(చిత్ర ప్రపంచ అద్భుతాలు)
సినిమా వ్యాసాల వల్ల ఒక పత్రికకు 2,00,000 సర్క్యులేషన్ పెరిగిందా?
‘తిరై ఉలగ అదిసయఙ్గళ్’ అంటే చిత్ర ప్రపంచ అద్భుతాలు అని. తిరై ఉలగ అదిసయఙ్గళ్ పేరుతో 2018లో తమిళ్ష్‌లో ఒక పుస్తకం వచ్చింది.
హాలీవుడ్ సినిమా, అంతర్జాతీయ సినిమా, జాతీయ సినిమా, దక్షిణాది సినిమా విశేషాలపై తిరునిన్ఱవూర్ తి. సన్తానకృష్ణన్ రాసిన వ్యాసాల పుస్తకం తిరై ఉలగ అదిసయఙ్గళ్.
పుస్తకం రూపంలో రాకముందు ‘దినత్తన్ది’ అన్న తమిళ్ష్ దిన పత్రికలో ఆ పుస్తకంలోని వ్యాసాలు ప్రతి శనివారం ధారావాహికగా వచ్చాయి. అవి దినత్తన్దిలో పూర్తి పేజ్ వ్యాసాలుగా వచ్చాయి. దినత్తన్ది 16 ఎడిషన్స్, 17.68 లక్షల సర్క్యులేషన్ ఉన్న తమిళ్ష్ దిన పత్రిక; అత్యధిక సర్క్యులేషన్ తమిళ్ష్ దిన పత్రిక దినత్తన్ది.
విశేషంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఆ వ్యాసాలు వచ్చే శనివారం రోజు దినత్తన్ది దిన పత్రిక 2,00,000 ప్రతులు ఎక్కువగా అచ్చేసి అమ్మేది! సినిమా విషయాల వ్యాసాల కోసం ఒక దినపత్రిక 2,00,000 ప్రతులు ఎక్కువగా అమ్ముడయ్యేది!
తెలుగులో ఈ సంఘటన జరుగుతుందా? అలా తెలుగు రచయితలు ఎందుకు లేరు? రాయబడిన విషయం సినిమా విషయం. ఏ భాష ప్రజల్లో అయినా సినిమా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ తెలుగులో సినిమా వ్యాసాలు రాసే మేధావులు ఈ సంఘటనను సాధించగలరా? తెలుగులో ఇలాంటివి జరగకపోవడానికి కారణం మేధావులు! ఆ మేధావుల అంటే భయంతో పాఠకులు ‘చదవడం’ వదిలేసుకున్నారు.
ఈ పుస్తకం రచయిత సంతానకృష్ణన్ గురించి నేను లోగడ విపులంగా తెలియజేశాను. మన వీ.ఎ.కె. రంగారావు కన్నా ఎక్కువ రికార్డులు, సినిమా పుస్తకాలు, డాక్యుమెంటేషన్ ఉన్న వారు సంతానకృష్ణన్. ఆయన దగ్గర వివిధ రూపాల్లో 30,000 సినిమాలు ఉన్నాయి! సినిమాపై, సంగీతంపై ఎన్నెన్నో వివరాలు, నిజాలు సంతానకృష్ణన్ దగ్గర ఉన్నాయి. ఆయన ఒక ‘సినిమా నిధి’.
(ఆయన గురించి నా రచన లింక్: https://www.facebook.com/share/p/1D552zsVwJ/ )
ప్రధానంగా సంతానకృష్ణన్ మన తెలుగులో తచ్చాడుతూండే ‘మేధావులు’ వంటి వారు కారు. అందుకే ఆయన రాసిన వ్యాసాలు ఆ మేరకు విజయవంతం అయ్యాయి. 25 పుస్తకాలు రాశారు ఆయన. అన్నీ ఘన విజయవంతం అయ్యాయి.
సంతానకృష్ణన్ సరళమైన వారు. ‘తనకు తెలిసింది ఏమీ లేదు’ అనుకుంటూ, అంటూ తనమానాన ప్రయత్నాలు చేస్తూంటారు. తమిళ్ష్ నాడు ప్రభుత్వం నుండి జాయింట్ సెక్రటరీగా పాతికేళ్ల క్రితమే పదవీ విరమణ చేసినా ఇంకా ప్రభుత్వం ఆయన సేవల్ని వినియోగించుకుంటోంది.
అతి-తెలివితో, అజ్ఞానంతో, దురాలోచనతో, చరిత్రను భ్రష్టుపట్టించే ప్రయత్నాలతో వచ్చే పుస్తకాల్ని, రచనల్ని ఏ భాష పాఠకులైనా తిరస్కరిస్తారు. గత ఏడాది రెంటాల జయదేవ అన్న ‘పాత్రికేయ మేధావి’ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ అన్న తప్పుడు పుస్తకం దారుణంగా విఫలమవడం మనకు తెలిసిందే.
యూ ట్యూబ్ యాంకర్లను మచ్చిక చేసుకోవడం వల్లా, ‘ఏదో ఇచ్చి’ ప్రమోట్ చేసుకోవడం వల్లా, పైరవీ లేదా ‘అడుక్కుంటే’ వచ్చే ప్రభుత్వ, ఇతర పురస్కారాల వల్లా ఏ పుస్తకమూ నాణ్యమైన పుస్తకం అవదు; విజయవంతం అవదు. ‘విషయం’, “రాయడం’ ఈ అంశాల్లో మన మేధావులు సంతానకృష్ణన్ తీరును, స్థాయిని అధ్యయనం చెయ్యాలి.
ఒక ప్రయత్నంలో తప్పులు దొర్లడం సహజమే; కానీ ‘తప్పుడుతనం’ తిరస్కరించబడాల్సిందే. తెలుగు పాఠకులు సరిగ్గా ఆ పనే చేస్తున్నారు. ‘తెలుగు పాఠకులు చదవరు, పుస్తకాలు కొనరు’ అనడం పాక్షింగా మాత్రమే వాస్తవం. ‘చదివించే, కొనిపించే రచనలు, రచయితలు ఇతర భాషల్లోలా తెలుగులో లేరు’ అన్న నిజాన్ని నిజాయితీతో గ్రహించాలి. ‘తెలుగులో పత్రికలు,రచనలు, పుస్తకాల అమ్మకాలు ఇతర భాషలలా ఎక్కవగా లేకపోవడానికి కారణం 60% రచయితలు, 40% పాఠకులు!’
తెలుగులో ‘విషయం ఉన్న’, ‘రాయడం తెలిసిన’ రచయితలు లుప్తం. ఈ వాస్తవాన్ని మన మేధావులు అంగీకరించరు. ముఖ్యంగా పత్రికా రచన ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగు బాగా వెనకబడి ఉంది. Times Of India, Hindustan Times వంటి ఇంగ్లిష్ పత్రికల్ని ఒక వారం పాటు చదివితే తెలుగు పత్రికా రచన ఎంత అధమంగా ఉందో తెలిసిపోతుంది.
ఈ తిరై ఉలగ అదిసయఙ్గళ్ వ్యాసాలలా ఒక దిన పత్రిక సర్క్యులేషన్‌ను 2,00,000 పెంచగలిగే రచనలు తెలుగులో ఎప్పటికైనా వస్తాయా? మన తెలుగు మేధావులు ఈ ప్రశ్నకు సరైన జవాబు చెప్పగలరా?
– రోచిష్మాన్
9444012279