భూమన కరుణాకర్ రెడ్డి తెలుగు భాషా ప్రావీణ్యం ఆయనపై వచ్చిన ఆరోపణల నుండి కాపాడుతుందని ఆయన భావిస్తున్నట్లున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అనే ముద్దాయితో, ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనే ఏవీఎస్ఓ రాజీపడిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్నది. అందులో భాగంగా ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరైన కరుణాకర్ రెడ్డి విచారణకు ముందు, విచారణ తరువాత విలేఖరుల ముందు సంబంధం లేని మాటలు మాట్లాడటం ఆయన మానసిక స్థితి పట్ల ఆందోళన కలిగిస్తున్నది. హైకోర్టు ఆదేశాలమేరకే ప్రస్తుతం విచారణ జరుగుతున్నది అని భూమనకు తెలుసు.
టీటీడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా, అది చిన్నదైనా, పెద్దదైనా టీటీడీ పాలకమండలి మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ తో రాజీ పడటానికి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు పాలకమండలి ఆదేశాలు ఇవ్వకుండా ముందుకు వెళ్ళలేరు. అలా వెళితే సతీష్ కుమార్ తప్పు చేసినట్లు అయి వుండేది. దొంగతనం చేసిన సొత్తు కిమ్మత్తు ఎనభై వేలు అయితే, రవికుమార్ టీటీడీకి 14 కోట్ల ఆస్తులు దానం ఇచ్చి, దొంగతనం కేసులో రాజీపడటం సందేహాస్పదంగా ఉన్నదని భావించిన హైకోర్టు, పరకామణిలో జరిగిన చోరీ నుండి దొంగతనం చేసిన రవికుమార్ తో రాజీ పడటం వరకు, రవికుమార్ ఆస్తుల చిట్టాతో సహా అన్ని విషయాలపైన విచారణ జరపవలసినదిగా ఆదేశించింది.
అందులో భాగంగా భూమనకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని, అదేదో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయకక్ష అన్నట్లుగా భూమన మాట్లాడటమే ఆశ్చర్యం. పనిలోపనిగా తనను విచారణకు రప్పించటం వెనుక లోకేష్ బాబు విజ్ఞప్తి ఉందంటూ మాట్లాడటం ఆయన విజ్ఞతకు చిహ్నంగానే భావించాలి. ఇక మీడియాకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ వుంటున్నవే. విచారణకు ముందు ప్రభుత్వ ఒత్తిడిని భరించలేక సీఐడీ తనను విచారణకు పిలిచింది అంటూ సీఐడీ అధికారులపై సానుభూతి కురిపించిన కరుణాకర్ రెడ్డి విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక విచారణాధికారులు వేసిన ప్రశ్నలు ఎంత అర్థం లేనివో వివరించటానికి ఏవేవో పిట్టకథలు చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. తిరుపతిలో కురిసిన వర్షపు చినుకులెన్నో లెక్కపెట్టారా, వెంకటేశ్వరస్వామికి ఎంతమంది తలనీలాలు సమర్పించారు లాంటి సమాధానమే లేని ప్రశ్నలు వేశారంటూ ఛలోక్తులు విసిరారు. అవే అడిగారా అంటే అలాంటివి అంటూ వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని చెప్పగానే భూమన ఎందుకు అంతగా కదిలిపోతున్నారో అర్థం కాదు. ఆయనను సాక్షిగా మాత్రమే పిలిచారు అని ఆయనతోపాటు ఆయన అనుచరగణం అంతా గొంతెత్తి అరుస్తూనే ఉన్నారు.
కేసు విచారణ మొదలు కూడా కాకముందు నుండే విచారణకు తనను పిలవకూడదు అనే ధోరణితో మాట్లాడటమే పెక్కు సందేహాలకు తావిస్తున్నది. విచారణ హాజరుకు భయపడుతున్నారు అంటేనే ఏదో చెప్పలేని విషయం ఉందని అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు భూమన పైన ఎటువంటి ఆరోపణలు మోపబడలేదు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీలో జరిగిన ఒక విషయం గురించి దర్యాప్తు జరపమని హైకోర్టు ఆదేశించింది; ఆరోజుకి ఆయన బాధ్యుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను విచారించక ఎవరిని విచారించాలి.? ఒకవేళ టీటీడీ నియమావళి ప్రకారం చైర్మన్ కాక, కోర్టు సంబంధిత విషయాలకు వేరే ఎవరైనా బాధ్యులు ఉంటే వారిని విచారించవలసిన అవసరాన్ని చెప్పవచ్చు. భూమన అలాంటి సూచన చేయలేదు అంటే చైర్మన్ మాత్రమే బాధ్యుడు అని చెప్పకనే చెబుతున్నాడు.
పరకామణి కేసు గురించి వార్తలు రావటం మొదలైన రోజు నుండి ఈరోజు వరకు విచారణ జరపడాన్ని తప్పు పడుతున్నాడే కానీ ఆరోజు జరిగింది ఏమిటో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎదురుదాడి చేసినంత మాత్రాన భూమన చేసిన తప్పు నుండి తప్పుకోలేడు, విచారణకు హాజరు అయినంత మాత్రాన ముద్దాయి అయిపోడు. ఒకనాటి చైర్మన్ గా టీటీడీకి ఆయన జవాబుదారీగా వుండవలసిందే. ఒకనాడు ఆయన అనుసరించిన వామపక్ష భావజాలం కొద్దిగా కూడా ఆయనలో మిగలక పోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాజీ కమ్యూనిస్టు నాజీ కంటే ప్రమాదం అంటారు, భూమన దానికి ప్రత్యక్ష తార్కాణం. ఆంధ్రప్రదేశ్ లో చక్కటి తెలుగుభాష మాట్లాడే వారిలో భూమన ఒకడు. కానీ ఆ భాషాప్రావీణ్యంతో ఉన్న వాస్తవానికి, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు.
పరకామణి చోరీ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఈ కేసు స్వరూపాన్ని మరింత క్లిష్టతరం చేసింది. సతీష్ కుమార్ మరణవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ పూర్తిగా చేరకముందే సతీష్ కుమార్ మరణం ఎలా జరిగి ఉంటుందో భూమన అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సవివరంగా వర్ణించటం మరీ ఆశ్చర్యకరం. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఆయన పార్ధీవ దేహాన్ని చూడకముందే ఎటువంటి ఆయుధంతో ఎక్కడెక్కడ ఎలా వేటు వేశారో మీడియాకు వివరించిన జగన్మోహన్ రెడ్డి వివరించినట్లే, కరుణాకర్ రెడ్డి సతీష్ కుమార్ ఎలా మరణించాడో వివరించాడు.
ఊహించి అంత పర్ఫెక్ట్ గా చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. కాకపోతే వివేకా కేసులో జగన్ని అనుమానాస్పదంగా చూసినట్లే, సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి లో భూమనను కూడా ప్రజలు అంతే అనుమానంగా చూస్తున్నారు. విచారణలో అడిగిన ప్రశ్నలు ఏమిటో చెప్పటానికి భూమన సందేహించేటప్పటికి ఎవరి ఊహకు తగ్గట్టుగా వారు ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చింది. సరిగ్గా భూమన సీఐడీ విచారణకు హాజరయ్యే సమయానికి లిక్కర్ స్కామ్ లో ధనుంజయరెడ్డి బ్యాచ్ కు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసి వారిని క్రింది కోర్టు ముందు సరెండర్ అవ్వవలసిందిగా ఆదేశించింది. వైసీపీకి ఇది పెద్ద షాక్.
ఇది ఇలా ఉండగానే కల్తీమద్యం కేసులో జోగి రమేష్ ను నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కల్తీనెయ్యి కేసులో ఎస్వీ సుబ్బారెడ్డి పిఏని సిట్ విచారించగానే వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో, “అనారోగ్యంగావున్నా” అనే సాకు చూపించాలనుకున్నప్పటికీ సిట్ విచారణకు సుబ్బారెడ్డి సహకరించక తప్పని పరిస్థితి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి పైన ఇన్ని అంశాలకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్ పని చేసిందో ఏమో కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడాడు. ఏవేవో కథలు చెప్పాడు, కవిత్వం చెప్పాడు. భూమనకు 2019 నుండి మంత్రి పదవి కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. భవిష్యత్తు కూడా ఆశాజనకంగా కనిపించటం లేదు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు.. ఆయన నిజాయతీ మీద ఆయనకు నమ్మకం ఉంటే బెయిల్ కోసం ప్రయత్నించకుండా మెయిన్ కేసులోనే పోరాడవచ్చుగా అని సుద్దులు చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఆరోపణ రాగానే వణికిపోవటం మాత్రం జగన్మోహన్ రెడ్డికి అవమానమే.! – ఇంద్రాణి.
