– ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను పని చేయించుకునే విషయంలో స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది
– డైరీల్లో బీహార్ కార్మికులు, హోటళ్లలో ఒడిశా వాళ్ళు,
– ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రాడ్ బెండింగ్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి వాటిలో యూపీ, రాజస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు
ఉదయం అడ్వకేట్ మిత్రుడు ఒకరు ఫోన్ చేసి పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ముఠా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పోలీసులను ఆశ్రయించారని సమాచారం ఇచ్చాడు. ఆరా తీస్తే నగరంలో ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఉన్న గ్రానైట్ దుకాణంలో పని చేసే స్థానిక హమాలీలను తొలగించి, ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలో పెట్టుకున్నారని, దాదాపు 30 మంది పని కోల్పోయారని CITU వర్గాలు చెప్పాయి. గ్రానైట్ దుకాణాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కార్మికులు పని చేస్తుంటారు. లోడింగ్, అన్ లోడింగ్ లో, రవాణాలో రాయి జారి కాళ్ళు, చేతులు విరగడం సాధారణంగా జరుగుతుంటుంది.
20 -30 ఏళ్లుగా పని చేస్తున్న వారికి గుమస్తాలతో తలెత్తిన గొడవతో అందర్నీ పని నుంచి తీసేసి, ఇతర రాష్ట్రాల నుంచి యువకులను తీసుకు వచ్చి పనిలో పెట్టుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వ్యాపారులు స్థానిక కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో అసంఘటిత రంగంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. భవన నిర్మాణ రంగం మొత్తం జార్ఖండ్, ఛత్తీస్ గడ్ కార్మికులు ఉంటున్నారు. 60 వేల కోట్ల అప్పులతో జరుగుతున్న అమరావతి పనుల్లో 1శాతం కూడా స్థానిక కార్మికులు ఉండక పోవచ్చు. డైరీల్లో బీహార్ కార్మికులు, హోటళ్లలో ఒడిశా వాళ్ళు, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రాడ్ బెండింగ్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి వాటిలో యూపీ, రాజస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. గిగ్ సర్వీసుల్లో కూడా స్థానికేతరులు సేవలు అందిస్తున్నారు. చివరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సేవలు కూడా రాజస్తాన్ నుంచి వచ్చిన కార్మికులు ఉంటున్నారు.
గత పదేళ్లుగా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలకు డి బి టి తాయిలాలు అందించడం కూడా ఈ సమస్యకు కొంత కారణం కావొచ్చు. శ్రమ, ఉపాధి అనే వాటి జోలికి కొత్త తరం పోవడం లేదు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముఠా కార్మికులు ఎక్కువగా ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రతి వ్యాపారానికి అనుబంధంగా హమాలీ ముఠా ఉంటుంది. ఇందులో లైసెన్స్ పొందడం, శారీరక శ్రమ ద్వారా ఉపాధి పొందడం చాలా ఏళ్లుగా నడుస్తోంది. బలమైన వామపక్ష మద్దతు ఉన్న సంఘాలు కావడంతో కార్మిక చట్టాలు కొంత మేరకు వారికి అమలు అవుతూ ఉంటాయి. ఏపీలో డి బి టి పథకాల అమలు వల్ల కొత్త తరం ఈ తరహా ముఠా కూలీలుగా రావడం లేదు. ఇప్పటికే ఉన్న వారు నిర్దేశిత పని వేళలు, నిబంధనల విషయంలో గట్టిగా ఉంటున్నారు.
గత పదేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులను తక్కువ ఖర్చుతో వారి శ్రమ కొనుగోలు చేయడం, తద్వారా ఎక్కువ లాభాలు పొందడం వ్యాపారులకు అలవాటైంది. కనీస వేతన చట్టాలు అమలు, పనికి తగిన వేతనం అడగక పోవడం వంటి కారణాలతో చిన్న వ్యాపారులు మొదలుకుని బడా కాంట్రాక్టర్ల వరకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, యూపీ, బీహార్ నుంచి కార్మికులను తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య భీమవరంలో రొయ్యల ప్రాసెస్ యూనిట్లలో బెంగాల్ నుంచి వచ్చిన యువతీ, యువకులు పని చేయడం కనిపించింది. కారణం ఏమిటి అని యజమానుల్ని అడిగితే శని, ఆదివారం సెలవు అడగరు, ఎన్ని ట్రేలు రొయ్యలు ప్రాసెస్ చేస్తే అంత డబ్బు ఇస్తాం, రోజుకు 500కు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఓ ఎగుమతిదారుడు చెప్పారు. కుటుంబం మొత్తం నెల పాటు పని చేస్తే రూ.50 వేలు సంపాదిస్తారు.
వాళ్లకు అది పెద్ద మొత్తం, మాకు లాభం అన్నారు. స్థానికులు ఆ కూలీతో పని చేయరు అని గుట్టు విప్పారు. (రొయ్యల పరిశ్రమలో 22కిలోల బరువు ఉండే రొయ్యలను ఒలిస్తే కిలోకి రూ.4 నుంచి 7 చెల్లిస్తారు. వాటి సైజును బట్టి కూలీ ఉంటుంది.) చివరగా ఆంధ్ర ప్రదేశ్ లో మానవ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని ఉపయోగించుకునే విధానాలు లేవు. ప్రజలని ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఉచిత డబ్బు పంపకాల మాటున మాయం అవుతున్న ఉపాధి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను పని చేయించుకునే విషయంలో స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పన్నుల రూపంలో దక్కాల్సిన డబ్బు కార్మికుల వేతన రూపంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోవడంపై దృష్టి పెట్టాలి. – శరత్


