-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-వర్చువల్ మోడ్‌లో విశాఖపట్నం గ్లోబల్ హెల్త్ సమ్మిట్ లో పాల్గొన్న గవర్నర్
విజయవాడ, జనవరి 7: ప్రజారోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజంలోని బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడమేనని, దీనికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యమివ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
విశాఖపట్నంలో శనివారం జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) గ్లోబల్ హెల్త్ సమ్మిట్ – సీఈవో ఫోరమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ రాజ్‌భవన్ నుండి గవర్నర్ దృశ్యశ్రవణ మాధ్యమంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఎఎపిఐ యొక్క కార్యకలాపాలు అభినందనీయమని, భారతదేశంలో రోగుల ఆరోగ్య సంరక్షణకు సహయపడుతున్నారని వివరించారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు విభిన్న సేవలు అందించటం ముదావహమన్నారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ప్రజా రోగ్య రంగంలో భారతదేశం సవాళ్లను ఎదుర్కొంటుందని, పేదరికం వల్ల ఒక దశాబ్దం నుండి దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గిందన్నారు. దేశం శక్తివంతమైన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలతో పాటు ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నప్పటికీ, పిల్లల పోషకాహార లోపం, తక్కువ జనన బరువుల పరంగా సవాలును ఎదుర్కొంటుందన్నారు.
ఇది అకాల మరణాలు, జీవితకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ధనవంతులు, పేదల మధ్య, పట్టణ, గ్రామీణ ప్రాంత వాసుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయని గవర్నర్ అన్నారు.
భారత ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన పేద జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుందని, కార్పొరేట్ సంస్ధలు సామాజిక బాధ్యతగా వ్యాధుల నివారణ కార్యకలాపాలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అధ్యక్షుడు డాక్టర్ రవి, ఇండియా చాప్టర్ ప్రతినిధి డాక్టర్ టి రవిరాజు, డాక్టర్ ప్రసాద్ చలసాని, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంగీతారెడ్డి, డాక్టర్ జగదీష్ బాబు, అమెరికా, ఇండియా నుంచి ఫ్యాకల్టీ, ప్రతినిధులు, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ సీఈఓలు పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా తదితరులు పాల్గొన్నారు.