– 563 కోర్టులో చేయలేని పనిని 26 ట్రిబ్యూనల్స్ ఎలా పరిష్కరిస్తాయో ?
-భూ హక్కు చట్టం 27/2023 ను తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే
– న్యాయవాదుల పోరాటం అందుకే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం (ఎ.పి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27, 2023) తీసుకుని వచ్చింది. ఈ చట్టం అక్టోబరు 31 నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెంబరు 512 జారీ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని పై న్యాయవాదులు కోర్టులు బహిష్కరిస్తున్నారు. ఈ చీకటి చట్టం నిజస్వరూపం తెలియని ప్రజలు, ఈ చట్టం వలన న్యాయవాదులకు నష్టమేమో అనుకుని తమకు సంబంధం లేదని భావిస్తున్నారు.
అసలు భూహక్కుల చట్టం అంటే ఏమిటి?
ఎవరికోసం ఈ చట్టం తీసుకొచ్చారు?
న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఈ చట్టంలో అంశాలు ఎవరికి ఇష్టం?
తదితర అంశాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ చట్టం ఉద్దేశ్యం ప్రజల స్థిరాస్థుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధి నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యూనల్ కు అధికారానివ్వడం.
ట్రిబ్యూనల్ ఉత్తర్వులు పై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పీలు చేసుకునే అధికారాలిచ్చారు. సామాన్యులు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడమంటే చాలా డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా చాలా ప్రయాస పడాలి. ఇది దాదాపు అసాధ్యం.
ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టరులో ఒక్క సారి భూహక్కు దారుడు పేరున నమోదైన తరువాత ఎవరికైనా అభ్యంతరముంటే జాయింట్ కలెక్టరు నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్ లో తేల్చుకోవలసి ఉంటుంది.
చిన్న సన్నకారు రైతులు రెవిన్యూ అధికారుల తప్పుల వలనే వారి భూహక్కులను కోల్పోతూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారాలను కట్టబెట్టడం అదే శాశ్వతం అనడం చాలా అన్యాయం. కేవలం చిన్న, సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూహక్కుల చట్టం అవకాశమిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు (ఉదాహరణకు పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, అడంగళ్, 1బి లాంటివి) రద్దు కానున్నాయి.
రాష్ట్రంలో మొత్తం మీద 563 సివిల్ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ 563 కోర్టుల్లో సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యూనల్ చొప్పున 26 ట్రిబ్యునల్ లలో కేసులను త్వరితగతిన పరిష్కస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. 563 కోర్టులో చేయలేని పనిని 26 ట్రిబ్యూనల్స్ ఎలా పరిష్కరిస్తాయో ప్రభుత్వమే ప్రజలకు చెప్పవలసి ఉంది.
న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే విధంగా రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు. తీర్పులును త్వరగా వచ్చే విధంగా అధిక సంఖ్యలో జడ్జీలను, కోర్టులను ఏర్పాటు చేసుకుని అభివృద్ది చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను ప్రజలకు దూరం చేసే ఈ చట్టం ద్వారా కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు, కార్పొరేట్లకు భూములు దారాదత్తం చేసే విధంగా. భూ హక్కు చట్టం 27/2023 ను తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుంది.
ఈ కొత్త చట్టం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలులేదని ఈ చట్టంలో నిబంధన ఉండటం ప్రజా వ్యతిరేకం.
ఈ నిబంధన వల్ల చిన్న, సన్నకారు రైతులు తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్దారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవలసి ఉంటుంది.
ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టిన తరువాత తీర్పులిస్తున్న కోర్టులను కాదని అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని తీర్పులు చెప్పడానికి అవకాశం ఉన్న ట్రిబ్యూనల్స్ నమ్ముకోమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టం చెబుతోంది.
ఈ చట్టం వలన చిన్న, సన్నకారు రైతుల భూములు, భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయి రాచరిక పాలనకు దారి తీస్తుందనే విషయం గుర్తుంచుకోవలసి ఉంది. కనుక ఈ చట్టం ప్రమాదం న్యాయవాదులకు కాదు, సన్న, చిన్న కారు, దళిత, గిరిజన, పేద వర్గాలకు చెందిన వారికనే విషయం గుర్తించాలి.
ఈ చట్టం అమల్లోకి వస్తే మొట్టమొదటగా నష్టపోయేది ప్రజలు. పేదల భూములను ఆక్రమ రికార్డులతో ఆక్రమించే భూ కబ్జాదారులకు ఇది ఉపయోగం. ఈ చట్టం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మాయ మాటలు చెప్పడమేకాక, సమస్య న్యాయవాదులకు సంబంధించిందనీ, ప్రజలకు ఎలాంటి సంబంధమే లేదనీ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ నల్ల భూ హక్కు చట్టం నీతి అయోగ్ సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం చట్టం నమూనా మరియు దాని నియమాలు, నమూనా ఫారమ్స్ అన్నీ తయారు చేయించి రాష్ట్రాలకు పంపింది. దానిలో రాష్ట్రం పేరు మాత్రమే పెట్టి రాష్ట్రాలు చట్టం ఆమోదించుకోవచ్చు.
అంటే రాష్ట్రాల పాత్ర తపాలా పంపిణీ వారి పాత్ర మాత్రమే.
మహారాష్ట్ర యొక్క ముసాయిదా భూమి హక్కు చట్టం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇలాంటి నిబంధనలను సిఫారసు చేయడానికి కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్‌ను ప్రేరేపించింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని వెంటనే అమలులోకి తెచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ నల్లచట్టాన్ని చిన్న, సన్నకారు, దళిత, బలహీన, వర్గాలు, ఇతర భూయజమానులందరూ వ్యతిరేకించి ఈ చట్టం రద్దు చేసేవరకూ పోరాటం చేయాల్సి ఉంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సిన భాధ్యత న్యాయవాదులతోపాటు వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలపై ఉంది.
— పి. పి. శాస్త్రి
అడ్వకేట్, ఏలూరు..