– రవాణా శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి పినిపే విశ్వరూప్
ఏలూరు, ఆగష్టు, 15 : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సేవలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు భారతావని అభివృద్ధికి నేటి యువత బాటలు వేయాలని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ భారత దేశానికీ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నాటి స్వాతంత్ర్య సమరయోధుల స్వాతంత్రోద్యమ స్పూర్తితో జాతీయ సమైక్యత, సమగ్రతలకు కృషి చేసే దిశగా ఏడాది కాలంపాటు అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 15 రోజులపాటు ‘హర్ ఘర్ తిరంగా ‘ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ప్రతీ పేద కుటుంబంలో సంతోషాన్ని నింపి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మరింత సత్వరంగా సేవలందించే దిశగా నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
దేశాన్ని వెన్నుముక రైతన్న అని, అటువంటి రైతుకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా తమ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. జిలాలో రైతు భరోసా పధకం ద్వారా ప్రస్తుత సంవత్సరంలో లక్షా 80 వేల మంది రైతులకు 100 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామన్నారు. పంట రుణాలుగా 5 వేల 423 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, ఉచిత పంటల భీమా పధకం, వై.ఎస్.ఆర్. జలకళ, వై.ఎస్.ఆర్. యంత్ర సేవ పధకం, వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నామన్నారు.
సాగులో రైతులు ఎదుర్కునే ప్రతీ సమస్యకు రైతు భరోసా కేంద్రాలు ద్వారా పరిష్కారం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆగష్టు నెలలో సంబంవించే ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా జూన్ 1వ తేదీ నాటికే నీటిని విధుల చేసి ముందస్తు ఖరీఫ్ కి రైతులను సమాయత్తం చేశామన్నారు.. జిల్లాలో మూడవ పంటకు కూడా రైతులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ,రైతే రాజు అన్న నినాదం మాటలలో కాకుండా చేతలలో చూపిస్తున్నామన్నారు.
వై.ఎస్.ఆర్. పెన్షన్ కనుక కింద జిల్లాలోని 2 లక్షల 69 వేల 104 మందికి ఏటా 830 కోట్ల రూపాయలతో సామజిక పెన్షన్లు అందిస్తున్నామని, నాథ మూడేళ్ళ కాలంలో లక్ష మందికి పైగా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి సంక్షేమ ప్రభుత్వానికి నిదర్శనంగా నిలిచామన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశామని , 758 లే అవుట్ లలో పేదలకు లక్షా 3 వేల 77 పక్కా గృహాలను 2 వేల 217 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. పరిపాలనా సంస్కరణలలో భాగంగా గ్రామా సచివాలయాళాల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థను నిరుపేదల గుమ్మం వద్దకు తీసుకువెళ్లామన్నారు.
మహిళల ఆర్ధిక స్వావలంభనకు ప్రభుత్వం పెద్ద పీటవేస్తోందని, గతం సంవత్సరం 28 వేల డ్వాక్రా సంఘాలకు 1394 కోట్ల రూపాయలు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2 వేల సంఘాలకు 200 కోట్ల రూపాయలు రుణాలుగా అందించామన్నారు. వై.ఎస్.ఆర్. ఆసరా పధకం కింద 330 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశామన్నారు. ఇళ్ల స్థల పట్టాలు, డ్వాక్రా రుణాలు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్. ఆసరా, వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ, వంటి ఎన్నో పధకాలను మహిళల పేరుమీద మంజూరు చేస్తున్నామన్నారు.
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు.
అమ్మఒడి పధకం మూడవ విడతలో లక్షా 84 వేల 239 మంది తల్లుల ఖాతాలో 276 కోట్ల 35 లక్షల రూపాయలు, జగనన్న విద్యా దీవెన పధకం కింద 38 వేల 230 మంది విద్యార్థినీ విద్యార్థులకు 53 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన పధకం కింద 35 కోట్ల రూపాయలు జమచేశామన్నారు. మనబడి-నాడు-నేడుకార్యక్రమం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం కింద 5 లక్షల 80 వేల మంది ఉపాధి హామీ కూలీలకు కోటికి పైగా పనిదినాలు కల్పించి 197 కోట్ల రూపాయలను వేతనంగా అందించామన్నారు. వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించేందుకు చొరవ తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, జిల్లా జడ్జి సి. పురుషోత్తమరావు, టిడీఎం కోర్ట్ జడ్జి దివాకర్, ఎక్సయిజ్ కోర్ట్ మేజిస్ట్రేట్ సి. రమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జి ,జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, డి.ఐ.జి పాల రాజు, ఎస్.పి రాహుల్ దేవ్ శర్మ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.