– ఎవడు సైకో కాదో చెప్పడం ఈజీ
(వాసిరెడ్డి అమర్నాధ్)
చూడాలని ఉందా ?
” ప్రియుడితో కలిసి.. భర్తను చంపి … శవం పక్కనే పోర్న్ ఫిలిమ్స్ చూస్తూ… మూడు గంటలు గడిపిన మహిళ” – వైరల్ అవుతున్న వార్త.
భర్తను చంపిన భార్య … భార్యను చంపిన భర్త —
ఇలాంటి వార్తలు…. గత మూడు నెలలుగా.. రోజుకు కనీసం రెండు.
మిగతా విషయాలు కాసేపు పక్కన పెడుదాము .
ఇలాంటి వారికి … తాము పట్టుబడుతాము. అటు పై జీవితం చిప్పకూడు పాలు అనే ఇంగిత జ్ఞానం ఉండదా ?
ఇన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలకు ఎందుకు పాల్పడుతున్నారు ?
జవాబు
అమిగ్డలా అతిగాళ్లు !
మెదడులో అమిగ్డల అనే భాగం ఉంటుంది. వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు… లేదా తీవ్ర సమస్య ఎదురు కాబోతుంది … అని తెలిసినప్పుడు అమిగ్డల చర్యకు దిగుతుంది . ఇది మానవ జాతి ఆవిర్భావం నుంచి జరుగుతోంది .
కానీ … .
గత కొన్నేళ్లుగా ముబైల్ పరికరాల్ని… తెగ వాడడం వల్ల చాలా మందిలో అమిగ్డల… హైపర్ ఆక్టివ్ అయిపోయింది.
అంటే పని చేయాల్సిన దానికంటే ఎక్కువగా చెయ్యడం. .
అమిగ్డల లో వచ్చిన ఈ మార్పు వల్ల… ప్రతి దానికి … అతిగా ప్రవర్తించడం జరుగుతోంది .
గోటితో పోయేదానిని గొడ్డలి దాక తెచ్చుకోవడం పరిపాటి గా మారింది .
ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పిచ్చోళ్ళు !
మెదడులో మరో భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ .
ప్రతి మనిషికి కోపం ఉద్రేకం సహజం .
ఆవేశం అదుపు తప్పకుండా చూసుకొనేది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ . “క్షణికావేశం తో హత్య చేస్తే ఆ పై బతుకు బస్సు స్టాండ్ అయిపోతుంది .. కాస్త తగ్గు” అని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చెబుతుంది .
ఇంపల్స్ కంట్రోల్ అంటారు . అంటే ఆ క్షణంలో ఏదనిపిస్తే అది చెయ్యకుండా”.. తగ్గు తగ్గు” అని చెప్పేది మెదడులోని ఈ భాగం .
మొబైల్ పరికరాల అతివినియోగం వల్ల ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బలహీన పడుతోంది .
క్షణికావేశాలు … ఏది అనిపిస్తే అది చేసెయ్యడం … ఇంగిత జ్ఞానం చచ్చిపోవడం .. ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది .
2. పురుషుల్లో స్త్రీ ద్వేషం, మహిళల్లో పురుష ద్వేషం పెరిగిపోతోంది. పెళ్ళొద్దు అంటున్నారు . పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. కుటుంబాల్లో కలహాలు . సోషల్ మీడియా లో అయితే ప్రతి దానికి రచ్చ రచ్చ. జనాల్లో ఇంత అసహనం ఎందుకు పెరిగిపోయింది ?
జవాబు : సింగులేట్ పిడివాదులు !
మెదడులో ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే ఇంకో భాగముంది .
ప్రతి మనిషి తప్పులు చేస్తాడు .
” నువ్వు చేసింది తప్పు .. అవతలి వారితో అనవసరంగా వివాదానికి దిగావు .. వారిని హర్ట్ చేసావు . కాస్త తగ్గు ” అని ఇది చెబుతుంది .
భార్యాభర్తల మధ్య కలహాలు లేనిదెప్పుడు ?
సన్నిహితుల మధ్య బేధాభిప్రాయాలు రానిదెప్పుడు ? కానీ కాసేపట్లో కనీసం వారం రోజుల్లో ఇలాంటి వివాదాలు సర్దుకొనేవి .
ముబైల్ పరికరాల అతి వినియోగం వల్ల ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అతిగా ప్రవర్తిస్తోంది .
పిడివాదం … “నేను చెప్పిందే కరెక్ట్ .. చచ్చినా రాజీ పడను” అనే మొండి ధోరణి సర్వ సాధారణం అయిపోతోంది .
మొబైల్ పరికరాల అతి వినియోగం వల్ల మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, ఇన్సుల, టెంపోరల్ లోబ్స్… లాంటి భాగాల్లో గ్రే మేటర్ తగ్గిపోయి… ఆవేశం ఆక్రోశం హింసధోరణి సర్వ సాధారణం అయిపోతోంది . 3. మనుషుల్లో సంతృప్తి అనేదే లేకుండా పోతోంది . ప్రతి దానికి అవతలి వారితో పోల్చుకోవడం .. నిరాశ నిస్పృహ కనిపిస్తోంది . ఏది చేసినా అతి . ఉదాహరణకు పండగలు . గతం లో కొందరు పండక్కు ఒకటో రెండు పెగ్గులు తాగే వారు. ఇప్పుడు బాటిళ్లు ఖాళీ చేస్తున్నారు .
ఒకప్పుడు వారానికి ఒక చిత్ర లహరి వస్తే తెగ ఆనందపడేవారు . వారానికి ఒక సినిమా .
ఇప్పుడు తెలుగులోనే పది దాక సినిమా ఛానళ్ళు . అయినా తృప్తి లేదు . ఒటిటి లు.. అయినా తనివి తీరలేదు . ఎందుకు ?
జవాబు:
డోపమైన్ అతిగాళ్లు !
మనసుకు నచ్చింది చేస్తే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది .
హ్యాపీ ఫీలింగ్ దీని ద్వారానే వస్తుంది .
ఒకప్పుడు సాయంకాలం కాసేపు టీవీ .
అటు పై రోజంతా వచ్చే టీవీ కార్యక్రమాలు .
ఇప్పుడు జనాల చేతుల్లో మొబైల్ . రీల్స్ .. షార్ట్ ఫిలిమ్స్ .. సోషల్ మీడియా పోస్ట్లు .. వీటిని చూస్తే డోపమైన్ కిక్కు .
కానీ ఇక్కడుంది ఒక చిక్కు .
మెదడులో డి- 2 రిసెప్టార్స్ అనేవి ఉంటాయి . అదేపనిగా డోపమైన్ కిక్కుకు అలవాటు పడితే అవి డోపామైన్ ఉత్పత్తి చేయలేక చతికిల పడుతాయి .
దీనితో కిక్కు తగ్గుతుంది .
అప్పుడు మనిషి మొబైల్ కు మరింత అతుక్కొని పోతాడు .
కొంత మంది తాగుబోతులు పరగడుపునే తాగుతారు .
మొబైల్ వ్యసన పరులు కూడా ఇదే విధంగా రాత్రి పగలు బానిసలు అయిపోతారు .
పెరుగుట విరుగుట కొరకే అని సామెత .
మొబైల్ వినియోగం పెరగడమే కానీ విరుగుట ఉండదు . ఆ కట్టె కాలిపోయాకే అది విరుగుతుంది .
మెంటల్ డిజార్డర్స్ .. హత్యలు… ఆత్మ హత్యలు ఇవి సాధారణం అయిపోతాయి .
4. మొబైల్ అతి వినియోగం వల్ల సైకో లు పెరుగుతున్నారా ?
జవాబు :
సైకో లోకం !
అసలు సైకోలు అంటే ఎవరు ?
ఒకప్పుడు మానసిక చికిత్సలయాల్లో కనిపించేవారు .
ఇప్పుడు మన చుట్టూరా .
పది మందిలో ఎనిమిది మంది ఇదే స్థితిలో . ఒకరిలో ఎక్కువ .. ఇంకొకరిల తక్కువ . తేడా అంతే !
“మగాళ్లు కేటుగాళ్లు . అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదు ” అని వాదిస్తుంది 60 ఏళ్ళ మహిళ .
ఒక మహిళ పెట్టిన పోస్ట్ పై తనకు భేదాభిప్రాయం ఉండొచ్చు . దాన్ని వ్యక్తం చేయవచ్చు . కానీ రిటైర్ అయిన ఒక మగాడు ఆ పోస్ట్ పై బండబూతులు కురిపిస్తాడు .
వయసు మీదబడిన వారిలోనే ఈ స్థితి ఉంటే ఇక మిగతా వారి సంగతి ?
మందు పార్టీలలో మగాళ్లు ..
కిట్టి పార్టీలలో మహిళలు ..
రేవ్ పార్టీలలో యూత్ ..
నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం ..
రేపు లేదన్నట్టు ఎంజాయ్ చెయ్యడం ..
ఇప్పుడిది సర్వసాధారణం .
ఎవడు సైకో కాదో చెప్పడం ఈజీ .. ప్రపంచం సైకోల మయం .
ట్రాఫిక్ లో చిన్న గొడవ .
దానికే మర్డర్ జరిగిపోవచ్చు .
ఇరుగుపొరుగు వారి మధ్య చిన్న వివాదం .
అది హింసకు మర్డర్లు కు దారి తీయొచ్చు .
5. మరి ఇలాంటి వారు కౌన్సిలింగ్ కు లొంగుతారా ?
జవాబు :
రగులుతోంది …
కరీంనగర్ జంట .
వారిని పోలీస్ లు అరెస్ట్ చేశారు .
కారణం అడల్టరీ కాదు .
దానికి పెద్ద కోర్ట్ ఎప్పుడో పచ్చ జెండా ఊపింది .
యూరోప్ తరహాలో తమ భార్యల్ని అమ్మకానికి పెట్టే ” వేడి …/// భార్య ” అప్ ల బిజినెస్ త్వరలో .
ముక్కు – మొహం తెలియని కరీంనగర్ జంట లాంటి వారి ని నమ్మొద్దు . మా అప్ లో రిజిస్టర్ చేసుకోండి . పక్కింటి పుల్ల గూరను ఎంజాయ్ చెయ్యండి “అంటూ అతి త్వరలో ప్రకటనలు చూస్తారు.
ఆచారాలు వ్యవహారాలు చచ్చిపోనీ ..
చిన్న లాజిక్ మాట్లాడుకొందాము .
. మోడలింగ్… గ్లామర్ .. ఫాన్స్ ఓన్లీ .. పేరేమి ఉన్నా … వయసు అందం ఆధారంగా నడిచేవే .
మనిషి సగటు జీవనం ఇప్పుడు ఎనభై ఏళ్ళు .
వయస్సు – అందం ఆధారంగా నడిచే వృత్తి ఎన్నాళ్లు ?
పదేళ్లు ?
15 ఏళ్ళు ?
అటు పై ?
అందాన్ని చూపి అధిక ఆదాయం ఆర్జించే వ్యక్తి .. పురుషుడు కావొచ్చు మహిళ కావొచ్చు .. ఎన్నాళ్ళు ? ఎన్నేళ్లు ?
35- 40 దాటితే బతుకు తెరువు ఎలా ? ఆదాయం తగ్గిపోయి ఏదో క్రైమ్ { డ్రగ్స్ , ఇతరులను పడుపు వృత్తిలోకి దించడం బ్లాక్ మెయిలింగ్} . కరీంనగర్ జంట పట్టుపడింది ఇలాంటి కేసులోనే .
వీరిని కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు.
ఏ గూటి చిలుక ఆ గూడు చేరుతుంది .
నీ అభిప్రాయం ఎక్కడ ప్రతిధ్వనిస్తోందో సోషల్ మీడియా అలాగరిథమ్ నిన్ను అక్కడికి తీసుకొని వెళుతుంది .
అక్కడ అన్నీ ఒక గూటి పక్షులు .
నీ మనసులోని మాటలు అక్కడ కన్పిస్తాయి .
దీంతో నీ.. లో ఆలోచన… అంతర్మధనం ఆగిపోతాయి .
అనసూయ శివాజీ వివాదం .. నెల రోజులయినా ఇంకా సద్దుమణగలేదు .
ఏదైనా తేలిందా ?
అవతలి వారి అభిప్రాయం గురించి ఇవతలి వారిలో కూసింత అయినా సహానుభూతి కలిగిందా ?
కలగదు .
ఎవరికి వారు బిర్ర బిగుసుకుని కూర్చోవడమే .
ఈ వివాదం పాతబడితే… కొత్తగా ఇంకొకటి వస్తుంది .
వివాదాలు .. హెట్ పోస్ట్లు .. ద్వేషం .. రావణ కాష్టం !
మరి దీనికి పరిష్కారం ఏంటి ?
2018 లో… అంటే కరోనా కు ముందు రెండేళ్ల నాడే ” సెల్ ఫోన్ ను మనం వాడాలి . కానీ అది మనల్ని వాడేస్తోంది . ఇది ప్రళయానికి దారి తీస్తుంది అని చెప్పాను .
” ఓ చిన్న విద్యార్థి .. ఎందుకు రా?… ఈ బుద్ధి ” అని పాట తయారు చేశాను .ఇప్పుడిప్పుడే ప్రపంచం నిద్ర మేలుకొంటోంది .
“పిల్లలకు సోషల్ మీడియా బాన్ చెయ్యాలి “అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి .
మొబైల్ చేతిలో ఉంటే వారు సోషల్ మీడియా ను వాడకుండా ఎలా ఉంటారు? అని వీరికి ఆలోచన రావడం లేదు .
సరే… ఒక చిన్న అడుగు .. ముందుకు .. మంచిదే .
ఉందిలే మంచి కాలం ముందుముందునా !
రెండు దారులు .
1 . డిజిటల్ స్మార్ట్నెస్ :
మొబైల్ ను వాడాలి .
అది మనల్ని వాడకుండా చూడాలి .
అంటే ప్రొఫషనల్ పనులకు మొబైల్ వాడాలి .
సోషల్ మీడియా లో మంచి చూడడం కోసం వాడాలి .
ఇలాంటి వారు హ్యాపీగా జీవనం సాగిస్తారు .
చుట్టుపక్కల ఉన్న సైకో లతో జాగ్రత్తగా వ్యవహరించాలి .
కొనేళ్లు తప్పదు .
అటు పై వారుండరు .
సమస్య ఉండదు .
2 . డిజిటల్ మ్యాడ్నెస్ :
మెంటల్ డిసార్డర్స్ , ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ .. హత్యలు .. ఆత్మ హత్యలు .. రొచ్చులు రోగాలు .. ఆసుపత్రి ఖర్చులు .. చివరికి సమాధి . ఇది నిజం . కాస్త అటూయిటూ ..
కొనేళ్లకు .. భావి తరాలు హిస్టరీ పుస్తకాల్లో .. “ఒకప్పుడు ముబైల్ కారణంగా కొన్ని లక్షల మంది సైకోలు గా మరి అర్ధాంతరంగా బక్కెట్టు తన్నేసారు” అని చదువుతారు .
పై వాక్యం చదివి … భవిషత్తులో పుస్తకాలు వుండవు అని మీకనిపిస్తే మీరు రెండో కేటగిరీ లో ఉన్నట్టే .
మెదడులో పైన పేర్కొన్న మార్పులు ఒక స్థాయి వరకు రివెర్స్ చెయ్యొచ్చు .ఒక స్థాయి దాటితే మెదడులోని రసాయన మార్పులు శాశ్వతం అయిపోతాయి .
ఇప్పటికైనా మత్తు వీడండి !
మొబైల్ ను వినోదం కోసం కాదు ..
విజ్ఞానం కోసం వాడండి .
పిల్లల చేతికి మొబైల్ అసలు వద్దు .
శుభోదయం !