Suryaa.co.in

Andhra Pradesh

స్పీకర్‌పై టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణం

-చంద్రబాబు స్కెచ్‌ ప్రకారమే సభలో టీడీపీ దౌర్జన్యం
-అమాయక ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకే జీవో.1
-పబ్లిసిటీ పిచ్చితో ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ 40 మంది ప్రాణాలను బలితీసుకున్నాడు
-అసెంబ్లీలో టీడీపీ తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ధ్వజం

అసెంబ్లీ: అసెంబ్లీలో పోడియం వద్ద స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దుర్మార్గం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు పూర్తిగా సంస్కారం కోల్పోయి, గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదుకాబట్టే దిక్కుతోచని పరిస్థితుల్లో, చేతగానితనంతో శాసనసభలో టీడీపీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇదంతా చంద్రబాబు స్కెచ్‌ అని మంత్రి రజిని అన్నారు. శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సభా సంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును అందరూ ఖండించాలి. చంద్రబాబు హయాంలో బీసీలను ఏ విధంగా మోసం చేశారు, అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. స్పీకర్‌ స్థానంలో ఉన్న బీసీ నేతకు ఇంతటి అవమానం తలపెట్టారంటే ఇది దారుణం. ఇది ప్రీప్లాన్డ్‌గా చేసినట్టుగా ఉంది. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి చులకన. జీవో.1 గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. పోలీస్‌ చట్టం 1861 ప్రకారం ప్రభుత్వం జీవో.1ను తీసుకువచ్చింది.

కందుకూరులో టీడీపీ సభలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్ల 8 మంది అమాయకులు బలైపోయారు. గుంటూరు జిల్లాలో సరుకులు పంపిణీ చేస్తామని అమాయక మహిళలను తరలించి ముగ్గురిని బలితీసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించాం. ప్రమాదానికి గల కారణాలు, చనిపోయిన వారి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. అమాయక ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి చూస్తూ ఉండాలా..? 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అనే చంద్రబాబు గతంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నాడు. పబ్లిసిటీ పిచ్చితో 40 ఏళ్ల ఇండస్ట్రీS40 మంది ప్రాణాలను బలితీసుకున్నాడు.

అమాయక ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకే జీవో.1ను సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారు. దుర్మార్గాలు చేయడం టీడీపీకి అలవాటైపోయింది. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రానికి అమిత్‌షా వస్తే ఆయనపై రాళ్లు వేయించాడు. దీనిబట్టి ఇలాంటి కుట్రలు, రౌడీయిజం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. చంద్రబాబు స్కెచ్‌ ప్రకారం సభలో టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. వారిని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తే బాగుంటుంది’’ అని మంత్రి విడదల రజిని అన్నారు.

LEAVE A RESPONSE