– ఆ సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ చేయాలి
– అసెంబ్లీలో వాణి వినిపించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
– రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సునీత
– వేరుసెనగ, టమోటా, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్న ఎమ్మెల్యే సునీత
అమరావతి: దేశంలోనే అత్యంత కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరం లాంటిదని.. ఆ సంస్థను కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే సునీత జీరో అవర్ లో ఆర్డీటీ సమస్య గురించి, లఘు చర్చ సందర్భంలో వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత 50 ఏళ్ళకుపైగా అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 152 మండలాల్లో, సుమారు 4వేల గ్రామాల్లో, 5లక్షల కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా సేవలందుతున్నాయన్నారు.
సుమారు 20లక్షల మందికి పైగా ఈ సంస్థపై ఆధారపడ్డారన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణాలు, క్రీడలపరంగా ఈ సంస్థ చాలా సేవలందిస్తోందన్నారు. ఆర్డీటీ అంటే ఏ పార్టీకో, కులానికో, మతానికో సంబంధించింది కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ చేయకపోవడం వలన కీలకమైన సేవలు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాష్ట్ర ఎంపీల సహకారంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదని.. అందుకే సభ ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపించాలన్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్ మాంచో ఫెర్రర్ తో సమావేశమై ఆర్డీటీ సేవలు ఆగకుండా కొనసాగేలా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మా జిల్లా రైతులను ఆదుకోండి.. పరిటాల సునీత
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి లఘు చర్చ సందర్భంలో ఎమ్మెల్యే పరిటాల సునీతకు అవకాశం రాగా.. జిల్లా రైతుల ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కేవలం వర్షాధారంగానే 7లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగవుతాయని.. ప్రతి ఏటా అతివృష్టి లేదా అనావృష్టి వలన పంటలు నష్టపోతున్నారన్నారు. మాకు ప్రధాన పంట వేరుసెనగ అని.. ప్రతి ఏటా పంటలు వేయడమే తప్ప లాభం తీసుకున్న సందర్భాలే లేవన్నారు.
కనీసం పెట్టుబడులు కూడా రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈసారి కూడా ఖరీప్ సీజన్ లో రైతులకు పెట్టుబడి సాయం కింద 7వేల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో వర్షాలు సకాలంలో రాక పంటలు వేయలేకపోయారన్నారు. అరకొరగా విత్తనం సాగైనా.. వర్షాలు లేక అది ఎండిపోయిందన్నారు. ఆగష్టు నెలలో కురిసిన వర్షానికి కొంత వరకు పంట సాగైనా అది కూడా సరిగా లేదన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వ్యవస్థను నాశనం చేశారన్నారు. ప్రీమియం మేమే చెల్లిస్తామంటూ.. రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.
ఇప్పుడు మరోసారి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. కాకపోతే ఈ ఏడాది ఇన్సూరెన్స్ కొంత మంది చేసుకోలేకపోయారన్నారు. అక్కడక్కడ ఈ-క్రాప్ కూడా చేయించుకోలేదన్నారు. అలాంటి రైతులకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వేరుసెనగకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, కంది, ఆముదం పంటలు వేస్తున్నారన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు.
ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయని.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. అలాగే టమోటా ధరలు తగ్గాయని ఈ విషయంలో కూడా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా టోమోటా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా సహకారం అందించాలన్నారు. ఉల్లి రైతులకు హెక్టారుకు 50 వేలు ఇస్తుంన్నందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు