– సందర్శకులను బేజారెత్తిస్తున్న శునకాలు
– కుక్కకాట్లతో సందర్శకులు, ఉద్యోగుల బేజారు
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ సచివాలయ శునకరాజాల స్వైరవిహార దృశ్యాలు
– కూతవేటు దూరంలోనే జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం
– ఎట్టకేలకు రాత్రి రంగంలోకి దిగిన జీహెచ్ఎంపి
( మార్తి సుబ్రహ్మణ్యం)
వందల కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ ధగధగలు.. విద్యుత్ కాంతుల మెరుపులు.. దానిముందు పర్యాటకులు సెల్ఫీలు అటుగా వెళ్లే అందరూ చూస్తూనే ఉంటాం. కానీ ‘కనిపించని నాలుగో సింహం’ మాదిరిగా.. బయట జనాలకు తెలియని శునకరాజాల సైర్వవిహారం గురించి మాత్రం, బయట ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు. సోషల్‌మీడియాలో శనివారం హోరెత్తిన వీడియోలు-ఫొటోలు చూస్తే..సీఎం, సచివులు కొలువుదీరే సచివాలయం, కుక్కలపాయిందా అన్న ఆవేదన కలగక తప్పదు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూలగొట్టి, నిజాం నవాబు కూడా నోరెళ్లబెట్టే లెవల్లో వందలకోట్లతో కళ్లుచెదిరే భవనం నిర్మించారు. బాగానే ఉంది. కానీ ఆ తర్వాత భారీ వర్షాలకు సెక్రటేరియేట్ భవనాల్లోకి నీరు లీకవుతున్న ఫొటోలు, వీడియోలు మీడియా-సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. సరే.. ఆ సక్కదనం ఇప్పుడు గతించిన ముచ్చట అనుకోండి.
అయితే అన్ని వందలకోట్ల ప్రజాధనం పోసి నిర్మించిన సచివాలయం కుక్కలపాలవడమే బాధాకరం. సహజంగా సచివాలయం, శాసనసభ చాలా రక్షణాత్మకంగా ఉంటాయి. సెక్యూరిటీ పకడ్బందీగా ఉంటుంది. అనుమతి లేకుండా మనుషులే కాదు. పశువులూ వచ్చేందుకు వీలుండదు. కానీ తెలంగాణ సచివాలయంలో కుక్కల స్వైరవిహారానికి సందర్శకులే కాదు. ఉద్యోగులు కూడా హాహాకారాలు పెడుతున్నారు.
సచివాలయంలోకి చొరబడిన కుక్కలు సందర్శకులను కరుస్తున్న దారుణ దృశ్యాలు, ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పటికే అనేక మంది సందర్శకులకు కరిచిన కుక్కల భయానికి సచివాలయ ఉద్యోగులు కూడా వణికిపోతున్నారు. డ్యూటీ ముగించుకుని బస్‌స్టాప్‌కు వెళ్లాలంటే మహిళా ఉద్యోగినులు బిక్కుబిక్కుమంటూ గేటు దాటాల్సిన దుస్థితి.
సచివాలయం లోపల-బయట శునకరాజాలు యధేచ్చగా స్వైరవిహారం చేస్తున్నా.. అక్కడికి కూతవేటు దూరంలోనే ఉన్న జీహెచ్ఎంసి అధికారులకు పట్టకపోవడమే వింత. నిజానికి ఈ ఫిర్యాదు తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి, కుక్కలను పట్టుకోవలసి ఉంది. అయినా ఆ పని సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేవరకూ చేయలేదంటే, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. పైగా మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహణలో ఉండటం మరో వైచిత్రి.
కాగా సచివాలయం కుక్కలపాలయిన వార్త-ఫొటో-వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో, జీహెచ్ఎంసి అధికారులు ఎట్టకేలకు రాత్రి, డాగ్‌స్క్వాడ్‌ను పంపి కుక్కలు పట్టే ప్రయత్నం చేశారు. సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ బస్తీ నుంచి ఈ కుక్కలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా.. రాష్ట్ర పాలనావ్యవస్థకు కేంద్రబిందువయిన సచివాలయం కుక్కలపాలవడం దారుణం. దయనీయం!