Suryaa.co.in

Andhra Pradesh

సంజయ్‌పై రాష్ట్ర హైకోర్టు సమోటోగా కేసు నమోదు చేయాలి

సంజయ్ తీరుపై త్వరలోనే డీవోపీటీకి ఫిర్యాదు
ఏసీబీ జరిపిన సోదాల ఎంక్వైరీ రిపోర్ట్ బయటపెట్టే ధైర్యం ఉందా?
ఆగస్ట్ నెలాఖరులో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఏసీబీ విచారణలో అవినీతి చేస్తూ దొరికిన అధికారులెవరో బయటపెట్టాలి
పోలీసుల ప్రమోషన్ల వ్యవహారం వెనకున్న పెద్ద తలకాయ ఎవరో బయటపెట్టాలి
సజ్జల బ్లాక్ మెయిల్ చేసినందునే సంజయ్ అభూతకల్పనలతో చంద్రబాబు అరెస్ట్‌కు పాల్పడింది నిజం కాదా?
ఏసీబీ విచారణ రిపోర్ట్‌ను అడ్డుపెట్టుకొని సంజయ్‌ను కీలుబొమ్మలా ఆడిస్తోందన్నది నిజమా.. కాదా?
– ఏసీబీ విచారణకు.. సంజయ్‌కు ఉన్న సంబంధమేంటి?
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

“సీఐడీ అడిషనల్ డైరెక్టర్‌గా పిలవబడే ఎన్.సంజయ్ అసలు ఆ పదవే వద్దు అనుకున్నాడు. తర్వాత ఏవో కారణాలతో కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఏ తప్పు చేయని, ఎలాంటి సాక్ష్యాలు లేని కేసులో చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేశారు. ఏమిటా పరిస్థితులని ఆరా తీస్తే… ఎస్సై, సీఐల ప్రమోషన్ల విషయంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో అవినీతి జరుగుతోందని, లక్షల్లో నగదు చేతులు మారుతోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగస్ట్ నెలాఖరులో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈ ఏసీబీ విచారణకు డీజీపీనే ఆదేశించారని కూడా సమాచారం.

లంచాలు తీసుకుంటున్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆయన ఏసీబీ విచారణ కోరారు. ఆ విచారణలో తేనె తుట్టె కదిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ అధిపతి సంజయ్ పేరే ప్రధానంగా వినిపించింది. దీంతో సంజయ్‌ను పక్కన పెట్టారు. ఎప్పుడైనా సరే తప్పు చేశారని తేలాక సస్పెండ్ చేయడమో, అరెస్టు చేయడమో చేస్తారు తప్ప వీఆర్‌లో పెట్టరు.

ఏసీబీ విభాగాన్ని నేరుగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తారు కాబట్టి… డీజీపీ కార్యాలయంలో ఏసీబీ జరిపిన సోదాలు.. విచారణకు సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ బయటపెట్టే ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఏసీబీ విచారణలో అవినీతి చేస్తూ దొరికిన అధికారులెవరో… వారి వెనకున్న సీనియర్ అధికారులెవరో.. మొత్తంగా పోలీసుల ప్రమోషన్ల వ్యవహారం వెనకున్న పెద్ద తలకాయ ఎవరో బయటపెట్టాలి.

ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి బ్లాక్ మెయిల్ చేసినందునే సంజయ్ అభూతకల్పనలతో చంద్రబాబు అరెస్ట్‌కు పాల్పడింది నిజం కాదా? ఏసీబీ విచారణను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం సంజయ్‌ను బ్లాక్ మెయిల్ చేసింది నిజంకాదా? ముఖ్యమంత్రి గానీ… సజ్జల రామకృష్ణారెడ్డి గానీ.. డీఐజీ రఘురామిరెడ్డి గానీ వీళ్లలో ఎవరో ఒకరు దళిత అధికారి సంజయ్‌ను భయపెట్టి, చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఒత్తిడి తెచ్చింది నిజంకాదా?

అభూతకల్పనలతో సంజయ్ ద్వారా ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్‌కు పాల్పడింది నిజం కాదా? ఏసీబీ విచారణ రిపోర్ట్‌ను అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం సంజయ్‌ను కీలుబొమ్మలా ఆడిస్తోందన్నది నిజమా.. కాదా? ఏసీబీ విచారణకు.. సంజయ్‌కు ఉన్న సంబంధమేంటి? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

గతంలో కేరళ హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా పరిధి దాటి వ్యవహరించిన సంజయ్‌పై రాష్ట్ర హైకోర్టు సమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. దర్యాప్తు అధికారి దర్యాప్తునకు సంబంధించిన విషయాలను బయట పెట్టకూడదని కేరళ హైకోర్టు సుస్పష్టంగా పేర్కొంది. కానీ ఆ తీర్పులకు విరుద్ధంగా సీఐడీ చీఫ్ సంజయ్ హైదరాబాద్, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో మరింత మంది అరెస్టులు ఉంటాయని కూడా పేర్కొంటూ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు.

అధికారిగా కాకుండా అధికార పార్టీకి చెందిన నాయకుడి మాదిరి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎవరైనా విచారణాధికారి విచారణాంశాలను మీడియాకు చెప్పాల్సి వచ్చినా పూర్తి వివరాలు చెప్పరు. కానీ సంజయ్ ఎందుకింతలా తనపరిధి దాటి వ్యవహరించి మరీ ఢిల్లీ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టడమేంటి? సంజయ్ మీడియాతో మాట్లాడిన వివరాలు గమనిస్తే, ఇది ముమ్మాటికీ కేరళ హైకోర్ట్ తీర్పునకు విరుద్ధం. అందువల్ల సీఐడీ చీఫ్ సంజయ్‌పై రాష్ట్ర హైకోర్ట్ కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు తీసుకోవాలి.

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గతంలో ఒక సర్క్యులర్ ఇచ్చారు. దానిలో పోలీసు అధికారులు మీడియాను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని, విచారణకు భంగం కలిగేలా మాట్లాడకూడదని, భవిష్యత్‌లో ఏం చేయబోయేది తెలియజేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. కేంద్రహోం శాఖ మార్గదర్శకాలను సైతం సంజయ్ ఉల్లంఘించారు. సంజయ్ తీరుపై త్వరలోనే డీవోపీటీకి ఫిర్యాదు చేయబోతున్నాం.

డీజీపీ.. రాష్ట్రప్రభుత్వం కూడా తక్షణమే ఏసీబీ దాడికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సంజయ్‌తో పాటు… మరో అధికారి పోలీస్ ప్రమోషన్లలో తప్పుచేశారని తెలిసింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. అవినీతి చేసి తన వెంట అధికారుల్ని కూడా జైలుకు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఉందనే విషయాన్ని అధికారులు గ్రహించి చట్టబద్ధంగా, న్యాయంగా వ్యవహరించాలి.” అని వర్ల రామయ్య సూచించారు.

LEAVE A RESPONSE