. ఆయన ఒత్తిళ్లకు భయపడి సభర్వాల్ ఆ విచారణ వదిలేసి ఢిల్లీకి పోయిండు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఉన్నోళ్లంతా టీఆర్ఎసోళ్లే…
ఆనాడు కెల్విన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి..విచారణ జరిపితే చాలా మంది పేర్లు బయటపెట్టారని మీడియా రాసింది. మరి ఆ కేసు ఏమైంది? ఎందుకు నీరుగారిపోయిందో సీఎం చెప్పాలి. దీనిపైన కేంద్ర సంస్థ ఈడీ విచారణ ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసు వివరాలివ్వడం లేదు. సహకరించడం లేదు.దీనిపై హైకోర్టులో ఈడీ పిటిషన్ వేస్తే గత ఫిబ్రవరి 2న స్పదించిన న్యాయ స్థానం ఈడీ కోరిన వివరాలు, రికార్డులన్నీ నెల రోజుల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్రం సహకరించకుంటే కోర్టుకు రావాలని సూచించింది.
కానీ పనికిరాని వివరాలన్నీ అందజేసిన ప్రభుత్వం… అసలు వివరాలు, రికార్డులు మాత్రం ఈడీకి ఇవ్వలేదు. దీంతో మళ్లా హైకోర్టును ఈడీని ఆశ్రయించింది. తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం కోర్టు ధిక్కరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.అసలు డ్రగ్స్ కేసు వివరాలు ఈడీకి ఎందుకు వివరాలు ఇవ్వడం లేదు? హైకోర్టు ఆదేశాలిచ్చినా వివరాలు ఇవ్వడం లేదు? దీనివెనుక ఏదో మతలబు ఉంది.
డ్రగ్స్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకైనా ప్రమేయమైనా ఉండాలి. లేదా టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండాలి. లేదా ఈ దందా పేరుతో పెద్ద ఎత్తున డబ్బులైనా దండుకుంటూ ఉండాలి. అందుకే ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు, రికార్డులు ఇవ్వడం లేదు.
డ్రగ్స్ కు దందాకు, టెర్రరిజానికి లింకుంది. తాలిబన్లు నల్లమందు (ఓపీఎం) మీద రాజ్యాన్ని నడుపుతున్నరు. గతంలో ముంబై లో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి వాళ్లంతా డ్రగ్స్ దందా చేసేటోళ్లు. వాళ్లతో అంతర్జాతీయ సంబంధాలు పెంచుకునేవాళ్లు కొందరు నాయకులు… కేసీఆర్ కూడా డ్రగ్స్ దందా పేరుతో అంతర్జాతీయంగా సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నారేమో…
కేసీఆర్ ఈరోజు ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. ఇంకా 15 జిల్లాలకు జీతాలే ఇవ్వలేదు. డబ్బులు లేవని చెబుతున్నరు. కేసీఆర్ కూడా డ్రగ్స్ దందాతో ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నారా?
పబ్బుల్లో డ్రగ్స్ దందా ఈనాటిది కాదు… ఎప్పటి నుండో నడుస్తోంది. డీజేకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇబ్బంది పెట్టే ప్రభుత్వం డిజేలతో హోరెత్తించే పబ్బులకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు. పబ్బులు నడిపేది ఎవరు?
పబ్ లో డ్రగ్స్ తీసుకున్నోళ్లలో ఎంతమంది వద్ద డ్రగ్స్ శాంపిల్స్ తీసుకున్నరు? ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదు? కేసుకు ప్రాధాన్యత లేకుండా నీరుగార్చేందుకే సీఎం కేసీఆర్ ఆదేశాలిస్తున్నరు.
పబ్బుల్లో అర్ధరాత్రి దాకా దందా… శంషాబాద్, జూబ్లిహిల్స్ 45 లో తెల్లవారిందాకా 24 గంటలపాటు పబ్ లు నడుస్తున్నయ్. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు. ఒక్కో లైసెన్స్ పేరుతో మూడు, నాలుగు పబ్ లు నడుస్తున్నయ్…
డ్రగ్స్ తో సంబంధంలేని కుటుంబ సభ్యులపై ఆరోపణలు అన్యాయం. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారితే… ప్రజల పరిస్థితి ఏమిటి? విదేశీ, ఇతర రాష్ట్రాల సంస్థలు ఎట్లా వస్తయ్?
డ్రగ్స్ తోపాటు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. పక్క రాష్ట్రం నుండి గంజాయి వస్తోంది. జైళ్లో కూడా గంజాయి సరఫరా అవుతోంది. పిల్లల జీవితాలు నాశనమవుతున్నయ్. తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నయ్ పిల్లల బాధలు చూసి…
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే సీఎం స్పందించకపోవడం దారుణం. వెంటనే సమాధానం ఇవ్వాలి. పంజాబ్ లో డ్రగ్స్ దందా అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే టీఆర్ఎస్ కు కూడా పంజాబ్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది.
డ్రగ్స్ దందాలో బీజేపీ సహా ఏ పార్టీ వాళ్ల ప్రమేయమున్నా వాళ్లను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు జరిపి చర్యలు తీసుకోవాల్సిందే… సీఎం డ్రగ్ పరీక్షలు చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నరు. టీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు సీఎం కుట్ర. బీజేపీ చూస్తూ ఊరుకోదు.
బీజేపీ యువ మోర్చా భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో ఉధ్రుతమైన ఆందోళనలు చేస్తాం. డ్రగ్స్ కేసు వివరాలు తేల్చే వరకు… దోషులను అరెస్టు చేసి విచారణ జరిపే వరకు వదిలపెట్టే ప్రసక్తే లేదు.
గవర్నర్ పై… రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్నడు. రేపు ప్రధాని అయితే రాష్ట్రపతి ఎందుకని తీసేస్తడేమో… తరువాత ఐక్య రాజ్య సమితి ఎందుకని కూడా అంటాడేమో…
గవర్నర్ ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదు. వివాదాస్పద వ్యక్తి కాదు. క్రిమినల్స్ ను ఎమ్మెల్సీ చేయాలని పంపే ఫైల్స్ పై సంతకం మాదిరిగా రబ్బర్ స్టాంప్ గవర్నర్ అయితే గొప్పవాళ్లా? అది తప్పని ఫైలు తిప్పి పంపితే గవర్నర్ మంచిది కాదా?
న్యాయంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, ప్రజల కోసం ఆలోచించే గవర్నర్ మంచిది కాదా…. కేసీఆర్ లెక్క ఫాంహౌజ్ కు పరిమితమైతేనే మంచోళ్లా?ధాన్యంపై నల్ల జెండాలతో నిరసనపై…. రైతులు ఎక్కడా నిరసనలో పాల్గొనడం లేదు. టీఆర్ఎస్ నేతలే ధర్నా చేస్తున్నరు. కేసీఆర్ పాలనపై ప్రజలు, రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నరు. టీఆర్ఎస్ నేతలు నల్ల బట్టలు కప్పుకునే తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్…