-అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు
-రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పర్యటనలో పంట నష్టాలను తన దృష్టికి తీసుకుని వచ్చిన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం తాత్సారం చేయడం వలనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడంలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోయిన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని సూచించారు. రుణమాఫీ చేయకపోయిన పర్వాలేదు. పంటలు వేసుకోవడానికి రైతులు పెట్టుబడులు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.