-తెలంగాణా మంత్రులు భయంతో ఉన్నారు
– శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో దొంగ కరెంట్‌వేసి నీళ్లను సముద్రంలోకి పంపుతుంటే ఈ రాష్ట్రాన్ని వాళ్లు ఇక ఉద్దరించేది ఏమీ లేదు
– ఇంత ద్రోహం రాష్ట్రానికి చేసి నవ్వుతారని కూడా లేకుండా తెలంగాణా మంత్రులు పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారు
– బీఆర్‌ఎస్ పార్టీ..సీపీఐ, కాంగ్రెస్‌లతో పోటీ పడుతుంది
– బీఆర్‌ఎస్ పార్టీ రావడం తప్పేమీ లేదు
– ఆదివారం వచ్చే అడ్డగాడిద ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు..?
– గుంటూరులో తొక్కిసలాట జరగ్గానే నాలుక మడతేసిన చంద్రబాబు, ఎల్లో మీడియా
– చంద్రబాబుకు ప్రజల్ని ఆకర్షించే శక్తి లేదని తేలిపోయింది
– గుంటూరు సభ అనుమతికి టీడీపీ లెటర్ హెడ్‌పై దరఖాస్తు చేశారు
– మూడు ప్రాణాలు తీసి ఇప్పుడు సంబంధం లేదంటే ఎలా..?
: మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని)
– ఎల్లో మీడియాది నాలుక ఎటైనా తిప్పగలిగే దిగజారుడు జర్నలిజం
– సభకు ముందు చంద్రన్న కానుక అన్నారు..తర్వాత మా బాబుకు సంబంధం లేదంటున్నారు
– అన్ని దరఖాస్తులు చేసింది టీడీపీ నేతలైతే మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ ఎక్కడ్నుంచి వచ్చింది..?
– చంద్రబాబు పేరు చెప్తే జనాలు రావడం లేదనే టోకెన్లిచ్చి ఆశ చూపుతున్నారు
– ఇది ముమ్మాటికీ డ్రోన్ షాట్ల కోసం ఆడిన రాక్షసక్రీడే
– చంద్రబాబూ…నీ రాజకీయక్రీడకు అమాయకపు ప్రజల్ని బలితీసుకోవద్దు
– ఆదివారం వచ్చే అడ్డగాడిద ఈ రాక్షసక్రీడను ఎందుకు ప్రశ్నించడం లేదు..?
– సొంత కొడుకే చంద్రబాబు బతికుండగానే ఫోటో లేకుండా చేశాడు.
– బాబుకి దత్తపుత్రుడిపైనే నమ్మకం…దత్తపుత్రుడిపై సీపీఐ రామకృష్ణకు ప్రేమ
– హరిరామయ్య జోగయ్య దీక్ష ఒక మ్యాచ్ ఫిక్సింగ్
బీఆర్‌ఎస్ పార్టీ..సీపీఐ, కాంగ్రెస్‌లతో పోటీ పడుతుంది…
జనసేన పార్టీలో రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌కి వెళ్తుంటే పవన్‌కళ్యాణ్ ని అడగాలి. వాళ్లు ఎందుకు వెళ్తున్నారో పవన్ చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ రావడం తప్పేమీ లేదు..ఎవరైనా పార్టీ పెట్టవచ్చని చెప్పాను. సీపీఐ, కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతుందని కూడా గతంలోనే చెప్పాను. తెలంగాణా మంత్రులు భయంతో ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నట్లున్నారు. వాళ్ల తిప్పలు వాళ్లను పడమనండి. ఈ రాష్ట్రాన్ని వారు ఉద్దరించేది ఏమీ లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో దొంగ కరెంట్‌వేసి నీళ్లను సముద్రంలోకి పంపుతుంటే ఈ రాష్ట్రాన్ని వాళ్లు ఇక ఉద్దరించేది ఏమీ లేదు. మా ఆస్తులను పంచారా..? కరెంటు బాకీలు కట్టలేదు..ఇంత ద్రోహం రాష్ట్రానికి చేసి నవ్వుతారని కూడా లేకుండా తెలంగాణా మంత్రులు పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారు. పిరమిడ్ పార్టీ, కేఏ పాల్ పార్టీలు కూడా 175 స్థానాలకు పోటీ చేశాయి. ఇక బీఆర్‌ఎస్ చేస్తే తప్పేమీ లేదు.
