Suryaa.co.in

Telangana

బీహార్ ,మహారాష్ట్ర కర్ణాటకలో చేసిన తప్పిదాలే ఇక్కడ చేస్తున్నారు

– చట్టాన్ని తయారు చేసుకోకుండా బీసీ జనాభా సర్వే చేస్తున్నారు
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు కుల గణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. చట్టాన్ని తయారు చేసుకోకుండా సర్వే చేస్తున్నారు. రెండు వేర్వేరు జీవో లు ఇచ్చారు. చాలా గందరగోళం ఉంది.

మళ్ళీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాల్లో ఆందోళన ఉంది. బీహార్ ,మహారాష్ట్ర కర్ణాటక లో చేసిన కుల గణన పై చేసిన తప్పిదాలే ఇక్కడ చేస్తున్నారు. అది సమంజసం కాదు. రాహుల్ గాంధీ కుల గణన ఓ ఎక్స్ రే లాంటిదని అంటున్నారు. మేము ఎం ఆర్ ఐ లాంటిదని అంటున్నాం.

కులాలు ,ఉపకులాల జనాభా సర్వే తో కచ్చితంగా తేలుతుంది. తప్పిదాలు చేయకుండా సెన్సస్ జాగ్రత్తగా చేయాలి. బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటనలను జిల్లా కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. బీసీ కమిషన్ ను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగం ఆర్టికల్ 242 ,343 ల ప్రకారం బీసీ కుల గణనను పకడ్భందిగా చేయాలి.

లీగల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సుప్రీం కోర్టు ,హై కోర్టు మాజీ న్యాయ మూర్తులతో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశం, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, కుల గణన కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలి.భవిష్యత్ లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలి.

మేము న్యాయనిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ రూపొందించాం. ఆ చట్టం తో బీసీ కులగణన కు ఎలాంటి చిక్కులు రావు. దాన్ని ప్రభుత్వానికి పంపుతాం.

కేంద్రం జనగణన కు చట్టబద్ధత ఉన్నట్టు, బీసీ కుల గణనకు చట్టబద్దత ఉండాలి. భేషజాలకు పోకుండా మా సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవాలి.

ప్రెస్ మీట్ లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డా .ఆంజనేయ గౌడ్ ,పల్లె రవికుమార్ ,రాజీవ్ సాగర్ బీ ఆర్ ఎస్ నేతలు కురువ విజయ్ కుమార్ ,అంజయ్య ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE