ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకి దక్కిన మరో అరుదైన గౌరవం

– స్కోచ్ ”స్టార్ ఆఫ్ గవర్నెన్స్” పురస్కారంకు ఎంపిక
– వచ్చేనెల 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా అవార్డు ప్రధానం
– జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తున్న సీఎం వైయస్ జగన్ పాలన
– గ్రామీణ పాలనలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు
– ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో సత్ఫలితాలు
– పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ పాలన
– డిప్యూటీ సీఎం (పిఆర్&ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ”స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ -2021”లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా ”స్టార్ ఆఫ్ గవర్నెన్స్ -స్కోచ్ అవార్డు”కు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. (ఇందుకు సంబంధించిన లేఖను జత చేయడమైనది.)

స్టార్ ఆఫ్ గవర్నెన్స్ – స్కోచ్ అవార్డుకు ఎపి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం (పిఆర్&ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందని అన్నారు. గ్రామీణ పాలనలో సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో తీసుకువచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఎంపిక అవ్వడమని అన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు.

Leave a Reply