Suryaa.co.in

Andhra Pradesh

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి

-గుంటూరు తొక్కి సలాట వెనుక రాజకీయ కుట్ర కోణం
-చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మరింత అప్రమత్తంగా ఉండాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

పింఛన్ లబ్ధిదారులకు దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ చేత విచారణ జరిపించాలి. గుంటూరు తొక్కిసలాట వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు . వృద్ధాప్య పింఛనుదారులు పంపిణీ చేసిన దొంగ నోట్ల వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలి. మా పార్టీ నేతలను ప్రజలంతా దొంగలుగా భావిస్తున్నారు. తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షించాలి. మా పార్టీ పెద్దలకు అప్రతిష్ట లేకుండా చూడాలి. దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఇటీవల డీజీపీగా పదోన్నతి పొందిన సునీల్ కుమార్ విచారణ చేసి ప్రభుత్వం తప్పు లేదంటే… కావాలనే చెప్పించారని అంటారు. అందుకే ఎన్ఐఏ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలి. దొంగ నోట్ల పంపిణీతో పింఛన్ ప్రపంచం నిర్గాంత పోయింది. తమకిచ్చిన డబ్బులలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయా? అని వృద్ధులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మరొకసారి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి.

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని తనవంతుగా లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వాలంటీర్లు దొంగ నోట్లు ఇస్తున్నారా?, లేకపోతే వారితో ఎవరైనా ఇప్పిస్తున్నారా?? అని ప్రశ్నించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత ఆ డబ్బులలో దొంగ నోట్లు ఎవరైనా పెడుతున్నారా?, లేకపోతే పెట్టిస్తున్నారా?? అన్నది తేలాలన్నారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం… వాలంటీర్ తానే ఆ తప్పు చేశానని అంగీకరించడంతో కేసును మూసి వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా??, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్టు తేలిందన్నారు.

నేరుగా డబ్బుల పంపిణీ వెనుక జగన్ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది
పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ దురుద్దేశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ప్రతి నెల 1800 కోట్ల రూపాయల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపి పంపిణీ చేసిన 80 కోట్ల రూపాయల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్తాయన్నారు.
తెలంగాణలో పింఛన్ లబ్ధిదారులకు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, లబ్ధిదారుల వద్ద వేలి ముద్రలు తీసుకొని, నగదును అందజేస్తున్నారు. దీనితో దొంగ నోట్ల పంపిణీకి అసలు ఆస్కారమే లేదు. కానీ రాష్ట్రంలో ఇంటింటికి ఉదయాన్నే వెళ్లి, వాలంటీర్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే పంపిణీ చేయడం వల్ల , వాలంటీర్లు ఇచ్చే నోట్లను లబ్ధిదారులు సరిగ్గా పరిశీలించే అవకాశం లేదు. పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ వెనుక రాజకీయ స్వలాభంతోపాటు, దొంగ నోట్ల చలామణి కోసం వాలంటీర్లు ఈ విధానాన్ని అణువుగా మలుచుకునే అవకాశం ఉంది. దొంగ నోట్లు చలామణి కావద్దని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధానమంత్రి సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో మద్యం లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీన ఒక్క రోజే 145 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో మద్యం విపరీతంగా సేవించారని రాసిన సాక్షి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ లోని మద్యం అమ్మకాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ప్రతిరోజు 80 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నగదు రూపంలో జరుగుతున్నాయి. అంటే సంవత్సరానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరుగుతుండగా, 20వేల కోట్ల రూపాయల పింఛన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం నగదు రూపంలోనే పంపిణీ చేస్తోంది . దేశంలో ఏ రాష్ట్రంలోను ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తం లో నగదు లావాదేవీలు నిర్వహించడం లేదు. మద్యం లావాదేవీలు నగదు రూపంలో నిర్వహించవద్దని న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడైతే జీతం ఎందుకు ఇస్తున్నారు?
వాలంటీర్ వ్యవస్థను గతం లో తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, గత నెలలో గృహ సారథులు అనే వ్యవస్థను ప్రవేశపెట్టిందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతను వాలంటీర్లకు కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఏమైనా అవకతవకలు జరిగితే వారిని ఎక్కడ కూడా బాధ్యులను చేయలేదు. కానీ వాలంటీర్లకు ఐడి కార్డులను జారీ చేసింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా?, కాదా?? అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడైతే, అతనికి ప్రభుత్వ ఖాతా నుంచి జీతం ఎందుకు ఇస్తున్నారు?. వాలంటీర్ల చేత ఎటువంటి పనులు చేపిస్తున్నారో ప్రజలందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు కొత్తగా గృహ సారథులనే వ్యవస్థను తీసుకువచ్చారు. తాము వచ్చినా రాకపోయినా గృహ సారథులు మీ ఇంటికి వస్తారని వాలంటీర్లు చెబుతున్నట్లుగా తెలుస్తోందని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.

రంగం చిత్రం సీన్ గుంటూరు సభలో ఆవిష్కృతం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో రంగం సినిమాలోని సీన్ ఆవిష్కృతమైందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాజకీయంగా కుట్రలు ఎలా జరుగుతాయో, రంగం చిత్రంలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. సభ నుంచి చంద్రబాబు నాయుడు నిష్క్రమించగానే, ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో చీరల పంపిణీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చీరల పంపిణీ ప్రారంభించి ఉంటే, అప్పుడే ఈ సీన్ ను సృష్టించి ఉండేవారేమో. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేపట్టారు. ఒక 40 నుంచి 50 మంది సభికుల్లో కలసిపోయి ఇతర పార్టీల కార్యకర్తలతో చేరిపోయి తోపులాట జరిపితే, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది.

కందుకూరు లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే, మరొక ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే పోలీసు వైఫల్యం, ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. వరుస సంఘటనలను పరిశీలిస్తే, ఈ ఘటన వెనుక కుట్ర కోణం తేట తెల్లం అవుతుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే 15 మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనుమానాలకు తావునిస్తోంది. మృతుల బంధువులను పట్టుకొని చంద్రబాబు నాయుడు సభలకు తమ వారిని బలవంతంగా తరలించారని చెప్పించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే మృతులను చంద్రబాబు నాయుడు సభకు బలవంతంగా తరలించారని బంధువులకు, మృతి చెందిన వారు చెప్పే అవకాశమే లేదు. అటువంటప్పుడు బలవంతంగా తరలించారని చెబుతున్నారంటే అనుమానించక తప్పదు. మృతుల బంధువులతో ఫిర్యాదు చేయించగానే, పోలీసులు ఆఘమేఘాల మీద నిర్వాహకులపై లేదంటే చంద్రబాబు నాయుడు పై ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. తొక్కి సలాటలో మృతి చెందిన వారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారని తమ పార్టీ నాయకులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

మరి అటువంటప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల కు గ్రీజు పెట్టకపోవడం వల్ల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 50 మంది మృతి చెందారు. ఆ హత్యలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్లయితే, ఈ హత్యలు కూడా చంద్రబాబునాయుడు చేసినట్లు అవుతుంది. సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటిస్తారని, బాధితుల బంధువుల చేత తమ పార్టీ నేతలు ఫిర్యాదు ఇప్పించగానే సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగా చంద్రబాబు నాయుడు సభలకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రులు స్టేట్మెంట్లను ఇవ్వడం పరిశీలిస్తే, ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఏమిటో తేటతెల్లమవుతుంది. బాబాయిని హత్య చేసిన వారికి, సభలో తొక్కిసలాటలు సృష్టించడం పెద్ద కష్టమేమీ కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

బాబు సభల అనుమతి నిరాకరణకు కుట్ర

చంద్రబాబు నాయుడు సభల నిర్వహణకు అనుమతి నిరాకరణకు తమ పార్టీ నాయకులు, మంత్రులు కుట్ర చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . సెక్యూరిటీ లేని సభలకు అనుమతి ఇవ్వవద్దని అమాత్యులు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. సభలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే. జగన్మోహన్ రెడ్డి సభలకు వేలాది మంది పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తుండగా, చంద్రబాబు సభలకు 40 నుంచి 50 మంది పోలీసులు కూడా ఉండడం లేదు. బాబు సభలకు ఎక్కువ మందిని సెక్యూరిటీ కోసం వినియోగించక పోవడం ఆశ్చర్యం. ఏ సభకు చూసిన 50 వేల మందికి తక్కువ గా ప్రజలు హాజరు కావడం లేదు. అటువంటప్పుడు సభల వద్ద బందోబస్తు నిర్వహణ పోలీసులదే. గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి టిడిపి నాయకులు తేరుకోకముందే, తమ పార్టీ నాయకులు, మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లను పరిశీలిస్తే ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ కుట్ర వెనుక తమ ప్రభుత్వ పెద్దలు ఉన్నారా?, లేకపోతే మా పార్టీ పెద్దలు ఉన్నారా?? అన్నదానిపై రాష్ట్ర పోలీసుల చేత కాకుండా, ఇతర రాష్ట్ర పోలీసుల చేత విచారణ జరిపించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.

ముచ్చటగా మూడవసారి జరిగే అవకాశం
చంద్రబాబు నాయుడు సభలో ముచ్చటగా మూడవసారి తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే పోలీసులు సెక్యూరిటీని కల్పించారని, సభలో చేరిపోయి కొంతమంది తొక్కిసలాటలు సృష్టించేందుకు కుట్రలు చేస్తారు. ఇకపై నిర్వహించనున్న సభల పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అప్రమత్తంగా ఉండాలి. జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించనున్న సభకు పోలీసు సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఎటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా జనసేన నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

రాజమండ్రి సభ లో పింఛన్ల సొమ్ము పంపిణీ చేయవద్దు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల సొమ్ము పంపిణీ చేసినప్పటికీ, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పంపిణీ చేయలేదు. వైయస్ జగన్ సభకు హాజరైన వారికే, పింఛన్ డబ్బులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సభకు డ్వాక్రా మహిళలు, పాఠశాలను మూసివేసి విద్యార్థులను తరలిస్తారు. వృద్ధులను వదిలి వేయండి. పింఛన్ మొత్తాన్ని సభకు హాజరైన వారికే అందజేస్తామని చెప్పి షరతు విధించడం సరికాదు. సభా ప్రాంగణంలోనే నగదును పంపిణీ చేస్తామంటే, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

LEAVE A RESPONSE