Suryaa.co.in

Andhra Pradesh

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమే గన్నవరం సభ సక్సెస్

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభకు అశేష జనవాహిని హాజరు కావడం పరిశీలిస్తే, గన్నవరంలోనే కాదు… రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. మా పార్టీ నాయకుల నియంతృత్వ, నిరంకుశ పోకడలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రికి ఇన్నాళ్లు రుణాసురుడు, భూ భ కాసురుడు, ఇసుకాసురుడని పేరు పెట్టుకున్నాం… ఇప్పుడు అంధకాసురుడనే పేరు పెట్టుకోవలసిన పరిస్థితిని ఆయనే తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. కృష్ణపట్నంలో రెండు యూనిట్లు పనిచేయడం లేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన విద్యుత్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది.

విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు తలెత్తకుండా అధిక బొగ్గు నిల్వలు పెట్టుకోవలసిన ప్రభుత్వ, ఆ విషయాన్ని గాలికి వదిలేసింది . బొగ్గు నిల్వలు లేకపోతే, ఎక్సేంజ్ లో విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే ముందే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కోతలపై వార్తలు రాస్తే, ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు పై మా పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఈనాడు దినపత్రిక కృషి చేస్తుండగా, అది మా పార్టీ నాయకులకు రుచించడం లేదు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

తన బినామీల రెన్యుబుల్ ఎనర్జీ కంపెనీలకు ఇటీవల ముఖ్యమంత్రి కొత్త గా అనుమతులు ఇచ్చారు. తన బినామీల కంపెనీలకు అధిక లాభాలను ఆర్జించి పెట్టడానికి , రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉన్నదని చూపే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారా??, ఈ సాకుతో ఎక్సేంజ్ లో విద్యుత్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని చెప్పి, తన బినామీల రెన్యుబుల్ ఎనర్జీ కంపెనీలతో కొత్త గా పి పి ఏ లు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అన్న సందేహాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి, కోతలు తీవ్రమై, రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడిందన్నారు . ఇప్పటికే రెగ్యులేటరీ కమిషన్ ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచింది. ఎక్సేంజ్ లో కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు అయ్యే అదనపు ఖర్చు ప్రజల నుండే సర్చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. గన్నవరం సభలో నారా లోకేష్ చెప్పినట్లుగా గతంలో 75 రూపాయలు విద్యుత్ ఛార్జి వచ్చేవారికి, ప్రస్తుతం 375 రూపాయలు వస్తోందన్నారు. చెత్తపై పన్ను, విద్యుత్ చార్జీల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

90 లక్షలు చెల్లించి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కాలేజీలో చేరగలరా?
ప్రభుత్వం నిర్వహించే మెడికల్ కాలేజీలలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సీట్లు లభించకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, మెడికల్ కాలేజీలలో 50 శాతం సీట్లు తగ్గిస్తుంటే, ఎందుకని అభ్యంతరం చెప్పలేదు. 50 శాతం సీట్లు తగ్గించడం వల్ల ఎస్సీ ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల సీట్లలో 25% కోత పడింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు కోసం 90 లక్షల రూపాయలు చెల్లించే స్తోమత ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉందా? అన్న ఆయన, ఈ విషయము జమోరె ను ఎవరైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు.

ప్రభుత్వం నడిపే మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సీట్లు రాకుండా చేసిన వ్యక్తిని ఇంకా జగన్ మామయ్య అంటారా అని అపహాస్యం చేశారు. నాలుగు అబద్ధాలు చెప్పి, నాలుగు డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారని ప్రజలపై మనకు ఉన్న ఛీప్ అభిప్రాయము మారకపోతే ప్రజలు కూడా, మనల్ని అంతే ఛీప్ గా చూస్తారన్నారు. వారు అంతకు అంత ప్రతీకారాన్ని తీర్చుకుంటారని హెచ్చరించారు.

కులం… చూడను అంటూనే సొంత కులం వారికే పెద్ద పీట
కులము చూడను… మతం చూడను అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న ధనుంజయ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డికి మరో రెండేళ్ల పాటు పదవి కాలాన్ని పొడిగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు . అలాగే పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డికి మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ద్వారంపూడి భాస్కర్ రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించవచ్చు కదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కోస్గి లోని మోడల్ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు భోజనం పెట్టలేని దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ, పిల్లలను తీసుకువెళ్లాలనే సమాచారాన్ని అందజేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బియ్యాన్ని వాలంటీర్లు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, ఇప్పటికే ఉద్యోగులు, మహిళలు మన ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు.

ఇప్పుడు చదువుకునే బాలబాలికలు కూడా అసహ్యించుకునే పరిస్థితికి చేరుకోవద్దంటే, విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలి. కోస్గి లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరెక్కడా ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని రఘురామకృష్ణం రాజు కోరారు.

