Suryaa.co.in

Editorial

కార్పొరేట్ కల్చరే కొంప ముంచింది!

– పార్టీని ఐప్యాక్‌కు అప్పగించి ముంచేశారు
– వారికున్న రాజకీయ అనుభవం ఏమిటి?
– పదవుల కోసం ఆ ప్రతినిధులు బేరాలు పెట్టారు
– తమ నివేదికలు మంత్రులకూ ఇచ్చేవారు
– నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేల పాత్ర లేకుండా చేశారు
– ఐప్యాక్‌ను నమ్మి నిండా మునిగిపోయాం
-వైసీపీని ఐ ప్యాకే నిలువునా ముంచేసింది
– జగన్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలనుకున్నారు
– కానీ టీడీపీకి అప్పుడు బలం లేక మౌనం
– తమను పట్టించుకోని జగన్ అహంకారంపై ఆగ్రహం
– గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే జగన్‌ను వెన్నుపోటు పొడిచారా?
– జగన్‌కు బుద్ధి రావాలనే వ్యూహాత్మకంగా పనిచేశారా?
– ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేశారు
– గత ఎన్నికల్లో పీకే చేసిందేమీలేదు
– అప్పటికే బాబు సర్కారుపై ప్రజావ్యతిరేకత
– పీకే హామీల సలహాలు కలసివచ్చాయంతే
– జగన్‌పై ఏ ఒక్క నేతకూ గౌరవం లేదు
– రెడ్లు కూడా జగన్‌పై మండిపడేవారు
– ఓటమిపై జగన్‌కు ఓ మాజీ మంత్రి నివేదిక?
– సహచరులు, ఓడిన ఎమ్మెల్యేలతో అభిప్రాయసేకరణ
– కార్పొరేట్ పాలిటిక్స్‌కు ఓటమి గుణపాఠం
– కార్పొరేట్ కంపెనీలను నమ్ముకుంటే పార్టీల కథ ముగిసినట్లే

151 మంది బలంతో అసెంబ్లీలో అడుగు పెట్టిన వైసీపీ ఘోర పరాజయానికి కార్పొరేట్ కల్చరే కారణమా? ఎమ్మెల్యేలు, నాయకులను పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీకి పట్టం కట్టడమే జగన్ ఓటమికి కారణమా? ఎవరినీ కలవాల్సిన పనిలేదన్న అహంకారమే.. నాడు జగన్‌పై ఎమ్మెల్యేల తిరుగుబాటు ఆలోచనకు బీజం వేసిందా? నామినేటెడ్ పదవులను కూడా కార్పొరేట్‌కు అప్పగించిన వైనమే, జగన్‌పై తిరుగుబాటు ఆలోచనకు ప్రాణం పోసిందా? అప్పట్లో టీడీపీకి సరైన బలం లేకనే వారి ఆలోచన అక్కడితో ఆగిపోయిందా? పైన బీజేపీ దన్ను ఉందన్న ముందుచూపుతోనే ఎమ్మెల్యేలు మౌనం వహించారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు-నేతలే సహకరించారా? ఆ ఎన్నికల్లో ఓడితే జగన్ నేలమీదకు వస్తారన్నదే వారి వ్యూహమా?

జగన్ నియంతృత్వానికి విసిగిపోయిన వైసీపీ అగ్రనేతలే జగన్-సీఎంఓపై మీడియాకు లీకులిచ్చారా?.. అవును. ఇదంతా మనం మనుషులం అన్నంత నిజమేనంటూ.. వైసీపీ సర్కారులో మంత్రిగా పనిచేసి, ఇప్పటికీ చురుకుగా ఉన్న ఓ మాజీ మంత్రి తన పార్టీ అధినేత జగన్‌కు ఇచ్చిన నివేదిక అంటే మీరు నమ్ముతారా?.. నమ్మితీరాలి. ఎందుకంటే.. నాటి వైసీపీ ఎమ్మెల్యేలు, అప్పటి తన సహచర మంత్రులతో ఓటమి తర్వాత అభిప్రాయసేకరణ చేసిన సదరు మాజీ మంత్రి, తన పార్టీ అధినేతకు ఇచ్చిన నివేదిక అది!

పార్టీ జెండా మోసే కార్యకర్తలు, నేతలను మరగుజ్జులను చేసి, రాజకీయాల్లో కార్పొరేట్ కల్చర్ బలంగా నాటుకుపోతున్న ఈ కాలంలో.. దానివల్ల వైసీపీ అనే ఒక రాజకీయ వటవృక్షం ఎలా నేలకూలిందో స్పష్టం చేసిన సదరు మాజీ మంత్రి నివేదిక.. ఆధునిక రాజకీయపార్టీలను, అవుట్‌సోర్సింగ్ సిస్టమ్‌తో నడిపించాలనుకుని… కార్పొరేట్ దిశకు తీసుకువెళుతున్న పార్టీలకు ఓ హెచ్చరిక. మరో కనువిప్పు.
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పుడు రాజకీయాలంతా కార్పొరేట్ మయం. జెండా పట్టుకునే కార్యకర్తతో పనిలేదు. స్టేజీ నుంచి జనాలను తీసుకురావడం వరకూ.. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ.. ఓటరు స్లిప్పులు-పాంప్లేట్ల పంపిణీ-సోఏల్‌మీడియా ప్రచారం వరకూ.. గెలిచిన తర్వాత ఎవరికి పదవులు ఇవ్వాలని నిర్ణయించే స్థాయి నుంచి, ఏ మీడియాకు ఎన్ని ప్రకటనలివ్వాలని నిర్దేశించే వరకూ.. ఏ నాయకుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ప్రసంగపాఠం రూపొందించడం నుంచి.. ఏ అభ్యర్ధి దగ్గర ఎంత తీసుకోవాలని నిర్ణయించేవరకూ.. రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేస్తున్నది కార్పొరేట్ సలహా సంస్థలే.

నిజానికి వీటికి ఎలాంటి పూర్వ రాజకీయ అనుభవం ఉండదు. పక్క రాష్ట్రంలో వీరి ఫార్ములా పనిచేసింది కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాలను కార్పొరేటీకరణ చేయాలన్న మతిలేని తపన. వీటిలో పనిచేసేది నిరుద్యోగ ఎంబీఏ యువకులు. భారత రాజకీయాలను అమెరికా మాదిరి చేయాలన్నది ఈ సంస్థల తపన. కానీ మన దేశంలో కార్యకర్తలు ఆత్మగౌరవం కోరుకుంటారన్న విషయం ఈ కంపెనీలకు తెలియదు. కార్యకర్తలు , మానవ-ఆత్మీయ సంబంధాలు మాత్రమే కోరుకుంటారన్న సంగతి వారికి తెలియదు. ఆ అసంతృప్తి ఆగ్రహంగా మారి, పాలకుల పతనాన్ని శాసిస్తుందన్న విషయం వారికి అస్సలు తెలియదు. మన ముందున్న ఐదేళ్ల టీడీపీ కూడా అలాగే చేసి, దె బ్బతినపట్టే వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ప్రశాంత్‌కిశోర్ అనే బిహార్ రాజకీయ సర్వే బేహారీని నమ్మి.. ఆ తర్వాత ఆయన సృష్టించి వదిలేసిన ఐ ప్యాక్ అనే కార్పొరేట్ సంస్థ చేసిన సిఫార్సులు జగన్‌రెడ్డి గుడ్డిగా ఫాలో అయి బొక్కబోర్లా పడ్డారట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. జగన్ సర్కారులో కొన్నేళ్లు మంత్రిగా పనిచేసి, పవన్-బాబును చెడామడా తిట్టిన ఓ మాజీ మంత్రి.. తన బాసు జగన్‌కు, 17 రోజుల పాటు స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన అభిప్రాయసేకరణ అనంతరం ఇచ్చిన నివేదిక ఇది.

151 సీట్లతో గద్దెనెక్కిన వైసీపీ ఓటమికి.. కేవలం కార్పొరేట్ రాజకీయమే కారణమని, ఓ మాజీ మంత్రి తన పార్టీ అధినేత జగన్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను ఏమాత్రం గౌరవించకుండా.. ఏపీ గురించి ఏమాత్రం తెలియని, కనీసం తెలుగుకూడా రాని ఐ ప్యాక్ ఇచ్చిన సలహాలు, సూచనలే వైసీపీని కొంప ముంచాయని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.

రాజకీయ నాయకులు గౌరవం కోరుకుంటారని, కానీ గత ఐదేళ్ల జగన్ పాలనలో అది లోపించిందని, అందుకే వారిలో నిర్లిప్తత-నైరాశ్యం ఆవహించిందని ఆ మాజీ మంత్రి తన నివేదికలో కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నైసర్గిత స్వరూపం-భాష-ఆయా ప్రాంత ప్రజల ఆలోచనలు ఏమాత్రం తెలియని ఒక ఉత్తరాది సంస్థకు, పార్టీ పెత్తనం అప్పగించడం వల్లే మీతోపాటు, మేమూ మునిగిపోయాయమని ఆ నివేదికలో స్పష్టం చేశారట.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆ మాజీ మంత్రి జగన్‌కు ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారంటే… పార్టీకి పెట్టనికోట అనుకునే రెడ్లు, జగన్ వైఖరిపై పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న నలుగురైదుగురు రెడ్లు మినహా, మొత్తంగా కులానికి జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. గ్రామాల్లో పెత్తనం చేసే రెడ్లను, వాలంటీర్ల వ్యవస్థతో అనామకులను చేశారు. రెడ్డినేతలు చేసిన పనులకు బిల్లులకు డబ్బులివ్వలేదు. ఫలితంగా జగన్ వల్ల తాము పరువు పోగొట్టుకున్నామన్న అసంతృప్తి ఏర్పడింది. రెడ్ల పార్టీగా ముద్ర పడటమే తప్ప, రెడ్లకు లాభం లేదన్న భావన బలంగా పాతుకుపోయింది.

ఇక ఐప్యాక్‌కు పెత్తనం పార్టీ కొంప పూర్తిగా ముంచింది. ఐప్యాక్‌లో పనిచేసే పైస్థాయి వారికి తెలుగురాదు. ఇక్కడి రాజకీయాలు తెలియవు. వారి అవసరాలు తెలియవు. వారంతా గ్రామాల్లో సాక్షి -ఎన్టీవీ-టీవీ9 గ్రామీణ విలేకరులపై ఆధారపడి నివేదలిచ్చారు. జిల్లాల్లో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ల నివేదికలు పట్టించుకోలేదు. ఎవరికి ఏ పదవులివ్వాలి? ఏ గ్రామాల్లో రోడ్లు వేస్తే ఓట్లు వస్తాయి? అన్న నివేదికలే తప్ప, కింది స్థాయి కార్యకర్త మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

చివరకు ఐప్యాక్ ప్రతినిధులను సంతృప్తిపరిస్తే చాలన్న భావన ఏర్పడింది. ముఖ్యంగా జగన్‌తో నిత్యం వెంట ఉంటూ. ఆయన జిల్లా పర్యటనలు పర్యవేక్షించే కృష్ణాజిల్లాకు చెందిన ఓ నాయకుడు.. ఎన్నికల్లో మనకు 40-50 వరకూ వస్తాయన్న ఏడాది క్రితం చేసిన హెచ్చరికను జగన్ పెడచెవిన పెట్టారు.

ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇస్తే.. వారు కోరే కోర్కెలు తీర్చడం కష్టం కాబట్టి, వారిని కలవద్దన్న ఐప్యాక్ సలహాలు పాటించి జగన్ దెబ్బతిన్నారు. ఐప్యాక్ సిఫార్సుల మేరకు నామినేటెడ్ పదవులివ్వడం కూడా పార్టీ పుట్టినముంచింది. ఇది ఎమ్మెల్యేల ఆత్మాభిమానం దెబ్బతీసింది. ఒక దశలో జగన్‌పై తిరుగుబాటు చేసే పరిస్థితి. అయితే రాష్ట్రంలో టీడీపీ బలంగా లేకపోవడం, కేంద్రంలోని బీజేపీ జగన్‌కు దన్నుగా నిలవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.

ఇక జగన్ కళ్లు నెత్తికెక్కినందువల్ల, అది దిగాలంటే ఏదైనా సరైన సందర్భం కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరుకున్నారు. అందుకు తగినట్లు వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను, వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌పై ఆయుధంగా మలచుకున్నారు. తమ నియోజకవర్గాల్లో సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే జగన్ కళ్లు కిందకు దిగి, తమను గౌరవిస్తారన్నది వారి అసలు వ్యూహం.

దాన్ని కూడా జగన్ గుర్తించలేకపోయారు. ఇది ఏ పార్టీలో అయినా జరిగే సహజమైన ప్రక్రియ. తమ గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరో ఒకరు గజ్జె కట్టి తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు. జగన్ విషయంలో ఆ అసంతృప్తి తిరుగుబాటు ఆలోచనకే పరిమితమయింది. కారణం జగన్‌కు బీజేపీ సహకారం ఉండటమే.

ఇక గత ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చేసిందేమీ లేదు. అప్పటికే నాటి సీఎం చంద్రబాబుపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగింది. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలపై పీకలవరకూ అసంతృప్తి. క మ్మవర్గంలోనూ తమకేమీ జరగలేదన్న అసంతృప్తి. మరో వైపు అన్నీ కమ్మవారికే ఇస్తున్నారంటూ, పీకే చేసిన ప్రచారం అన్ని కులాలపై పడింది. ఇలా కొన్ని సలహాలు తప్ప, పీకే చేసిందేమీ లేదు. అప్పటికే బాబుపై జనంలో అసంతృప్తి బలంగా నాటుకుపోయింది. నియోజకవర్గాల్లో ఐప్యాక్ ప్రతినిధులు పూర్తిగా సాక్షి విలేకరులపై ఆధారపడి నివేదికలిచ్చారు. టికెట్లు ఆశించే వారి నుంచి అనేక ప్రతిఫలం పొందారు.

ప్రధానంగా అసలు పార్టీ కార్యకర్తలు-నేతల ప్రమేయం లేకుండా, పార్టీని కార్పొరేటీకరణ చేసిన నిర్ణయమే వైసీపీ కొంపముంచింది. ప్రజాప్రతినిధులను కలిస్తే వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం అసాధ్యం కాబట్టి, అసలు వారిని కలవద్దన్న ఐప్యాక్ సలహా పాటించి, జగన్ తాను మునిగి నాయకులనూ ముంచేశారు. అదే తిరుగుబాటు ఆలోచనకు ప్రాణం పోసింది. పార్టీ ఓడినా 40 శాతం ఓట్లు రావడానికి లబ్థిదారులు-మాలలు-క్రైస్తవులు- గ్రామీణ రెడ్డి యువకులే కారణం.

LEAVE A RESPONSE