-నైతిక విలువలు పాటిస్తూ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన జర్నలిస్టులకు వివిధ పదవులు దక్కాయి. కొందరికి ప్రభుత్వ సలహాదారులు, ప్రెస్ అకాడెమీ, అధికార భాషా సంఘ చైర్మన్, మరికొందరికి ఆర్టీఐ పదవులు లభించాయి. వీరిలో జగన్ సొంత మీడియా సాక్షిలో పనిచేసిన వారి సంఖ్యనే ఎక్కువ కాగా, మరికొందరు సాక్షి మీడియాతో పరోక్షంగా సంబంధాలున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరిలో కొందరిని ఇటీవలి ఎన్నికల సమయంలో, కొన్ని జిల్లాలకు పార్టీ తరఫున ఇన్చార్జులుగా నియమించినట్లు ప్రచారం జరిగింది.
కాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో, సలహాదారుల నుంచి రాజీనామాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజకీయ కారణాలతో తమకు వచ్చిన ఆర్టీఐ పదవులకు రాజీనామా చేయాలని, ముగ్గురు మాజీ జర్నలిస్టులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెహాన, బాషా, శామ్యూల్‌లను ఆర్టీఐ కమిషనర్లుగా జగన్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
కాగా జర్నలిస్టులుగా పనిచేసినప్పుడు.. నైతిక విలువల గురించి రాసి, మాట్లాడే తాము.. ప్రభుత్వం మారినందున, ఇంకా కొనసాగడం ైనె తిక ధర్మం కాదని భావిస్తున్నారట. ఇది తమకు వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిణామమేనంటున్నారు. నైతిక విలువలు పాటించకుండా, ఆ పదవుల్లో కొనసాగితే విమర్శలు ఎదుర్కోకతప్పదన్న భావనతో వారు ముగ్గురూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పైగా సాక్షి, దానికి అనుంబంధ పత్రికల్లో పనిచేసి.. దానివల్ల సంక్రమించిన ఆర్టీఐ కమిషనర్ల పదవులకు రాజీనామా చేయకపోతే, నైతిక విలువల గురించి మాట్లాడే వీరికి నైతిక విలువలు లేవన్న విమర్శలు ఎదుర్కోవలసివస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ వీరు రాజీనామా చేసినప్పటికీ.. మళ్లీ సాక్షితోపాటు, వారి మాజీ సంస్ధలలో పాత్రికేయులుగా కొనసాగే అవకాశాలున్నాయి.
కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్ కూడా ప్రభుత్వ పదవులు అనుభవించి, తర్వాత వైసీపీ అధికార మీడియా సాక్షిలో పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికలకు ముందు, సాక్షిలో పనిచేసిన నేమాని భాస్కర్‌కు ప్రభుత్వ సలహాదారుగా ఉత్తర్వు ఇచ్చిన విషయం తెలిసిందే.