Suryaa.co.in

Andhra Pradesh

కుటుంబ సభ్యులను కూడా బజారుకీడిస్తున్నారు

– జగన్ అమలు చేస్తున్న పథకాలు-సంస్కరణలే మాకు శ్రీరామరక్ష
– జగన్ పై రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది
– 175కు 175 సీట్లు మా టార్గెట్‌.. అందుకే అభ్యర్థుల మార్పులు
– ఎవరెన్ని కుట్రలు చేసినా.. జగన్ వెంటే ప్రజలు
-ః పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టీకరణ

ఎల్లో మీడియా బరితెగింపు రాతలు రాస్తుంది. మా కుటుంబ సభ్యులను కలిసినా, దానికి రాజకీయాలు ఆపాదించి, కట్టుకథలు అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, ముఖ్యమంత్రిపైనా పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. ఎవ్వరి ద్వారా.. ఏ మధ్యవర్తిత్వం మేము చేయడం లేదు. మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు మాకు నీరాజనం పడుతున్నారు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఇది చూసి ఓర్వలేక, జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 రాస్తున్న అడ్డగోలు వార్తలకు నిదర్శనం ఇది.

నేను ఈ మధ్య హైదరాబాద్‌కు ఎక్కువగా పోవడం లేదు. అయితే ఎప్పుడు పోయినా తప్పనిసరిగా.. విజయమ్మగారిని, కుటుంబ సభ్యులను కలుస్తాను. ఆమె అమెరికా పోయి వచ్చిన తర్వాత, దాదాపు నెల రోజుల తర్వాత మొన్న ఆదివారం విజయమ్మని కలిసి వచ్చాను. కుటుంబ విషయాలు మాట్లాడి వచ్చాను.

ఆ తర్వాత నేను షిరిడి వెళ్లాను. ప్రతి ఏటా జనవరిలో షిరిడి వెళ్లడం నాకు అలవాటు. దాంతో నేను నిన్న ఈ పేపర్‌ కూడా చూడలేదు. రాత్రి విజయవాడ వచ్చాక చూశాను. వారి రాతలు పరాకాష్టకు నిదర్శనం. వారు ఏ స్థాయిలో ఉన్నారంటే.. చంద్రబాబునాయుడును, ఆయన దత్తపుత్రుడిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎలా బురద చల్లుతున్నారనడానికి ఇది పరాకాష్ట. చివరకు కుటుంబ సభ్యులను కూడా బజారుకీడుస్తున్నారు. ఇంత నీచాతినీచమైన పరిస్థితి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పిన మీడియా ద్వారా వచ్చింది.

వీళ్ళు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారిపైన, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు అపార నమ్మకం ఉంది. అందుకే మేము ఏ విధమైన రాయబారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మరోమారు 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్లీ తమ కుటుంబాల్లో వెలుగు నింపాలంటే.. జగన్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అభ్యర్థులను మారుస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి.. రాబోయే రోజుల్లో వేరే పదవులు ఇచ్చి, వారికి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతున్నా.. కొద్ది మంది వినకుండా, బయటకు పోతున్నారు.

విశాఖపట్నంలో వంశీకృష్ణకు, ఎంవీవీ సత్యనారాయణకు వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయేమో.. అందుకే వంశీకృష్ణ అలా మాట్లాడి ఉండొచ్చు. విశాఖ తూర్పులో ఎంవీవీ సత్యనారాయణ బలమైన అభ్యర్థి అని మేము అనుకున్నాం కాబట్టే.. ఆయన్ను అక్కడ పెట్టడం జరిగింది. ఆయన తప్పకుండా విజయం సాధిస్తాడు.

తిప్పల నాగిరెడ్డితోనూ, ఆళ్ల రామకృష్ణారెడ్డితో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తిప్పల నాగిరెడ్డి, ముఖ్యమంత్రి చెప్పినదానికి అంగీకరించారు. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తారో..వారినే పెట్టండి… ఆ అభ్యర్థిని గెలిపిస్తాం అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు.
ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా, ఈ కసరత్తు రాష్ట్రమంతా జరుగుతోంది. పండగలోపు ఒక క్లారిటీ వచ్చే వీలుంది.

175కు 175 టార్గెట్‌… అందుకే మార్పులు..:
అనేక కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చాల్సి వస్తోంది. అది నచ్చని వారు వేరే పార్టీలవైపు చూస్తున్నారేమో. కానీ చాలా మంది మార్పులను ఆహ్వానిస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే.. ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామన్నది గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి పలుమార్లు పార్టీ మీటింగ్స్‌లో చెప్పడం జరిగింది.

మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం అని సీఎంగారు చెబుతున్నారు.

అయితే కొందరు వేరే పార్టీలవైపు వెళ్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి వారికి ఆ ఉద్దేశం లేకపోయినా, ఆ మీడియా ప్రేరేపిస్తోంది కాబట్టే.. ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది.

అందరినీ సంతృప్తి పర్చలేం కదా?:
ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కానీ అందరినీ సంతృప్తి పర్చలేం కదా? రాబోయే రోజుల్లో మీకు మేలు చేస్తామని చెబుతున్నాం. అయినా సరే వినిపించుకోకపోతే.. ఎవరైనా ఏం చేస్తారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి.. కొన్నాళ్లు ఓపిక పట్టాలని కోరాం. అయినా సరే, ఆయన (దాడి వీరభద్రరావు) రాజీనామా చేశారని తెలిసింది.

రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రతో పాటు, మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయి. సీఎం అన్నీ కసరత్తు చేస్తున్నారు. ఎన్ని సీట్లలో మార్పులు ఉంటాయనేది చెప్పలేం. ఎక్కడెక్కడ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారో.. అభ్యర్థుల మీద వ్యతిరేకత ఎక్కడైతే ఎక్కువగా ఉందో.. ఆయా చోట్ల మార్పులు ఉంటాయి.

ప్రజలే మా బలం:
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. షర్మిలమ్మగారు కాంగ్రెస్‌లో చేరుతారనే దాంట్లో వాస్తవాలు ఏమిటన్నది మాకు తెలియదు. ఆమె మూడేళ్ల క్రితం తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారు. తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఆమె కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానిపై మాకు సమాచారం లేదు.

ఏదిఏమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ప్రజలు జగన్‌గారితోనే ఉంటారు, ఉన్నారు. మేమంతా ఆయన వెంటే ఉంటాం. జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. మా బలం ప్రజలే. వారు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE