విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నాయని విశ్వశాంతికి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నాయని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. విశ్వంజీ డెబ్భైఎనిమిదవ జన్మ దినోత్సవ వేడుకలు 2022లో మార్చి ఒకటి నుంచి మార్చి 5 వరకు గుంటూరు సమీపంలోని ‘విశ్వనగర్’ఆశ్రమంలో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం విశ్వనగర్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్వంజీ మాట్లాడారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోదని ఆయన స్పష్టం చేశారు. మార్చి నెల తరువాత ప్రశాంతమైన వాతావరణం
నెలకొంటుందని భారతదేశం పాత్ర కీలకంగా ఉండబోతుందని కూడా స్వామిజీ పేర్కొన్నారు. భారతీయ విశ్వాసాలు, సంప్రదాయాలు విశ్వమానవ కల్యాణానికి ఉపయోగపడుతాయని అన్నారు.
ప్రస్తుతం చర్చల ద్వారా నేటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తన జన్మదినోత్సవాన్ని ‘విశ్వ సమైక్యత శాంతి దినోత్సవం’గా జరుపుకోవాలన్నది తన ఉద్దేశం అన్నారు.
అన్ని మతాల ప్రతినిధులు, మేధావులతో ప్రపంచస్థాయిలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి విశ్వశాంతికి చర్చలు జరపాలని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. విశ్వశాంతిని కాంక్షించే ‘విశ్వజిత్’ యాగం చేయాలన్నది తనకోరిక అని ఆయన పేర్కొన్నారు. విశ్వజిత్యాగం త్రేతాయుగంలో రఘుమహారాజు చేసారని స్వామిజీ గుర్తుచేశారు.
విశ్వశాంతికోసమే తాను విశ్వనగర్ ఆశ్రమం ఏర్పాటుచేశానని అన్నారు. నిరంతరం దానికోసమే పాటుపడుతుందని అన్నారు. సమస్యలు, కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండబోదని వీటిని అధిగమించేందుకు ప్రతివారూ ఆలోచన చేయాలన్నారు. మనలను ఎవరు దూషించినా, పొగిడినా, సంయమనంతోనే ఉండాలని అన్నారు. పరస్పరం కొట్లాడుకోకుండా, తిట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచం లోని దేశాలు ఆయుధాల కోసం ఖర్చు చేసే డబ్బుతో ప్రపంచంలోని మొత్తం పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో కృష్ణా బేసిన్లో విలువైన ఖనిజాలు ఉన్నాయని వీటిని వాడుకోవాలని సూచించారు.
ఐదురోజుల కార్యక్రమాలు
1. మార్చి 1 నుంచి జరిగే విశ్వంజీ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సుదర్శనహోమం, రుద్రహోమం, చండీహోమం, సూర్యనవగ్రహ హోమాలతో పాటుగా వివిధ సహస్రనామ పారాయణలు కూడా ఉంటాయి.
2. మార్చి 5న జరిగే కార్యక్రమంలో ఆంధప్రదేశ్ హోంమంత్రి సుచరిత పాల్గొంటారు.