Suryaa.co.in

Andhra Pradesh

వృద్ధులు, మహిళల శాపం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి !

-జేబులో నుంచి సొంత డబ్బులను తీసి ఇస్తున్నట్లుగా వెధవ బిల్డప్ ఎందుకు?
-ఇన్చార్జీల పబ్లిసిటీ స్టంట్ కోసం వృద్ధాప్య పింఛన్ల పంపిణీ నిలిపివేయడం సమంజసం కాదు
-వైకాపాకు ఉపద్రవంగా మారనున్న వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక
-బ్రదర్ అనిల్ తన బావ ఆంతర్యాన్ని మాత్రం తెలుసుకో లేక పోయారు
-షర్మిల భర్త బ్రదర్ అనిల్, గతంలో తన బావ గెలుపు కోసం ఎంతో పని చేశారు
-వైకాపాలో టికెట్ దక్కని 40 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా మారనున్న కాంగ్రెస్ పార్టీ
-జనవరి 4వ తేదీ తర్వాత… 20 స్థానాలకు లోపే వైకాపా దిగజారే పరిస్థితి
-ప్రజల్లో దినదిన ప్రవర్ధమానమవుతోన్న ప్రజల ధైర్యం… వైకాపాను ముంచేయడం ఖాయం
-ప్రభుత్వ, ప్రజల సొమ్ముతో ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ల తక్షణమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి
-మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి రెండు రోజుల్లో 250 కోట్ల మద్యం విక్రయాలు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైకాపాకు ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ చీకటి రోజుగా మారనుంది. అదే రోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోపాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన తెలిపారు .

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా వైఎస్ షర్మిల మళ్లీ తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారు. తాను పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే అయినప్పటికీ, తన మెట్టినిల్లు అయిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించిన విషయం తెలిసింది. ఇప్పుడు తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరనున్నారు. చిన్న మనస్పర్ధల వల్ల కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించిన షర్మిల, అన్నను నమ్ముకొని సపోర్టుగా పాదాలు అరిగేలా రెండు ఎన్నికల్లో తిరిగారు. చెల్లెలు కోసం అష్ట,కష్టాలు అనుభవించిన అన్నల గురించి వచ్చిన సినిమాలను ఎన్నో చూశాం.

కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు గురించి వచ్చిన సినిమాలు చూడలేదు. కానీ ప్రత్యక్షంగా ఒక అన్న కోసం చెల్లి చేసిన త్యాగాలను చూశాం. వన్ వే ట్రాఫిక్ మాదిరిగా అన్న కోసం చెల్లి త్యాగాలు చేయడమే తప్పితే, అన్నయ్య నుంచి రిటర్న్ గ్రాటిట్యూట్ అన్నది లేకుండా పోయింది. దీనితో తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన, ఆయనకు ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం సంతోషమే. అయినా ఈ విషయము తో నాకు సంబంధం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం అన్నది వైకాపాకు పెద్ద సెట్ బ్యాక్ కానుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఏరు దాటాక తెప్ప తగిలేయడం అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తూ… గొడ్డు చాకిరీ చేసిన చెల్లిని వదిలేశారు. చెల్లి తో పాటు తల్లిని కూడా వదిలేసిన వారికి,నేను, నాలాంటి వారు పెద్ద లెక్కే కాదు. సహాయం చేసిన కొందరిని దండించారు. సహాయం చేసి దండన పొందిన వారిలో నాతో పాటు మరికొందరు ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

40 ఏళ్ల క్రితం పిసిసి అధ్యక్షుడిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నియమించిన రాజీవ్ గాంధీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తొలిసారిగా 1984లో పిసిసి అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నియమించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 2024లో షర్మిల తిరిగి పిసిసి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. రాజశేఖర్ రెడ్డిని పిన్న వయసులోనే పిసిసి అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నియమించారని, 40 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె కూడా పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలను తీసుకోవడం అనేది యాదృచ్ఛికమే అయినా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక మంచి రాజకీయ ఎత్తుగడ అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

సొంతగూటికి చేరనున్న కాంగ్రెస్ నేతలు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను షర్మిల స్వీకరించిన తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నేతలు సొంతగూటికి చేరే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం వల్ల సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వారికి మరొక ప్రత్యామ్నాయం లేదు. టిడిపి, జనసేన పార్టీలలో చేరిన టికెట్ దక్కే అవకాశాలు లేవు . ఎందుకంటే, రెండు పార్టీలలోనూ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు సరైన అభ్యర్థులే లేరు. కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏడు శాతం ఓటు బ్యాంకు ను సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైకాపాకు దన్ను గా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లకు పెద్ద బొక్క పడనుంది.. జాతీయస్థాయిలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు కారణంగా ముస్లిం మహిళలు మాత్రం బిజెపి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు కాబట్టి ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు. ఇక వైకాపా గెలుపులో కీలక పాత్ర పోషించిన క్రిస్టియన్ మైనారిటీలు షర్మిల వైపు చూస్తారనడం లో సందేహం లేదు. షర్మిల భర్త బ్రదర్ అనిల్, గతంలో తన బావ గెలుపు కోసం ఎంతో పని చేశారు. ఆయన ముందుగానే వైకాపా ఎన్ని స్థానాలలో గెలుస్తుందో చెప్పగలిగారు. అన్నీ తెలుసుకున్న బ్రదర్ అనిల్ తన బావ ఆంతర్యాన్ని మాత్రం తెలుసుకో లేక పోయారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో బ్రదర్ అనిల్ కీలక పాత్ర పోషించనున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో 20 శాతం ఉన్న క్రిస్టియన్ మైనార్టీలతోపాటు, ముస్లిం మైనార్టీల వెన్నుదన్నుతో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కొన్ని స్థానాలలో గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం వైకాపాకు పెద్ద యాక్సిడెంట్ వంటి పరిణామమే. జనవరి 4వ తేదీ వైకాపాకు చీకటి రోజే అవుతుంది. 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమకు ఉప్పెన వచ్చినట్లుగా, గతంలో డిసెంబర్ 26వ తేదీన సునామీ వచ్చినట్లుగా, వైకాపాకు ఇది కూడా అటువంటి పరిణామమే అవుతుందని రఘు రామకృష్ణంరాజు అన్నారు.

వైకాపా లో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు సంతోషంగా, షంషేర్ గా ఉండి కాంగ్రెస్ తరపున ప్రతిష్టాత్మకంగా పోటీ చేసే అవకాశం ఇప్పుడు లభించనుంది. విజయానికి వైకాపా కొన్ని యోజనాల దూరము లో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం అయిన తర్వాత అనంత విశ్వంలో ఒక గ్రహానికి మరొక గ్రహానికి ఎంత దూరం ఉంటుందో… ఎన్నికల్లో విజయానికి వైకాపాకు అంతే దూరంలో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటివరకు రానున్న ఎన్నికల్లో వైకాపాకు 30 నుంచి 35 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని నేను గతంలో చెప్పాను. నాల్గవ తేదీ తర్వాత కేవలం 20 స్థానాల లోపుకు వైకాపా దిగజారి పోతుందన్నారు. తెలివి తక్కువతనాన్ని ఓటర్ అయినా, నాయకులైన భరిస్తారు. జాలి చూపిస్తారు. అంతే కానీ అహంకారాన్ని మాత్రం ఎవరు తట్టుకోలేరు. అలలు మానిన అభిజాత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని భరించే నాయకులకు కానీ, ప్రజలు ఇక రాష్ట్రంలో ఎవరు లేరని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

లేచింది మహిళా లోకం… దద్దరిల్లింది వైకాపా ప్రపంచం
లేచింది మహిళా లోకం… దద్దరిల్లింది వైకాపా ప్రపంచం అన్నట్లుగా అంగన్వాడీలు పాటలు పాడుతున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పేస్ మాస్క్ ధరించిన ఒక వ్యక్తిని అంగన్వాడీలు సరదాగా కొట్టినప్పటికీ, వారి ఆగ్రహాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది. ఈ మాదిరిగా ఆందోళనలు చేయడానికి గతంలో ఎవరికైనా ధైర్యం వచ్చిందా?, మరి ఈ ధైర్యం ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే… ఎప్పటినుంచో నిద్రాణమై గూడు కట్టుకున్న ధైర్యం ఈ కొత్త సంవత్సరం పెళ్లుబికుతోంది . దినదిన ప్రవర్ధమానమై వైకాపాను ముంచేయబోతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

డ్వాక్రా మహిళలను బహిరంగ సభలకు హాజరు కావాలని వేధిస్తుంటే వారు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అలాగే ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆందోళనలతో పాటు, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక నా ప్రస్తుత పార్టీ అయిన వైకాపా జపాన్లో వచ్చిన సునామీ మాదిరిగా సెలెక్టివ్ గా ముంచి వేయబోతోంది. గతంలో ఉద్యోగులు ఎవరైనా సమ్మె చేయాలనుకుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తే చాలు… తమ సమ్మెను విరమిస్తున్నట్లుగా ప్రకటించే వారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

రానున్న ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల సవాల్ ఎలా ఉంటుందో చూడబోతున్నాము. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని తెలిసి కొంతమంది మా పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. కొంచెం సంయమనము పాటిస్తే మంచిది. ఇన్నాళ్లు వారందరికీ షర్మిల ఎంతో అండదండగా ఉన్నారని విషయాన్ని విస్మరించవద్దు. ఇక తన తండ్రిని ఆదరించిన పార్టీలో షర్మిల చేరబోతున్నారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఇన్చార్జిలను ఫైనలైజ్ చేయలేదని పెన్షన్లు ఇవ్వకపోవడం ఆశ్చర్యం
వైకాపా నియోజకవర్గ ఇన్చార్జిలను ఫైనలైజ్ చేయలేదన్న సాకుతో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. వైకాపా ఇన్చార్జులు వాలంటీర్లతో కలిసి ఇల్లు,ఇల్లు తిరిగి వృద్ధులకు పింఛన్లను అందజేస్తారట. వైకాపా ఇన్చార్జిలు ఫైనలైజ్ కు వృద్ధాప్య పింఛన్లు పంపిణీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.. జేబులో నుంచి సొంత డబ్బులను తీసి ఇస్తున్నట్లుగా వెధవ బిల్డప్ ఎందుకు. వృద్ధులకు వృద్ధాప్య పింఛనే ఆధారం అన్న విషయం తెలిసింది.

ఇన్చార్జీల పబ్లిసిటీ స్టంట్ కోసం వృద్ధాప్య పింఛన్ల పంపిణీ నిలిపివేయడం సమంజసం కాదు. ఎప్పటినుంచో పెంచుతానని చెబుతున్న 250 రూపాయలను తక్షణమే పెంచి, ఇన్చార్జిలే వెళ్లి ఇవ్వాలన్న గొడవ లేకుండా తక్షణమే ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్మని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, డిసెంబర్ 30, 31 వ తేదీలలో 250 కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించి ఆడవారి ఉసురు పోసుకున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పాము ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ విమర్శించడం మినహా చేసిందేమిటి. ప్రజలకు కూడా ప్రతిదీ జ్ఞాపకం ఉన్నదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

వైకాపాలో కొనసాగుతున్న రేవంత్ ఢిల్లీ విందు ప్రకంపనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందుకు వైకాపా ఎంపీలు హాజరు కావడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎంపీలను తిట్టగా, ఒకరిద్దరిని కొట్టినంత పని చేశారట. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక ఎంపీ తొలుత తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించినప్పటికీ, ఆ పార్టీ నాయకత్వం నిరాకరించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నట్లుగా సమాచారం. జనసేన వారైనా ఆయన్ని ఆదరిస్తారా లేదా అన్నది చూడాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

LEAVE A RESPONSE