*దేశంలో 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యం
– కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ISA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన 6వ ISA స్టీల్ కాన్క్లేవ్లో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశ జీడీపీలో దాదాపు 2% వాటాను కలిగి ఉందని తెలిపారు. దేశ ప్రగతికి, స్వయం సమృద్ధికి ఇది చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
గత మూడు సంవత్సరాలుగా ఉక్కు డిమాండ్ రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు.
లక్ష్య సాధనలో ప్రధానంగా ఉక్కు పరిశ్రమలో డీకార్బనైజేషన్ మరియు గ్రీన్ స్టీల్ మిషన్ అమలు చేయటం, టెక్నాలజీ అనుసరణ ద్వారా పరిశ్రమ దీర్ఘకాలిక స్థిరత్వం, పోటీ సామర్థ్యం పెంపు చేయటం, ముడి పదార్థాల భద్రతా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి పరిష్కార మార్గాలను సూచించడంలో ISA విలువైన పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి జాతీయ విధానాలు ఉక్కు డిమాండ్‌ను గణనీయంగా పెంచి, దేశీయ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని శ్రీనివాస వర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (AMNS) నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని అనుమతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని, త్వరలోనే శంకుస్థాపన జరగనుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (AMNS) ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నందుకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ISA) పరిశ్రమకు ఏకైక స్వరం లా నిలిచి, దేశ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో రెండు మూడవ వంతు ఉత్పత్తి చేసే సభ్య సంస్థలను ప్రతినిధ్యం వహిస్తోందని తెలిపారు.
ఐ ఎస్ ఏ అధ్యక్షులు, ఎంపీ నవీన్ జిందాల్ పరిశ్రమ అభివృద్ధికి కీలక సూచనలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి రెండు రోజులలో జరిగే చర్చలు పరిశ్రమ భవిష్యత్ అభివృద్ధికి విలువైన సూచనలను అందిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మరియు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ జిందాల్, సెయిల్ సీఎండీ అమరేంద్ర ప్రకాష్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ సభ్యులు,ఉక్కు పరిశ్రమ ప్రతినిధులు,మంత్రిత్వ శాఖల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.