ఇవాళ జగ్గయ్య శత జయంతి. ఆయన్ను స్మరించుకుందాం
బహుముఖ ప్రజ్ఞాశాలి జగయ్య. ఆయన గురించి చదివాం. జగ్గయ్య గొప్పకవి కూడా. హైస్కూల్లో చదువుకునే రోజుల్లో హంపియాత్రకు వెళ్లినప్పుడు ఆ గడ్డపై కాలుమోపాక ‘జీర్ణహంపి’ పేరుతో కొన్ని పద్యాలు రాశారు జగ్గయ్య. చాల బావుంటాయి అవి.
హంపి గుఱించి రాస్తూ…”ఇదొక విషాద గాథ … అంటూ మొదలు పెట్టి “మూగ యెలుంగులు ఓరు గాలులా తలపుల పాడికొంచు, బరితప్పవు నేటి కదెంత బంధమో” అనీ, “ఇది కుందేటికి గూడ పౌరుషము రేకెత్తించు దేశమ్ము, దు/ ర్మద రాజన్య విదీర్ణ కంధర గళద్రక్తోష్ణ ఖడ్గ ప్రభా/ విదితోదగ్రుడు కృష్ణరాయడిచటన్ స్వేచ్ఛామరుద్ధూతశుంభద ఖండాంధ్ర పతాకరేఖల దిశాభాండమ్ము వెలిగించెలే!” అనీ, “కరిగిపోలేదింక చరిత మీటిన పాట యేడు కంబాలలో యీదులాడు, / మాసిపోలేదింక మయకుమారుల ప్రజ్ఞ శిధిల శిల్పాలలో సిగ్గువోవు, / చితికిపోలేదింక ప్రతనాంధ్రబంధమ్ము పంపా సరసిదాగి పలుకరించు, / ఆఱిపోలేదింక కోరకత్తుల కాక నిత్య మధ్యాహ్నాల నిప్పు చెఱగు,/ క్రుళ్లిపోలేదు నా జాతి గుండెచేవ / పగులు వాఱిన నేల మాళిగల తెరలు/ నాల్గువందల యేడుల నాడు నేడు/ గడనకెక్కిన తెనుగు వంగడము నాది” అనీ చాల గొప్పగా అన్నారు జగ్గయ్య.
ఒక చోట … “ఈ నిలువిటెత్తు ఱాళ్లు మున్నే / విక్రమ దురీక్ష్యులైనట్టి వీరవరులో / తల్లి మాగానిపై మమత్వమ్ము తెగక / మూగకాపరులై, వంతముడిగిరేమొ!” అన్నారు. ఇదొక్కటి చాలు జగయ్య గొప్పకవి అని తెలుసుకోవడానికి. ఇంకో చోట “ఈ గాలి విసురులో ఏ కోడెమొనకాని తెగిన గుండియ కోర్కె బుగులు కొనియె / ఈ బండఱాళ్లలో ఏ శిల్పకారుల నూరేళ్ల స్వదమ్ము పేరికొనియె?/ ఈ ముండ్లపొదలలో ఏ లేత జవరాండ్ర పసుపు కుంకుమ బైసి బ్రద్దలయ్యె?” అంటూ మహోన్నతంగా రాశారు. జగ్గయ్య పద్య రచన చాల గొప్పది.
1940లో ఇలా ఈ ఎఱ్ఱమట్టిలో ఏ పేదగుడిసెల కడుపు చుమ్మల గూడు క్రాగిపోయె? అని జగ్గయ్య రాయడం గమనించాల్సిన విషయం. “ఉన్నవారికి మాత్రమే ఉన్నదోయి, / లేనివారికి చరితలో లేదు చోటు” అని జీర్ణహంపి పద్యాలలో జగ్గయ్య అనడం వేమన స్థాయిలో ఆయన్ను నిలుపుతుంది.
రవీంద్ర గీత అనే పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని కవితల్ని తెలుగులోకి అనువదించారు జగ్గయ్య. చాలా గొప్ప అనువాదం అది. పద్యాలలో అనువదించారు వాటిని. ఆ రవీంద్రగీత ఒక స్వతంత్ర రచనలా ఉంటుంది.
గీతాంజలిని మాత్రమే కాక ఇతర రవీంద్రనాథ్ కవితలను కొన్నిటిని ఎన్నుకుని జగ్గయ్య అనువదించారు. వాటిల్లో కొన్ని పంక్తులు ఇవి.
1. ఉదయ రోచిస్సు ప్రియవయస్యుని విధాన నా గృహద్వార సన్నిధి నగవు లీను…
2. ఇంద్రియ ద్వారముల మూయ నెపుడు నేను…
3. కార్మికుడు మమ్ము నడిపించు కర్మయోద్ధ!
4. బ్రతుకుతోఁ జేయిగలిపి నర్తన మొనర్చు
జగ్గయ్యలోని కవి-ముఖాన్ని మనం సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంది. జగ్గయ్య మంచి ఇంగ్లిష్ రాస్తారు. ఆయన ఇంగ్లిష్ అభివ్యక్తి చాల బావుంటుంది. ఆయన తెలుగు రచనా విధానాన్ని గమనించినా ‘అభివ్యక్తి విధానం’లో ఆయనకు చాల మేలైన అభినివేశం ఉంది అన్నది తెలియవస్తుంది.
మన తెలుగులో గొప్ప కవులుగా పేరుబడ్డ వాళ్లకు అందని, తెలియరాని ఉన్నత స్థాయి అభివ్యక్తి విధానం జగ్గయ్యది. దారుణంగా దెబ్బతిన్న ఇవాళ్టి ‘తెలుగు అభివ్యక్తి’లో నేరస్థులైన తెలుగు విద్వాంసులు, ప్రముఖ కవులు, తెలుగు అధ్యాపకులు, శివారెడ్డి, గోపి, అఫ్సర్, వాడ్రేవు చినవీరవద్రుడు వంటి ప్రముఖ కవులు(?), తెలుగు కవి విశ్లేషకులు జగ్గయ్య అభివ్యక్తి వైఖరిని చదివి సిగ్గుపడాలి.
ఒక సందర్భంలో ఒక కవి గురించి ఇంగ్లిష్లో జగ్గయ్య ఇలా రాశారు: ‘This is only a micro-manifestation of his infinite talent’. ఈ అభివ్యక్తి తెలుగు కవి-మేధ నుంచి రాదు. జగ్గయ్య 30యేళ్ల క్రితం చేసిన అభివ్యక్తి ఇది. ఇటీవల Loafe పదాన్ని ‘తీరిగ్గా’ అనీ, spear of summer grassను ‘వసంత కాలపు గడ్డిపోచ’ అనీ, tongue అంటే ‘గళం’ అనీ అనువదించి తెలుగులోని కవి మేధా పండితులకు ఇప్పటికీ ఇంగ్లిష్ పరంగా విదూషకత్వమే ఆభరణంగా ఉంది అని వాడ్రేవు చినవీరభద్రుడు గట్టిగా తెలియజేశారు. ఇవాళ్టి తెలుగు కవి-మేధావులు జగ్గయ్య రచనల్ని చదివాలి; అభివ్యక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి.
మంచి నటుడు, డబ్బింగ్ కళాకారుడు, రాజకీయ నాయకుడు, రేడియో ప్రయోక్త, సాహితీ వేత్త, కవి, విద్యావేత్త అయిన జగ్గయ్య గొప్ప వాస్తు ఆరింద (expert) కూడా! బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్య సంపూర్ణ కళా వ్యక్తిత్వంపై తెలుగుకు సరైన ఆలోచన, అవగాహన రావాలి.
– రోచిష్మాన్
9444012279