హరిరామ జోగయ్య దీక్ష ఒక మ్యాచ్ ఫిక్సింగ్
హరిరామ జోగయ్య, పవన్ కళ్యాణ్ లు మాట్లాడుకునే దీక్ష చేస్తున్నామని వారే చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్తే దీక్ష విరమించడంలో విడ్డూరం ఏముంది..? ఇదంతా మ్యాచ్ ఫిక్సింగే కదా. అంతకు ముందు ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడు హరరామజోగయ్య కాపులను ఏమన్నా ఉద్దరించాడా..? ఇవాళా వచ్చి మొసలి కన్నీరు కార్చడం ఎందుకు..? పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో కుమ్మక్కై పోయే వయసులో కాపులను మోసం చేయవద్దు. నిన్న గుంటూరు పట్టణంలో రాజకీయపరమైన దుర్మార్గపు క్రీడ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ సభ జరిగిందనేది అందరికీ తెలిసిందే. నిన్న ఉదయం నుంచే ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు వారి ఎల్లో మీడియా గొప్ప సభ జరుగుతుందని చెప్పడానికి బాహాటంగానే ప్రయత్నం చేశాయి. పేదల ముంగిట.. ముందే సంక్రాంతి అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి బాజా భజంత్రీలతో రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు బాగా ప్రచారం చేశారు. 30 వేల మందికి చంద్రన్న కానుకలు రెడీ చేశామని, భోజన వసతి కూడా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలే చెప్పారు.
సంక్రాంతి కానుకల పంపిణీ గుంటూరు నుంచే ప్రారంభిస్తున్నాం అని పటాటోపంగా చెప్పుకున్నారు. ఆ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించగానే ఆ పత్రికలు, చానళ్లు ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబుకు ఎక్కడ రక్తపు మరకలు అంటుతాయోనని, ఏదో ఎన్నారై ఫౌండేషన్ ఆ కార్యక్రమాన్ని చేసింది అంటూ ప్లేటు ఫిరాయించారు. “చంద్రబాబు ఊరకనే చుట్టపు చూపుగా వచ్చారు..దీనికి చంద్రబాబుకు సంబంధం లేదని” చెప్పుకొచ్చారు. చంద్రబాబు కోసం ఎన్ని అకృత్యాలనైనా చేయగల మీడియా ఎల్లో మీడియా. నాలుక ఎటైన తిప్పగలిగే దిగజారుడు జర్నలిజాన్ని చేస్తున్నాయని జగన్ ప్రతి రోజూ చెప్తూనే ఉన్నారు.
మీకు సంబంధం లేకపోతే టీడీపీ అనుమతులకు ఎందుకు దరఖాస్తు చేసింది..?
పేదలకు సాయం అందించడంలో విషాదం, విచారకరం అంటూ చంద్రబాబు ఒక దిక్కుమాలిన ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. 40 ఏళ్లు రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకునే ఒక రాజకీయనాయకుడి చీకటికోణం, దిక్కుమాలిన రాజకీయానికి ఈ ప్రెస్ నోట్ అద్దం పడుతోంది. డిసెంబర్ 29వ తేదీన గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని, దానికి చంద్రబాబు హాజరవుతారని టీడీపీ లెటర్ ప్యాడ్‌పై పోలీసులకు అనుమతి కోసం లేఖ రాశారు.
ఆ స్థల యజమాని చిరుమామిళ్ల వెంకటకృష్ణ తనకు సభ పెట్టుకోడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్వోసీ ఇచ్చినట్లు డిఎస్పీకి తెలిపారు. మైక్ అనుమతికి కోసం నాయుడు ఓంకార్ అనే వ్యక్తి గుంటూరు టీడీపీ కార్యాలయం నుంచి చలనా కట్టారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. సంఘటన జరగక ముందు వరకూ టీడీపీ కార్యక్రమం. సంఘటన జరిగిన తర్వాత తూచ్… అంటూ ఎవరో ఎన్నారై పెట్టిన కార్యక్రమం అంటున్నారు. అవలీలగా వారి రాజకీయం కోసం మనుషుల పేదరికాన్ని, బలహీనతల్ని ఎరగా వాడుకోవాడానికి వెనుకాడలేదు. ముగ్గురు అశువులు బాసితే మాకేం సంబంధం లేదంటున్నారు. మరి అనుమతుల కోసం తెలుగుదేశం వారు ఎందుకు అర్జీ లు పెట్టారు..?
మీటింగులకు జనం రాకపోతే జనాన్ని తెచ్చుకునే నీచమైన స్థాయికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు దిగజారిపోయారు. 30 వేల మందికి ఇంటింటికీ వెళ్లి మేము టోకెన్లు ఇచ్చామంటూ వారి పార్టీ వారే చెప్తున్నారు. మరి 10 వేల మందితో బహిరంగ సభ అనడం ఏమిటి…? రాజకీయ పబ్బం గడుపుకునేనందుకు ముగ్గురు ప్రాణాలుతీయడం దుర్మార్గం. అనుమతులకు దరఖాస్తు చేసింది టీడీపీ నేతలైతే మధ్యలో ఉయ్యూరు ఫౌండేషన్ ఎక్కడనుంచి వచ్చిందో వారు సమాధానం చెప్పాలి.
చంద్రబాబు పేరు చెప్తే జనాలు రావడం లేదని టోకెన్లిచ్చి ఆశ చూపుతున్నారు:
సరుకు లేని లారీలకు దుర్మార్గంగా పరదాలను కప్పి పేదవారిని మభ్యపెట్టారు. 30 వేల మంది అమాయకులకు టోకెన్లు ఇచ్చారు. చంద్రబాబు మీటింగు కు జనసమీకరణ కేవలం టోకెన్ల ఖర్చుతో నడిపించేద్దామని ప్రయత్నం చేశారు. పది వేల మందికి అనుమతి పెట్టి…30 వేల మందికి టోకెన్లు ఇచ్చి…సరుకు ఇవ్వకుండా నీచంగా వ్యవహరించారు. అక్కడకు జనసమీకరణ ఉయ్యూరు ట్రస్ట్ చేసిందా..? టీడీపీ చేసిందా..? ఇక మీదట కూడా అమెరికా స్వచ్ఛంద సంస్థల పేరుపై టీడీపీ ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలు ఇంకా కొనసాగించబోతున్నారా అనేది సమాధానం చెప్పాలి. టీడీపీ పేరు చెప్తే జనాలు రావడం లేదని..ఇలాంటి స్వచ్ఛంద సంస్థల పేరుతో టొకెన్లు పంచి మీ సభలకు జనాల్ని రప్పించుకుంటున్నారా..?
డ్రోన్ షాట్ల కోసం ఆడిన రాక్షసక్రీడ ఇది…
టీడీపీ వారు పాపాలు చేసి..పేదలైన అమాయకపు ప్రజలకు కాళీ లారీలను చూపించి ఆశ చూపించారు. చంద్రబాబునాయుడు ఆ సరుకులు పంపిణీ అయ్యేంతవరకు ఉండాలి కదా..ఎందుకు ముందుగానే వెళ్లిపోయాడో అర్ధం కావడం లేదు. డ్రోన్ షాట్లు కోసం పది, ఇరవై అడుగుల రోడ్లలో మీటింగులు పెట్టి రాక్షసక్రీడ ఆడాల్సిన ఖర్మ చంద్రబాబునాయుడికి పట్టింది.లేని అమరావతి, రాని పరిశ్రమలు ఉన్నాయంటూ… గ్రాఫిక్స్‌కు అలవాటు పడిన చంద్రబాబుకు 2014 నుంచీ ఇదే ఖర్మ పట్టింది. రాబిన్ శర్మ అయినా చంద్రబాబుకు చెప్పాలి…రాజకీయ క్రీడకు అమాయకపు ప్రజల్ని బలితీసుకోవద్దని, మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పండి.
చంద్రబాబుకు ప్రజల్ని ఆకర్షించే శక్తి లేదని తేలిపోయింది
చంద్రబాబుకు ప్రజల్ని ఆకర్షించే శక్తి లేదు. ఆయన కొడుక్కి అంతకంటే లేదు. అంతేకాదు బాబు మీద కొడుక్కి ఏ మాత్రం నమ్మకం లేదు. అందుకే తన పాదయాత్ర పోస్టర్‌లో లోకేష్ తన తండ్రి ఫోటో కూడా లేకుండా చేశాడు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆయన ఫోటోలు కూడా లేకుండా చేస్తే కొడుకు బతికుండగానే చంద్రబాబు ఫోటో లేకుండా చేశాడు. ఇదంతా ఎన్టీ రామారావు ఆత్మ తీర్చుకునే ప్రతీకారం.చంద్రబాబు వెళ్లేలోపే ఇవన్నీ చూడాలని రామారావు గారు పైనుంచి కోరుకుంటున్నట్టున్నారు.
