Suryaa.co.in

Andhra Pradesh

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలి

-అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన
-చలో అమలాపురానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు
-కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
-శైలజానాథ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
-ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం
-జగన్ రెడ్డి ఇకనైనా ఓట్ల రాజకీయాలను మానుకోవాలి
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : కోనసీమలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా గురువారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి చలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ వినయకుమార్, కృష్ణ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్, నగర అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహారావు, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు అలెక్స్జండేర్ సుధాకర్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప రెడ్డి, ఏపిసిసి ఆర్టీఐ చైర్మన్ పీవై.కిరణ్ కుమార్, మన్నం రాజశేఖర్, ఎస్సి నాయకులు మట్టా ప్రసాద్ తదితరులను ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ కోనసీమలోని కులోన్మాదులు , మతోన్మాదులు అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మంత్రి ఇంటిపై దాడి జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ప్రభుత్వం ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. అమలాపురం అల్లర్లను వైసీపీ నేతలే ప్రోత్సహించారనేది వాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల 29వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శైలజనాథ్ వెల్లడించారు.

జగన్ రెడ్డి ఇకనైనా ఓట్ల రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని,దేశ నాయకత్వాన్ని.. జీవితాలను అవమానించడమేనన్నారు. కులోన్మాదులను, మతోన్మాదులను , రౌడీ షీటర్లను పోలీసులు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలి తప్ప ఇలా కాదని, అమలాపురంలో అమాయకులైన ఎస్పీలు దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ పౌరునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజల్లో ధైర్యం కల్పించాల్సిన బాధ్యత మా పై ఉందని శైలజనాథ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE