– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి: వ్యక్తుల కోసం వ్యవస్థలను విధ్వంసం చేసే విధంగా మీడియా పనిచేయకూడదని, ప్రస్తుతం మీడియాలో రాజకీయాలు ప్రవేశించి సమాజ హితం కోరే వార్తలు కన్నా, వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేసే పత్రికలు ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కురిచేడు రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ పార్క్ ఎదురు “డి టీవీ 24×7” న్యూస్ ఛానల్ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ వచ్చిన తర్వాత మీడియాలో ఇలాంటి పోకడలు పెరిగిపోయాయని ఆమె విమర్శించారు.
గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో మీడియాపై కూడా కట్టడి విధించి మీడియాను కనీసం గౌరవించని పరిస్థితి చూశాం… గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి లేదు. 15 నెలల కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో ఒకరోజు మీడియాతో మాట్లాడడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడడం, సలహాలు, సూచనలు తీసుకోవడం చూస్తున్నామన్నారు. కానీ గత ఐదేళ్లు ఆ పరిస్థితులు లేవు. మీడియాపై కూడా నియంత్రణ విధించి కేవలం సాక్షి పత్రిక కు రాష్ట్ర ఆర్థిక సంపదను దోచి పెట్టిన పరిస్థితులు చూశామన్నారు. దర్శి ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ముఖ్యంగా మీడియా వారు బాధ్యతగా సమాజ హితం కోసం ప్రజల కోసం పనిచేయాలని లక్ష్మి కోరారు.
ఈ కార్యక్రమంలో ఛానల్ ఎం.డీ సుర పరమేశ్వర రెడ్డి, టీడీపీ యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, రాష్ట్ర వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఐ.వి. సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, తదితరులు ఉన్నారు.