-బీఆర్ఎస్ పాలనలో ఏనాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు
-కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు
-విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి
-ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
-గత బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన వైఖరితో మసకబారిన ఆర్టిజన్ల జీవితాలు
-అంధకారంలో మగ్గిపోతున్న 22 వేల మంది విద్యుత్ కార్మికుల కుటుంబాలు
-విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బిజెపి డిమాండ్
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ శాఖలో పవర్ ప్లాంటుల నిర్మాణం దగ్గర నుంచి ఉద్యోగుల నియామకం, విద్యుత్ కొనుగోలులో అవకతవలు, అవినీతిపై విచారణ కొనసాగుతోంది. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని, ఆర్థిక వనరులను దెబ్బతీసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాలపై జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది విధితమే. విద్యుత్ శాఖలో ఆర్థికపరమైన అంశాలు నాణేనికి ఒకవైపు అయితే, విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ మరోవైపుగా ఉంది.
తెలంగాణ రైతులు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విద్యుత్ ఉద్యోగుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 22వేల మంది విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చి ఆర్టిజన్లుగా గుర్తించి, వారి జీవితాలను త్రిశంకు స్వర్గంలో పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో సకల జనులు చేయిచేయి కలిపి కదంతొక్కి పోరాటంలో భాగస్వామ్యమయ్యారు. విద్యుత్ శాఖలో కొంతమంది ఉద్యోగులు ట్రాన్స్ ఫార్మర్లు ఎక్కి ఆత్మహత్యలు చేసుకున్నవారు.
తెలంగాణ రాష్ట్రమొస్తే నిరుద్యోగి అనే మాట వినపడదు అని గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడితే ఒక్కపూటలో సర్వీస్ రూల్స్ మార్చి ఉద్యోగుల భవిష్యత్తును బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ మాటలు చెప్పిన్రు. తెలంగాణ రాష్ట్రమొచ్చినంక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలోని 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్ స్టాండర్డ్ రూల్స్ తీసుకొచ్చి ఆర్టిజన్లుగా గుర్తించింది. కాని నేడు ఆర్టిజన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అనేక సమస్యలతో నెత్తినోరు కొట్టుకుంటున్నరు. 22 వేల మంది విద్యుత్ కార్మికులు.. ప్రైవేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా ఏ బెనిఫిట్స్ వర్తించకుండా త్రిశంకుస్వర్గంలోకి నెట్టివేయబడ్డారు.
22 వేల మంది విద్యుత్ ఉద్యోగులను.. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా పే-స్కేల్, ప్రమోషన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు ఏవీ వర్తించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కార్మికుల సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలు, అవినీతిపరులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం , గత ప్రభుత్వం వల్ల నష్టపోయిన డబ్బును రికవరీచేయడం ఎంత ముఖ్యమో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. 22 వేల మంది విద్యుత్ కార్మికుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం.
గత రెండేళ్ల క్రితం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ధర్నా చేసిన 200 మంది ఆర్టిజన్లను విధుల నుంచి టర్మినేట్ చేసి, తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులపై కొరడా ఝులిపిస్తామంటూ చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బాధిత 200 మంది విద్యుత్ ఉద్యోగులను స్వస్థలాల్లో ఉద్యోగాలు చేసుకునేలా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం 22 వేల మంది విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.