Home » పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం

పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం

– అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్ పదవీ విరమణ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం అని, ఈ శాఖ రూపొందించే గణాంకాలు, క్షేత్ర స్థాయి సర్వేలు రాష్ట్ర పాలనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.

ఆదివారం ఖైరతాబాద్ లోని అర్థ గణాంక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ శాఖ డైరెక్టర్ దయానంద్ పదవీ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దయానంద్ ను శాలువాతో సన్మానించి చిన్నారెడ్డి అభినందించి సన్మాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అర్థగనాక గణాంక శాఖలో 35 సంవత్సరాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న దయానంద్ దక్షతను గుర్తించి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో తగిన గుర్తింపు దక్కుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ, అనుబంధ సంస్థల వివరాలు, భూముల గణాంకాలు, మనుషులు, పశు, పక్షుల సంపద, ప్రభుత్వ ఆస్తుల వివరాలు, జనాభా లెక్కలు సహా అనేక వివరాలు ప్రణాళికా శాఖ సేకరించి ప్రతి ఏటా ప్రచురణకు విడుదల చేస్తుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

సివిల్స్, గ్రూప్స్, ఇతర పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ప్రణాళికా శాఖ ప్రచురణలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చిన్నారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్న ప్రణాళికా సంఘం ప్రభుత్వ పాలనలో నూతన ఒరవడి తో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతుందని చిన్నారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేస్తున్న ఆ శాఖ డైరెక్టర్ దయానంద్ ను ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

Leave a Reply