Suryaa.co.in

Features

బ్రాహ్మణుడి ఆశీర్వాదం విలువ

ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది

ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు….
“ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు.కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి.”

జడ్జిగారు పురోహితునితో “మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా ?” అని ప్రశ్నించారు . దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు…. “నేను సంపాదించినదంతయు సక్రమమే… ఇసుమంతయు అక్రమం కాదు .” “అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి”అని జడ్జిగారు అడిగారు.

“అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు. నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను. ‘ఆత్మ హత్య మహా పాపం’ అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు .

కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ‘ఆశీర్వదించండి’ అని వేడుకున్నారు.అప్పుడు నేను ‘సంతాన సిద్ధిరస్తు’అని ఆశీర్వదించాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి… ‘నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి.’అని ప్రాధేయపడ్డారు. దానికి నేను ‘మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు .మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు.’ అని ఆశీర్వదించాను.

ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు. మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.నేను ఆదంపతులిద్దరిని ‘ఆయురారోగ్య వృద్ధిరస్తు’అని ఆశీర్వదించాను.

అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.అయ్యా!ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి” అన్నారు. పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు…

“ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతా పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే. ఆ ధనం సక్రమమైనదే. అటుపిమ్మట
కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు. అదియును సక్రమైనదే !

మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు .అది కూడా సక్రమమే.మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము.” అని తీర్పు వెల్లడించారు.

ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు….
“అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం తో ఉన్నాను .వారు ఎవరో తెలుపగలరా?”
“ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే !”అని తెలియచేశారు పురోహితుల వారు.
వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జడ్జి.
బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది.

– కళాధర శర్మ తెలకపల్లి
పురోహితులు

LEAVE A RESPONSE