30 మంది ఎంపీలు ఏమి చేస్తున్నట్టు?
రాష్ట్రానికి చెందిన 30 మంది ఎంపీలు ఏమి చేస్తున్నట్టని, ఇతర రాష్ట్రాలకు పీఎం మిత్ర పథకంలో భాగంగా టెక్స్ టైల్స్ పార్కులు మంజూరు చేయగా, మన రాష్ట్రానికి మంజూరు చేయలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు . ఆంధ్రప్రదేశ్లో కూడా 4,500 కోట్ల రూపాయలతో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ మంత్రికి నేను లేఖ రాశానని తెలిపారు. తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తూ తూ మంత్రంగా దరఖాస్తు చేసుకొని, పూర్తి వివరాలు అందజేయకపోవడం వల్లే టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటుకు నోచుకోలేదు. రాష్ట్రానికి చెందిన 30 మంది ఎంపీలు ఈ డి, సిబిఐ, తమ్ముడి కేసులను మాఫీ చేయించడానికి పైరవీలు చేస్తుంటే, ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేది ఎన్నడని ఎద్దేవా చేశారు. అప్పులు తెచ్చుకోవటం పై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం పోరాడడంలో ఏదని అన్నారు. పార్టీ నుంచి తనని సస్పెండ్ చేస్తే, ఒంటరిగానైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గన్నవరం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, నాకు లాగే మా పార్టీలో ఇబ్బందులు పడి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు..

ఆ ప్రభంజనం చూస్తే మా పార్టీ అడ్రస్ గల్లంతని స్పష్టం

గన్నవరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ కు హాజరైన ప్రభంజనాన్ని చూస్తే మా పార్టీ అడ్రస్ గల్లంతేనని స్పష్టమవుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మా పార్టీ పై ప్రజల్లో ఆ కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు, స్కూళ్లను బందు చేయించి స్కూలు బస్సులను, డ్వాక్రా మహిళలను తరలించకపోయినప్పటికీ, గన్నవరం సభకు దాదాపుగా లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, లక్షమంది జనం హాజరు కావడం మామూలు విషయం కాదు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లుగా ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ధర ఎంత?, ప్రస్తుత ప్రభుత్వంలో ఇసుక రేట్ ఎంతో విశదీకరించారు. తప్పుడు పనులు చేస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్కులో నోట్ చేస్తున్నట్లు , ఆ బుక్ ని కూడా ప్రజల ముందు ప్రదర్శించడం శుభ పరిణామం. గన్నవరం మీటింగ్ దెబ్బకు జమోరె ముఠాకు మా పని అయిపోయిందని తెలిసిపోయింది. మహిళలు కూడా అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చారంటే, మా పార్టీ ప్రభుత్వం పై వారికెంత ద్వేషం ఉందో తెలిసిపోతుంది.

మా పార్టీ పీడ వదిలించుకోవాలనే వారు రోడ్డు మీదికి వచ్చారన్నది నిర్వివాదాంశం . గుంటూరు ఎంపీ, అమర్ రాజా కంపెనీ అధినేత గల్లా జయదేవ్ పేరిట దొంగ ట్విట్లు పెట్టించారు. తన పేరిట పెట్టిన ట్విట్లను ఆయన ఖండించాల్సి వచ్చింది. గన్నవరం లో నారా లోకేష్ సభ గురించి సాక్షి దినపత్రికలో ఎక్కడ కూడా వార్త రాయకపోవడం పరిశీలిస్తే సభ ఎంత సక్సెస్ అయ్యిందో అర్థమవుతుందన్నారు.

మూడు రోజులు 300 ఫిర్యాదులు
మార్గదర్శి సంస్థ పై మూడు రోజుల్లో 300 ఫిర్యాదులు ఇచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటు. మార్గదర్శిలో చేరాము మోసపోయామని ఫిర్యాదులు చేయాలని చందాదారులపై ప్రభుత్వ యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది.. సిఐడి చీఫ్ సంజయ్ ఒక ఫోన్ నెంబర్ ఇస్తారట… దానికి ఫిర్యాదులు చేయాలట. చందాదారుల జాబితాను సంపాదించి వీరే వారి పేరిట ఫిర్యాదులు చేసి ఉంటారు. చాలా చోట్ల మార్గదర్శి మేనేజర్లపై తప్పుడు కేసులను బనాయించారు. ఆ కేసులను చూసి న్యాయమూర్తులు ఛీ పొమ్మన్నారు.

అయినా చీరాలలో ఒక మేనేజర్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించినట్లు తెలిసింది. తాగుబోతు వ్యక్తి సంతకాన్ని తీసుకొని, తప్పుడు కేసును నమోదు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది . చంద్రయాన్ వంటి రాకెట్ పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తొక్కడ కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పాలకులు గుర్తించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

అందరం దైవ ప్రార్థన చేద్దాం
ఈరోజు సాయంత్రం 6 గంటల నాలుగు నిమిషాలకు చంద్రయాన్ -3 దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ కావాలని అందరం దైవ ప్రార్థన చేద్దామని రఘురామకృష్ణం రాజు కోరారు. మానవుడు ఎంత పురోగమించిన దేవుడి సహాయం ఉండాలి కాబట్టి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే చంద్రయాన్ లో చంద్ర అనే పదం ఉన్నదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నొచ్చుకోకుండా తన ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.. చంద్రయాన్ విజయవంతం ద్వారా
ప్రపంచంలో ఏ దేశం సాధించని ఘనతను మన దేశం సాధించనుందన్నారు. రష్యా కూడా ఇటీవల ప్రయత్నించి విఫలమయ్యిందన్న ఆయన, ఇస్రో శాస్త్రవేత్తలకు, శాస్త్ర సాంకేతిక రంగాల శాఖ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE