– ఎన్నికల మేనిఫెస్టోతో గడపగడపకు వెళ్తున్నాం
– వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేక ఓటు ఉండదు
– 151 సీట్లలో ఒక్క సీటును కూడా తగ్గించలేరు
– 24 లో ఎన్ని మిగులుతాయో ప్రతిపక్షాలే చూసుకోవాలి
– గుంటూరు , పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ కొడాలి నాని
గుడివాడ, మే 11: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సీఎం జగన్మోహనరెడ్డిపై చేస్తున్న ఆరోపణలు, నిందలను ప్రజలే తిప్పికొడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రతిపక్షాలు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నాయన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా దాచిందా అని ప్రశ్నించారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను తీసుకుని గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో చేయని కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అని అడగడానికి వెళ్తున్నామన్నారు. ఏ గడపలో అయినా చేయని కార్యక్రమం ఉందని మేనిఫెస్టోలో ఒక టిక్ పెట్టడానికి అవకాశం లేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటనూ నూరుశాతం అమలు చేస్తూ ఇంకా ఏవైనా కార్యక్రమాలు ఉంటే చెప్పాలని కోరుతున్నామన్నారు. ప్రజలు ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పినా వాటిని వెంటనే చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు ఉండదన్నారు. అనుకూల ఓటు మాత్రమే ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
గతంలో సీఎం జగన్మోహనరెడ్డికి 50 శాతం ఓటింగ్ వచ్చిందన్నారు. ఈసారి ఇంకో పది శాతం అదనంగా పెరగనుందని తెలిపారు. మిగతా 40 శాతం ఓటింగ్ కు సంబంధించి ఎవరెవరు కలిసి, విడివిడిగా పోటీ చేసినా మాకు పోయేది లేదన్నారు. 151 సీట్లలో ఒక్క సీటును కూడా తగ్గించలేరన్నారు. మిగిలిన 24 సీట్లలో ఎన్ని మిగులుతాయో వాళ్ళే చూసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.75 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారన్నారు. దాదాపు 4 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ముందు చూపుతో ప్రజల ఇంటి దగ్గరకే ప్రభుత్వ పాలనను తీసుకురావడం జరిగిందన్నారు. మనస్సున్న సీఎం జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దించి చంద్రబాబును కూర్చోబెట్టాలని రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీటిని అందరం అడ్డుకోవాల్సి ఉందని గుర్తుచేశారు.
జగన్మోహనరెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆయనను ముఖ్యమంత్రిగానే చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందు కోసం పేదలంతా ఒక వేదిక పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు పాలడుగు రాంప్రసాద్, పసలాది ఏసుబాబు, పసలాది శేఖర్, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని, తోట రాజేష్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.