Suryaa.co.in

Andhra Pradesh Features

కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఆర్టీఏ శాఖ

డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేవంటే నమ్మలేకపోయా!

నా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళాను. కౌంటర్ దగ్గర విచారిస్తే, ఎదురుగా ప్రయివేటు కాంప్లెక్స్ కు వెళ్ళి, దరఖాస్తును ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే వారుంటారు, కలవమని ఉచిత సలహా ఇచ్చారు. చేయగలిగిందేమీ లేక అలాగే చేస్తానన్నాను. ఆ ఆర్టీఏ ఆఫీసు ఉద్యోగి, నేను అడగకుండానే మరొక విషయం కూడా స్పష్టం చేశారు. దరఖాస్తు చేసినా కార్డులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కొంత కాలం తర్వాతైనా కార్డు పోస్టులో పంపిస్తారు కదా? అని అడిగా. పంపే అవకాశం లేదన్నారు. ఏడాదికిపైగా కార్డులు ఎవరికీ ఇవ్వడం లేదని అటుపై తెలిసింది. ఆశ్చర్యపోయాను.

దళారీ వ్యవస్థను రద్దు చేస్తామన్న ప్రభుత్వం, ఆ శాఖ వాళ్ళే దళారుల వద్దకు పంపుతున్నారు. వాళ్ళ సూచన మేరకు బయటికి వెళ్ళి విచారిస్తుంటే, ఒక దళారీ నాతో మాట కలిపి, తాను ఆ పని చేసి పెడతాను, రండంటూ, తన షాపు దగ్గరకు తీసుకెళ్ళి, సంబంధిత దరఖాస్తును ఆన్ లైన్ లో భర్తీ చేసి, అప్ లోడ్ చేశాడు. ఫీజు, సర్వీస్ ఛార్జీ క్రింద రు.1150 తీసుకొన్నాడు. అది ఎక్కువ కాకపోవచ్చు. కానీ, ఆర్టీఏ ఆఫీసు వాళ్ళే చేస్తే బహుశా డ్రైవింగ్ రెన్యూవల్ కు ఐదారు వందలు కావచ్చేమో!

నిన్న మళ్ళీ దళారీకి ఫోన్ చేసి, వెళ్ళి కలిశాను. వెబ్ సైట్ లో చూసి, రెన్యూవల్ అయ్యిందని, కాపీ డౌన్ లోడ్ చేసి, వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వారం తిరక్క ముందే పని పూర్తయినందుకు కాస్త సంతృప్తి కలిగింది. కార్డు వచ్చే అవకాశమే లేదా! సంబంధిత అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే చూపెట్టాలి కదా! అంటే, గడువు ముగిసిన పాత కార్డునే చూపెట్టి, ఇంటర్నెట్ లో చూసుకోమని చెప్పండి, నడుస్తుంది, వాళ్ళకు ఉన్న పరిస్థితి తెలుసన్నారు.

నేను చెల్లించిన రుసుంలోనే కార్డు తయారీ వ్యయం కూడా కలిపి ఉంటుందని గమనించాలి. అయినా, కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఆర్టీఏ శాఖ ఉన్నది. ఇది, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నదన్న భావన నాకు కలిగింది

-టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE