-బతుకు భవిష్యత్తు లేకుండా చేసి పండుగ చేసుకోమంటే ఎట్లా చేసుకుంటారు?
-సోనియా గాంధీ బొమ్మ పెట్టుకుని పాలాభిషేకం చేయాలి
-సోమేశ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ అడ్వైజర్ పదవి ఎలా నిర్వహిస్తారు?
-అక్కడ సహకరించని ఆరోగ్యం, ఇక్కడ ఎలా సహకరిస్తుంది?
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
లింగాల మండలం: టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెస్తే… లక్షల కోట్ల విలువైన భూములను మల్టీ నేషనల్ కంపెనీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెడుతున్నది.పెట్టుబడులు తీసుకురావడానికి అమెరికా, సింగపూర్ ఇతర దేశాలకు మంత్రి కేటీఆర్ వెళ్లి వచ్చి హైదరాబాదులో విలువైన భూములను చూసి అందులో ఉండే పేదలను బలవంతంగా కాళీ చేయించి ఆ కంపెనీలకు కట్టబెడుతున్నారు.
అంకెలు కావివి.. అద్భుతం అంటూ దోపిడీ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఐ పాస్ జోష్ అంటూ మంచి నినాదం పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఆనందం ప్రజల్లో కనిపించడం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దగా పడిన ప్రజలు నిరాశ నిస్పృహాలతో ఉండగా దానిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ 200 కోట్ల రూపాయలు కేటాయించింది.
దశాబ్ది ఉత్సవాలు దేనికోసం చేసుకోవాలి? ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వనందుకా? ఇండ్లు ఇస్తామని హామీ విస్మరించినందుకా? నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వనందుకా? ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం లో విద్యను అందిస్తామని చెప్పి విస్మరించినందుకా? కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకా? రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినందుకా? గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాల భూములను తిరిగి గుంజుకుంటున్నందుకా? దేనికి ఈ ఉత్సవాలు? ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గం.
బిఆర్ఎస్ పాలన బాగుంటే ప్రజలే స్వచ్ఛందంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకునేవారు.ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం పండుగలను చేసుకోవాలని ప్రజలకు ఎవరు చెప్తున్నారు?బిఆర్ఎస్ పాలనలో పేదలకు బతుకు భవిష్యత్తు లేకుండా చేసి పండుగ చేసుకోమంటే ఎట్లా చేసుకుంటారు?
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ దశాబ్ది ఉత్సవాలు చేసుకునేవారు సోనియా గాంధీ బొమ్మ పెట్టుకుని పాలాభిషేకం చేయాలి. పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు లేకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి., ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియాగాంధీ.
పేదల భూములను లాక్కుని బహుళ జాతి కంపెనీలకు అప్పజెప్పి ప్రజాసంపద దోపిడీ చేసేటువంటి కేసీఆర్ ను చూపించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పండుగ చేసుకోమనడం తెలంగాణకే అవమానం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సోనియాగాంధీకి కృతజ్ఞత దినోత్సవంగా నిర్వహించాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు ఏంటి! తెలంగాణ లక్ష్యాల సాధనకు అద్దంకిగా ఉన్నది ఎవరు? అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.
తెలంగాణలోని ప్రతి ఇంట్లో భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం కోసం కచ్చితంగా చర్చ జరగాల్సిందే. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణలో భయం భయంతో బతకాల్సిన దుస్థితి సబ్బండ వర్గాలకు ఎందుకు వచ్చిందో ఈ సందర్భంగా చర్చ జరగాల్సిందే
వాస్తవాలను వాస్తవాలుగా రాసి చూపించే మీడియా సంస్థలపై కూడా నిషేధం విధిస్తారన్న భయం వెంటాడుతున్నది. హిట్లర్ ఫాసిస్టు లాంటి ధోరణితో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పై ప్రతి ఇంట చర్చ జరగాలి.స్వేచ్ఛ ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడి అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలి.
ప్రజలకు భ్రమలు కల్పించడంలో బిఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల అప్పుడే ఇచ్చిన హామీలు, బర్లు, గొర్లు సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని చెన్నకేశవ, ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాలు చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న భూసేకరణ చేయకుండా ప్రజలను మరోసారి మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రి హరీష్ రావు చెన్నకేశవ, ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలకు జీవో వచ్చిందని పనులు మొదలు పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది.బిఆర్ఎస్ పరిపాలన సమయమే అయిపోతున్నది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు పూర్తి చేస్తారు?అచ్చంపేట కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నీరు ఇవ్వాలని ప్రజలు అడుగుతుండగా… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఇస్తామని పదేళ్లుగా భ్రమలు కల్పిస్తున్న బిఆర్ఎస్.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అంతర్బాగమైన వట్టెం, ఏదుల్లా, నార్లాపూర్, ఉదండాపూర్, లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుల నిర్మాణాలే పూర్తి కాలేదు.పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద పంపులే బిగించలేదు చెన్నకేశవ, ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారు?ఎండమావుల భ్రమలు కల్పించడంలో… అబద్ధాలు ప్రచారం చేయడంలో హరీష్ రావు గోవెల్స్ ను మించిపోయారు.
ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సర్వే నెంబర్ 83 లో ఉన్న 1400 ఎకరాలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు.రాయవరం క్యాంపు, అంబటిపల్లి లో ఉన్న 750 ఎకరాలను నిషేధిత జాబితాలో పొందుపరిచి పేద రైతులకు భూమిపై హక్కు లేకుండా చేయడం దుర్మార్గం.గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములు లాక్కోవడానికి ధరణి తీసుకువచ్చిన సూత్రధారి రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేయడం చేతకాదని విఆర్ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ అడ్వైజర్ పదవి ఎలా నిర్వహిస్తారు?. అక్కడ సహకరించని ఆరోగ్యం, ఇక్కడ ఎలా సహకరిస్తుంది? రెవెన్యూ రికార్డు అప్డేషన్ లో జరిగిన తప్పుల వల్ల సమాజం అల్లకల్లోలంగా మారి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
సెల్ఫీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మార్పు కోసం జరుగుతున్నందున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి పదేళ్లు కావస్తున్న కల్వకుర్తి నెట్టెంపాడు బీమా కోయిలసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాల్సిన పిల్ల కాలువలను తవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం.
ఇంటికో కొలువు, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసిన కేసీఆర్. ప్రభుత్వాలు పాలకులు శాశ్వతం కాదు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరించి కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టేటువంటి పోలీస్ అధికారులను ఎవరిని వదలం. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే వారిపై సమగ్ర విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకుంటాము.