కిలారు రాజేశ్ విషయంలో సీఐడీ, ఇంటెలిజెన్స్ వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ చట్టవిరుద్ధమే
• సీఐడీ అధికారులు రాజేశ్ ను విచారిస్తున్న సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందితో ఇంటిలిజెన్స్ అధికారి పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి
• ఏదో రకంగా రాజేశ్ ను భయపెట్టి, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆయనతో సాక్ష్యం చెప్పించాలని ఆంజనేయులు ప్రయత్నించాడు
• జగన్ రెడ్డి ఆనందంకోసం ఆంజనేయులు వీధిరౌడీ కంటే దారుణంగా వ్యవహరించారు
• వెబ్ సైట్లోని సాంకేతిక సమస్య వల్ల లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని న్యాయస్థానంలో చెప్పిన సీఐడీ, ఇప్పటికీ ఆ నోటీసుల్ని ఎందుకు ఎత్తేయలేదో చెప్పాలి
• సీఐడీ డీఎస్పీ ధనుంజయరెడ్డి సీఐ, ఎస్సై స్థాయి సిబ్బందికి.. వైసీపీ ప్రభుత్వానికి మధ్య దళారిగా పనిచేస్తున్నారు
• జగన్ రెడ్డి ప్రాపకం, మెప్పుకోసం చట్టవిరుద్ధంగా పనిచేసే ఏ అధికారైనా భవిష్యత్ లో న్యాయస్థానాల ద్వారా శిక్షింపబడటం ఖాయం
– టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ నేత కిలారు రాజేశ్ ను అన్యాయంగా ఇరికించిన జగన్ రెడ్డి జేబు సంస్థ సీఐడీ, చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత కోర్టుకు సమర్పించిన కస్టడీ పిటిషన్లో సీఐడీ కావాలనే రాజేశ్ పేరు చేర్చిందని, 10-10-2023న సీఆర్ పీసీ-160 కింద రాజేశ్ కు నోటీసులిచ్చిన సీఐడీ, 16-10-23న విచారణకు రావాలనికోరి, మరలా అదేరోజున ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని ఇదంతా గమనిస్తే, రాజేశ్ విషయంలో జగన్ సర్కార్ ఒక పథకం ప్రకారం కుట్రతో వ్యవహరించినట్టు అర్థమవుతోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య క్షులు ఎం.ఎస్.రాజు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ సీఐడీ నుంచి తనకు వచ్చిన నోటీసులపై రాజేశ్ 13-10-2023న యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. ఆ సందర్భంలో సీఐడీ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది.. “స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజేశ్ ను సాక్షిగానే పరిగణించామని, నిందితుడిగా కాదు” అని కోర్టులో అసత్యాలు చెప్పారు. అదే రోజున కిలారు రాజేశ్ కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అంతకు ముందు సీఐడీ ఇచ్చిన నోటీసులకు కట్టుబ డి 16-10-23న రాజేశ్ విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఇంటిలిజెన్స్ డీజీ పీ.ఎస్.ఆర్.ఆంజనేయులు అక్కడ ఉండటం పలు అనుమానాలు, ఆశ్చర్యం కలిగించింది. ఆంజనేయులు ఏవిధంగానైనా రాజేశ్ ను బెదిరించి, భయపెట్టి ఆయన ద్వారా చంద్రబాబు పేరు చెప్పించాలన్న ఉద్దేశంతోనే అక్కడున్నారు. టీడీపీ నేతల్ని భయపెట్టడం, వారి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తామని బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని ఆంజనేయులుకు సూచిస్తున్నాం.
సీఐడీ విభాగం ఒకసారి విచారించాక మరలా రాజేశ్ ను మరోసారి విచారణకు రావాలని కోరింది. కేసు విచారణలో భాగంగా లేని ఆధారాలు తమ ముందు ఉంచాలని ఆయన్ని భయపెట్టింది. కోర్టులో రాజేశ్ కేవలం సాక్షి మాత్రమేనని చెప్పిన సీఐడీ, విచారణ సమయంలో ఆయన్ని నిందితుడిగా పేర్కొనడం జగన్ రెడ్డి ప్రభుత్వ రెండు నాల్కలధోరణికి నిదర్శనం.
ఆంజనేయులు, రఘురామిరెడ్డిల ఆదేశాలతోనే హైదరాబాద్ లోని రాజేశ్ నివాసం వద్ద వారి సిబ్బంది రెక్కీ నిర్వహించారు
07-11-2023న హైదరాబాద్ లో రాజేశ్ నివాసమీపంలో ఇద్దరువ్యక్తులు రెక్కీ నిర్వహించారు. రాజేశ్ ఇంటి వద్ద నుంచి తనపిల్లల్ని తీసుకురావడానికి స్కూలుకు వెళ్లే సమయంలో వారు కారులో వెళ్తున్న ఆయన్ని వెంబడించి, “మా సార్ చెప్పినట్టు వినాలి. లేకుంటే నిన్ను చంపేస్తాం” అని బెదిరింపులకు దిగారు. రాజేశ్ వెంటపడిన వారు ఎవరా అని తెలంగాణ పోలీసులు విచారిస్తే, ఆంజనేయులు, రఘురామిరెడ్డి కింద పనిచేసే పోలీసులని, వారి ఆదేశాలతోనే రెక్కీ నిర్వహించారని తేలింది. ఈ తంతు ముగిశాక సీఐడీ మరలా 09-11-2023న రాజేశ్ కు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 23కి విరుద్ధమని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
రాజేశ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్న సమయంలో ఆంజనేయులు అక్కడికి ఎందుకెళ్లారో చెప్పాలి జగన్ రెడ్డి మెప్పుకోసం ఆంజనేయులు వీధిరౌడీ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు
ఈ వ్యవహరంలో పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు ఎందుకు జోక్యం చేసుకున్నారు? రాజేశ్ ను సీఐడీ విచారిస్తున్న సమయంలో ఇంటిలిజెన్స్ డీజీ ఆంజనేయులు అక్కడికి ఎందుకెళ్లారో చెప్పాలి. జగన్ రెడ్డి ముఖంలో ఆనందం చూడటానికి ఆంజనేయులు వీధిరౌడీ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిలిజెన్స్ డీజీగా ఉంటూ టీడీపీనేతల్ని బెదిరించడం, వారి ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడటం చేశాడు.
జగన్ రెడ్డిని అన్నా..అన్నా అని పిలుస్తున్నంత మాత్రాన ఆయన తనను కాపాడతాడని ఆంజనేయులు అనుకుంటే అంతకంటే వెర్రితనం మరోటి ఉండదు. సొంత చెల్లిని, తల్లినే తన అవసరాలకు వాడుకొని వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి. సీఐడీ, ఇంటిలిజెన్స్ అధికారులు తమ పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. సీఐడీ విచారణ సమయంలో ఆంజనేయులు వ్యవహరించిన తీరుపై కూడా 17-11-23న రాజేశ్ సీఐడీ కోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేశారు.
రాజేశ్ పై జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఇప్పటికీ ఎందుకు ఎత్తేయలేదో సీఐడీ సమాధానం చెప్పాలి
కిలారు రాజేశ్ ధైర్యవంతుడు, నిజాయితీపరుడు కాబట్టే చట్టప్రకారం, న్యాయ బద్ధంగా సీఐడీ విచారణకు హాజరయ్యారు. తప్పుడుకేసులో ఇబ్బంది పెడుతున్నారనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఐడీ విభాగం గతంలో రాజేశ్ పై జారీ చేసిన లుకౌట్ నోటీసులు నేటికీ అలానే ఉన్నాయి. సదరు నోటీసుల జారీ వెబ్ సైట్లోని సాంకేతిక సమస్య వల్ల జరిగిందని న్యాయస్థానంలో చెప్పిన సీఐడీ, ఇప్పటికీ ఆ నోటీసుల్ని ఎందుకు ఎత్తేయలేదో సమాధానం చెప్పాలి.
సీఐడీ డీఎస్పీగా ఉన్న ధనుంజయరెడ్డి తన కింద పనిచేసే సీఐ, ఎస్సై స్థాయి సిబ్బందికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య దళారిగా పనిచేస్తున్నారు. కిలారు రాజేశ్ లాంటి కీలకనేతను ఇబ్బంది పెట్టానని గొప్పలు చెప్పుకుంటూ జగన్ రెడ్డి మెప్పుకోసం ధనుంజయరెడ్డి పాకులాడుతున్నాడు. సీఐడీ చీఫ్ సంజయ్..అంతకు ముందు పనిచేసిన సునీల్ కుమార్ ఇద్దరూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలుగుదేశం నేతల్ని భయభ్రాంతులకు గురిచేయడమే తమ లక్ష్యమన్నట్టు పనిచేశారు. వారే కాదు జగన్ రెడ్డి ప్రాపకం… మెప్పు కోసం పనిచేసే ఏ అధికారి అయినా భవిష్యత్ లో న్యాయస్థానాల ద్వారా శిక్షింపబడటం ఖాయం.” అని రాజు హెచ్చరించారు.