బాబుకి దత్తపుత్రుడిపైనే నమ్మకం..
బాబుకేమో దత్తపుత్రుడు మీద నమ్మకం ఎక్కువ. దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు కన్ను కొడుతుంటాడు. బీజేపీతో స్నేహం చేస్తున్న దత్తపుత్రుడంటే సీపీఐ రామకృష్ణకు ఇష్టం. సాధారణంగా కమ్యూనిస్టులు బీజేపీతో ఎవరున్నా అసహ్యంచుకుంటారు. కానీ విచిత్రంగా బీజేపీ చంకలో ఉన్న పవన్‌కళ్యాణ్ అంటే మాత్రం సీపీఐ రామకృష్ణకు విపరీతమైన మోజు. వీళ్లందరంటే ఎల్లో మీడియాకు విపరీతమైన ప్రేమ. ఇలాంటి వ్యక్తిత్వం లేనివారితో పోరాటం చేయడం మా దురదృష్టం. అందర్నీ కలుపుకుంటే తప్ప జగన్ గారితో పోరాటం చేయలేం, లేదంటే అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదనేది వాళ్ల ఆలోచనలా కన్పిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ అందరం కలవాలి..వ్యతిరేక ఓటు చీలకూడదు అంటాడు. పార్టీలన్నీ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ని ఓడించలేము అంటున్నారంటే.. జగన్ ఎంత బలంగా ప్రజల గుండెల్లో ఉన్నారనేది అర్ధం అవుతుంది. మీరెంత మంది వావి వరుసలు లేకుండా కలిసినా, గుంపులుగా జగన్ గారిపై ఎన్ని యుద్ధాలు ప్రకటించినా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్న జగన్ గారిని ఢీ కొట్టలేరు. చంద్రబాబు తనవైపు లేని ప్రజల్ని ఉన్నారంటూ చూపించుకోవడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి చేసే ఇలాంటి జుగుప్సాకరమైన రాజకీయాలు కట్టిపెట్టాలని కోరుతున్నాను.
లోకేష్ నాయకత్వాన్ని సొంతపార్టీ నేతలే గుర్తించడం లేదు:
లోకేష్ ని ఎవరు గుర్తించారు..? కార్యకర్తలు ఎవరూ అతన్ని గుర్తించడం లేదు. లీడర్లు కూడా అతన్ని నాయకుడిగా ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు అందుకే రిటైర్ అవుతానని చెప్పి కూడా కొనసాగుతున్నాడు. ఆ గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారిపై హద్దు మీరి మాట్లాడితే కార్యకర్తలు గుర్తిస్తారనే భ్రమలో ఉన్నాడు.
ఆదివారం వచ్చే అడ్డగాడిద ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు..?
ఆదివారం నాడు సెలవు దొరకగానే ఒక అడ్డగాడిద వచ్చి జగన్ గారిని తిట్టి వెళ్లిపోతోంది. ఇప్పటంలో ఎంత రచ్చ చేశారో చూశాము. అంత రచ్చ చేసిన వాళ్లు వారి పార్టనర్లు ఓ దుర్మార్గపు రాజకీయ క్రీడలో ఆమాయకపు ప్రజల ప్రాణాలను బలిగొంటే మాట్లాడటం లేదేమని ప్రశ్నించాం. ఇదేనా మీ నైతిక విలువలు అని ప్రశ్నిస్తున్నాం.
ఎన్నారైలు… చంద్రబాబు పిలిచాడు కదా అని వచ్చి ఇరుక్కోవద్దు
ఇది టీడీపీ ప్రభుత్వం కాదు. జగన్‌గారి ప్రభుత్వం. పోలీసులు వారి పని వారు చేసుకుపోతారు. దీనికి బాధ్యత నేనేనని ఉయ్యురు ఫౌండేషన్ శ్రీనివాస్ ఒప్పుకున్నారు.తర్వాత ఆయన ఇంకా ఏం చెప్తాడో చూడాలి. ఎన్నారైలందరికీ చెప్తున్నా… టీడీపి వీళ్లు పిలిచారు కదా అని వచ్చి ఇరుక్కోవద్దని సలహా ఇస్తున్నా.