– పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష సమావేశం
నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.
పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతోపాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుందని తెలిపారు. 30 సంవత్సరాల పాటు బ, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ కి, ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాల పైన చర్చించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి, పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్ రెడ్డి తో పాటు మహేందర్ రెడ్డిల వైఖరిని ప్రజలు అసహించుకుంటున్నారని, పార్టీ కానీ, కెసిఆర్ కానీ వీరికి ఏం తక్కువ చేశారని ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక పార్టీ పట్ల నిబద్ధతలేని నాయకులను ప్రజలు నమ్మరని, అధికారం కోసం జెండాలు మార్చే వాళ్ళని తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు.