– కోడెల కాంస్య విగ్రహావిష్కరణలో ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ
– వినుకొండలో ఘనంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు కాంస్య విగ్రహావిష్కరణ
వినుకొండ: పల్నాడు ప్రాంతంపై చెరగని సంతకంగా కోడెలం ప్రస్థానమని కొనియాడారు ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. రూపాయికే వైద్యం చేసిన పేదల డాక్టర్‌గా, రాజకీయాల్లో తిరుగులేని పల్నాటి పులిగా ఆయన ప్రయాణం అనితర సాధ్యమంటూ ఘన నివాళులు అర్పించారు. వినుకొండ నరసరావుపేట రోడ్డులోని ఎన్నెస్పీ మైదానం వద్ద ఏర్పాటు చేసిన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడెల శివరామ్ తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు, స్పీకర్‌గా కూడా పనిచేసిన కోడెల ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు.
రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని, అను నిత్యం అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. చంద్రబాబు యువపారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి రావాలన్న ఆ పిలుపు మేరకు తెలుగుదేశంలో అడుగు పెట్టిన తనకు తొలినాళ్లలో గురువుగా అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. అలానే పల్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాను అభివృద్ధిలో ముందు నిలిపారని, మంచినీటి పథకం, కోటప్పకొండ త్రికూటేశ్వర దేవాలయం, కోడెల స్టేడియం సహా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పనులు చేశారన్నారు.
పల్నాడు పులిగా ఏదైనా ధైర్యంగా ముక్కుసూటిగామాట్లాడే వారన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు చేట్టిన స్వచ్ఛంధ్రప్రదేశ్లో సత్తనపల్లిని అగ్రస్థానంలో నిలిపారని, మరుగుదొడ్ల నిర్మాణంలో నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట సింహంగా నిలిచారని, వైకాపా వేధింపులకు ఎదురొడ్డి పోరాడారన్నారు. ఆ క్రమంలోనే వైకాపా దుర్మార్గపు పాలనలో తప్పుడు కేసులు పెట్టి బలవన్మరణానికి కారణమయ్యారని, ప్రతిగా ప్రజలు వైకాపాను చిత్తుగా ఓడించి కోడెల ఆత్మకు శాంతి కలిగేలా చేశారన్నారు.
అనంతరం నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కోడెల పేద ప్రజల పెన్నిధిగా, అభివృద్ధికి చిరునామాగా నిలిచారన్నారు. అత్యంత క్లిష్టమైన నరసరావుపేటను ఎంచుకొని ఆ గడ్డమీద గెలిచి తన పోరాటం పటిమని నిరూపించారని, ప్రజా పోరాటాలు, కోడెల కవలల్లా అనిపించే వారని కొనియాడారు. వారి స్ఫూర్తితోనే నడుచుకుంటూ అభివృద్ధికి పెద్ద పేట వేస్తున్నామని తెలిపారు.
వరికెపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రమంత్రి గారు ఆమోదం తెలిపిన వినుకొండ నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి పూర్తి, ప్రతి ఇంటికి నీటిని అందించే విధంగా కృషి చేస్తున్నామని ప్రకటించారు.