Suryaa.co.in

Andhra Pradesh

మండల్ విగ్రహ ధ్వంసంతో బీసీల ఆత్మగౌరవం దెబ్బతీశారు

-జగన్ రెడ్డి నియంతృత్వ పాలనా కోటను బీసీలంతా ఏకమై పగులగొట్టడం ఖాయం
– శాసనమండలి సభ్యులు బి.టి.నాయుడు

బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు బి.పి.మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన విగ్రహ దిమ్మెను జగన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం అరాచకత్వానికి నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి తన తండ్రి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లు ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు, ఇబ్బందులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మండల్ విగ్రహం ఏర్పాటుకు లేవనెత్తడం సిగ్గుచేటు.

కూల్చివేతలు తప్ప నిర్మించడమనేది తెలియని దిక్కుమాలిన పాలకుడిగా జగన్ రెడ్డి చరిత్రకెక్కారు. అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజా వేధిక కూల్చారు. అప్పటి నుండి ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కూలగొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజల ఆశలకు రూపం కల్పించిన మండల్ లాంటి మహనీయుని విగ్రహం కూల్చివేతతో జగన్ రెడ్డి నియంతృత్వ మనస్తత్వాన్ని చాటుకున్నారు.

మూడున్నరేళ్లుగా బీసీలను అణగదొక్కడమే ధ్యేయంగా జగన్ రెడ్డి పాలన సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు కుదించి 16,800 బీసీలకు రాజకీయ అవకాశాలను దూరం చేసి రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేశారు. బీసీ సబ్ ప్లాన్, కార్పొరేషన్లకు చెందిన రూ.30వేల కోట్ల నిధులు మళ్లించారు. బీసీ భవన్స్ నిర్మాణం నిలిపేశారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించిన బీసీ నాయకులపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ… మూడున్నర సంవత్సరాలుగా బీసీలను అణగదొక్కడమే ధ్యేయంగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు బీసీల ఆరాధ్య దైవమైన బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుని, దిమ్మెను కూల్చి వేశారు.

జగన్ రెడ్డి ఈ కూల్చివేతలు, అరాచకాలకు పాల్పడే విధానాలను వీడాలి. తక్షణమే బి.పి.మండల్ విగ్రహ దిమ్మెను పునరుద్దరించి, విగ్రహ ఏర్పాటుకు సహకరించాలి. బీసీల ఆత్మగౌరరవాన్ని కాపాడాలి. లేకుంటే ప్రభుత్వం అనుమతించినా, లేకున్నా రాష్ట్ర వ్యాప్తంగా బి.పి.మండల్ విగ్రహాలను అన్ని మండలాల్లో ఏర్పాటు చేసి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం.

LEAVE A RESPONSE