-మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు
-మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారు
-ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులనే వ్యతిరేకించాం
-ఇప్పుడంతా కలసే బతుకుతున్నాం
-ఏపీ మంత్రులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్
ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై వైయస్సార్సీపి జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజం. అందులో ఎలాంటి అవాస్తవాలు లేవు. ఆయన మాట్లాడిన సందర్బం వేరు. తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి చెప్పారు. ఇది వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసింది. విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేము బాగా అభివృద్ధి చెందుతున్నాం. మాపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదు.ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషం కక్కిన వారినీ మాత్రమే వ్యతిరేకించాం, ఆ తర్వాత అందరం కలిసి పనిచేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాం. మంత్రి హరీష్ రావు గారు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఇలా మాట్లాడుతున్నారు. దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఉచిత కరెంటు అంటూ పేరు చెప్పి అధికారం లోకి వచ్చి నేడు వైయస్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను వైయస్ఆర్ పార్టీ తీసుకున్నది. నాణ్యమైన కరెంటు ఇస్తామంటూ, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారు. ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టిఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావు పై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా.