Suryaa.co.in

Andhra Pradesh

మూడు రాజధానుల ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు

-రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా విజయసాయి చెప్పకనే చెప్పారు
-హైకోర్టు తీర్పును అసెంబ్లీ రద్దు చేసిందని చెప్పి, గవర్నర్ కు నివేదించండి
-గవర్నర్ ఆమోదిస్తారని అనుకోవడం లేదు
-సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై ఢిల్లీ హైకోర్టు కు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

మూడు రాజధానులు ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్హతే లేదని, అదే విషయాన్ని రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా తమ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి చెప్పకనే చెప్పారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు . తాము మూడు రాజధానులను ఏర్పాటు చేయదలిచామని, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారాన్ని కల్పిస్తూ చట్టం చేయాలని విజయసాయి తన ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా కోరారన్నారు. ప్రస్తుతానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని రాజధానులు ఏర్పాటు చేసుకుంటామన్నారని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ఒకవేళ అసెంబ్లీకే ఆ అధికారం ఉండి, ఉంటే అప్పుడే, తమ రాష్ట్ర అసెంబ్లీకే మూడు రాజధానులను ఏర్పాటు చేసుకునే అధికారం ఉన్నదని రాజ్యసభలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎందుకనీ చెప్ప లేదంటూ ప్రశ్నించారు. కనీసం సాయిరెడ్డికి ఉన్న పరిజ్ఞానం, మా పార్టీలో మరెవరికీ లేనట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ప్రసాద్ రాజు, మేరుగ నాగార్జున, అప్పలరాజు, సత్తిబాబు, మాజీ మంత్రి కన్నబాబు లకు విజయసాయి క్లాస్ తీసుకొని, మీకు విషయపరిజ్ఞానం లేకపోతే… విషయ పరిజ్ఞానం ఉన్న తన లాంటి వారి సేవలు వినియోగించుకోవాలని విజయసాయి వారికి హితవు పలకాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు .

విశాఖ ఇన్చార్జి బాధ్యతలు, సోషల్ మీడియా పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించి నప్పటికీ, రాజధానుల ఏర్పాటు విషయములో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదన్న విషయ పరిజ్ఞానం విజయ సాయి కి ఉన్నదని అన్నారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెడితే, కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కాపీని చదువుకోరా? అంటూ ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారమే లేదని స్పష్టం చేసిందన్నారు.

మూడు రాజధానులు ఏర్పాటు అధికారం కావాలంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించిన రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీలో హైకోర్టు తీర్పును రద్దు చేశామన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దాన్ని ఆమోదం కోసం గవర్నర్ కు నివేదించాలని సూచించారు. అయినా గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తారని తాను భావించడం లేదన్నారు. తమ పార్టీ నాయకులు చేసే పనులు జుగుప్సాకరంగా ఉంటున్నాయన్న రఘురామకృష్ణంరాజు, మూడు రాజధానుల ఏర్పాటును రెఫరెండం గా పేర్కొంటూ, 2024 సాధారణ ఎన్నికలకు వెళ్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, 2024 వరకు ఎందుకు, ఇప్పుడే మూడు రాజధానులను ఏర్పాటు చేసేద్దామని ఆత్రుతలో తమ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

అవును… రాష్ట్ర ప్రజలను జగన్ సొంత కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులను మాదిరిగా చూసుకుంటున్నారన్న మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా, రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ అవును… జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులైన షర్మిల, గొడ్డలి పోటుకు బలైన వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, తమ పార్టీకి ఓట్లు వేయించిన బ్రదర్ అనిల్, పార్టీ గౌరవాధ్యక్షులుగా పదవి నుంచి దించి వేసిన విజయమ్మ మాదిరిగానే రాష్ట్ర ప్రజలను కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటున్నారని అపహాస్యం చేశారు. కొడాలి నాని మాట్లాడిన భాష తప్పేమీ కాదని రోజా వ్యాఖ్యానించిందన్న ప్రశ్నకు… రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ, తనకు తెలియని భాష మాట్లాడితే తప్పు పట్టలేక పోవచ్చునని అన్నారు . ఆమె ఎప్పుడూ అంతగా బూతులు మాట్లాడటం తాను చూడలేదని, బహుశా కొడాలి నాని భాష ఆమెకు అర్థం అయి ఉండకపోవచ్చునని ఎద్దేవా చేశారు . ఇక టీడీపీ నేతలు కొడాలి నాని గడ్డం లోని తెల్ల వెంట్రుకలను కూడా పీకలేరన్న రోజా వ్యాఖ్యలపై, రఘురామకృష్ణంరాజు సెటైర్ వేశారు. కొడాలి నాని గడ్డం లో లేని తెల్ల వెంట్రుకలను ఎవరూ పీకలేరన్నది ఆమె ఉద్దేశ్యం అయి ఉండవచ్చునని అన్నారు.

కోర్టులలో సిఐడికి ఎదురుదెబ్బలు
న్యాయస్థానాలు సి ఐ డి కి ఇటీవల ఎదురుదెబ్బలు తగులుతున్నాయని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు . సిఐడి అధికారులు సుమోటోగా దళితుల అసైన్డ్ భూములను కబ్జా చేశారన్నా అభియోగం పై ఐదు మంది పై కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా… ఫిర్యాదుదారుడు ఎవరు?, బాధితుడు ఎవరని ప్రశ్నించిన న్యాయస్థానం… ఫిర్యాదు దారుడు, బాధితుడు లేకుండానే కేసులు ఎలా పెడుతారని న్యాయస్థానం మందలించిందన్నారు .ఇక మరొక కేసు లో ముగ్గుర్ని తీసుకు వచ్చి, అందులో ఒక నిందితుడికి 160 కింద నోటీసులు ఇచ్చి, 161 కింద స్టేట్మెంట్ తీసుకోవడాన్ని , న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపిస్తూ, అసలు కేసు కు, మీరు పెట్టిన సెక్షన్లకు ఏమైనా సంబంధం ఉందా?, అని ప్రశ్నించడమే కాకుండా, కనీస ప్రాథమిక సూత్రాలు తెలియవా? అంటూ సిఐడి అధికారులకు అక్షితలు వేసిందని చెప్పారు. నిందితుడి రిమాండ్ తిరస్కరించి, బెయిలు మంజూరు చేస్తూ, 41 ఎ కింద నోటీసులు జారీ చేసి, సాధారణ పద్ధతిలో విచారణ చేపట్టాలని ఆదేశించిందని చెప్పారు. న్యాయస్థానాలలో వస్తున్న మార్పు అభినందనీయమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

రేపో,మాపో ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని తెలిసిన పోలీసులు సైతం మారిపోతారన్న ఆయన, మారకపోతే మంచి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని సుతిమెత్తగా హెచ్చరించారు. సిఐడి అధికారులు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేసులు నమోదు చేయాలన్నారు. యధా రాజా… తథా పోలీస్ అని, అసెంబ్లీలో తలా, తోకాలేని బిల్లును ప్రవేశపెట్టే శాసన వ్యవస్థలో ఉన్నప్పుడు, తలా, తోకాలేని కేసులు పెట్టే పోలీసులు ఉండడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదన్నారు. అయితే తాము శాసన వ్యవస్థను మార్చుకొంటామని, తాము మారుతామని … పోలీసులు కూడా తమ పద్ధతి మార్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సీబీఐ కోర్టుకు సుప్రీం కోర్టు చివాట్లు
సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎం ఆర్ షా, కృష్ణ మురారి లతో కూడిన ధర్మాసనం… సీబీఐ కోర్టు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలని సీబీఐ అధికారులు కోరడం పట్ల ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించిందన్నారు . గత పన్నెండేళ్లుగా ఈ కేసు సీబీఐ కోర్టులో ట్రయల్ కు రాకపోవడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసిందన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి కంటే రెండు,మూడు నెలల ముందుగానే తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అభియోగాలను మోపుతూ సి.బి.ఐ చార్జిషీటు దాఖలు చేసిందని గుర్తు చేశారు . తాను జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయమని కోరుతూ, పిటిషన్ దాఖలు చేసినందుకే తనను కాళ్లు కట్టేసి కొట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని తాను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన, సిబిఐ తనకు సహకరించ లేదన్నారు. తాను వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసిందనీ, హైకోర్టులో ఎనిమిది నెలల నుంచి పెండింగ్ లో ఉందని చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి కి మరొక న్యాయమా? అంటూ ప్రశ్నించిన ఆయన, ఈనెల 19వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూద్దామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ తో అన్ని కేసుల నుంచి బయటపడాలనే తన ఉద్దేశమని అన్నారు.

నష్టాల్లో బైజుస్
విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం బైజుస్ సంస్థ తో, ఏపీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకున్న దని తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే, ఆ కంపెనీ తీవ్ర నష్టాలను కూరుకుపోయిందని తెలిసిందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. గత వార్షిక బ్యాలెన్స్ షీట్ తో పోలిస్తే, ఈసారి 17 రెట్లు అదనంగా నష్టాలతో 4200 కోట్ల రూపాయలు నష్టపోయిందని చెప్పారు. వచ్చే ఏడాది మరో రెండు రెట్లు అదనంగా నష్టాన్ని గనుక చవిచూస్తే , ఆ కంపెనీ నెట్ వర్క్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.

ఏపీ సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై తాను ఇప్పటికే రెండు మార్లు డి ఓ పి టి, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశానని తెలిపారు. సర్వీస్ లో కొనసాగుతూ, అంబేద్కర్ ఇండియా మిషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను పివి సునీల్ కుమార్ నిర్వహిస్తున్న విషయాన్ని డి ఓ పి టి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లానని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకే తాను ఈ విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ విభాగాల అధిపతులు గా వైద్యులను నియమించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమించిందన్నారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఘనంగా నివాళులు
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకొని రఘురామకృష్ణం రాజు గారు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువాడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సేవలను ఇంజనీర్లు, తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఇక ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రఘురామకృష్ణం రాజు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీ దత్ గారు, మరిన్ని విజయవంతమైన సినిమాలను నిర్మించాలని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE