Suryaa.co.in

Andhra Pradesh

జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి అలంకారప్రాయం కాదు: అప్పిరెడ్డి

సమాజంలో దేవాలయాల తర్వాత అత్యంత పవిత్రమైనవి గ్రంధాలయాలని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. దేవుడి ప్రతిరూపాలే గ్రంధాలనీ… అందుకే అవి కొలువుండే ప్రాంతాన్ని కూడా ఆలయాలుగానే పరిగణిస్తారనీ… తెలిపారు. మానసిక ప్రశాంతతకు దేవాలయాలకు ఎలా వెళ్తామో… అలాగే మానసిక వికాసానికి గ్రంధాలయాలకు వెళ్తామని ఆయన వివరించారు.
అరండల్‌పేటలోని జిల్లా గ్రంధాలయంలో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సంస్థ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించిన గ్రంధాలయాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పనలో ముందుంటున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్ధి, యువజనులకు విజ్ఞాన భాండాగారాలుగా భాసిల్లుతున్నాయన్నారు. ఆర్ధికంగా బలహీనులైన విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగం పటిష్టతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అప్పిరెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఓవైపు ఆంగ్ల మాధ్యమంలో తరగతుల నిర్వహణ, మరోవైపు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, నాడు–నేడుతో పాఠశాలలకు సరికొత్త రూపు తేవడంతో పాటు బోధనా పద్ధతులలో కూడా ఆయన విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే విద్యా వ్యవస్థకు అనుసంధానమై ఉండే గ్రంధాలయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పలు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచీకరణ నేపధ్యంలో గ్రంధాలయాలను కూడా డిజిటలైజేషన్‌ చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం అందులో ఒకటని ఆయన వివరించారు. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చి అందరికీ అత్యున్నత స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న సీఎం జగన్‌ సత్సంకల్పంలో భాగంగానే త్వరలో గ్రంధాలయాల పనితీరులో కూడా స్పష్టమైన మార్పును ఈ తరం చూడబోతోందని ఆయన తెలిపారు.
ఈ నేపధ్యంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి ఇకపై అలంకారప్రాయం కాదని అప్పిరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ ఆశయం–ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళే కీలక బాధ్యత సంస్థ ఛైర్మన్‌పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఆ దిశగా గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఆయనకు ఉద్యోగులు, సిబ్బంది సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తేవాలనీ… వాటిని పరిష్కరించేందుకు తాను ఎళ్ళవేళలా వారికి అందుబాటులో ఉంటాననీ… లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ మాట్లాడుతూ, విద్యారంగంలో సమూల మార్పులకు అత్యంత కీలకంగా ఉపకరించే గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌గా తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా గ్రంధాలయ అభివృద్ధికి తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సహకారంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఖార్కానాగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అందుకు ఉద్యోగులంతా సమిష్టిగా సమన్వయంతో సహకరించాలని ఆయన కోరారు.
డీసీసీబీ ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు మాట్లాడుతూ, విజ్ఞాన సముపార్జనకు గ్రంధాలయాలు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి గ్రంధాలయం ఒక విజ్ఞాన కూడలి అవుతుందన్నారు. జిల్లా గ్రంధాలయసంస్థ కార్యదర్శి పీర్‌ అహ్మద్‌ ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించగా… ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత నరసింహరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE