-వైసీపీ పుట్టకనే ఓ మోసం
-అట్రాసిటీ చట్టం దుర్వినియోగం
-టీడీపీ పాలన చారిత్రక అవసరం
-మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
తెనాలి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రిక అవసరంగా అభివర్ణించారు. ఏపీలో ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దారుణంగా వాడుకుని, చివరకు అట్రాసిటీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తోందన్నారు. వైసీపీ పార్టీ పేరులో రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటికీ, తీరు మాత్రం రాజారెడ్డిని ఫాలో అవుతోందని ధ్వజమెత్తారు.
వైసీపీ పుట్టుకే మోసమని.. దురుద్దేశంతో ప్రారంభమైందన్నారు. పార్టీ పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ది.. ఆచరణ మాత్రం రాజారెడ్డి దని దుయ్యబట్టారు.ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి.. ధనదాహంతో పాలన చేస్తున్నారని కన్నాలక్ష్మీ నారాయణ ఆరోపించారు. స్వంత వ్యాపారాలు పెంచకోవడం తప్ప రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు.
జగన్ రెడ్డి పాలనలో అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ నేతలే దాడులు చేస్తే.. పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించే పరిస్దితి నెలకొందన్నారు. కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి వైసీపీ రాక్షస క్రీడకు నిదర్శనమన్నారు. కౌన్సిలర్‌పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కన్నాలక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.