– రాహుల్ కి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు
– రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పీవీఎన్ మాధవ్
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో బీజేపీని గ్రామ గ్రామాన తీసుకెళ్ళి పటిష్ఠం చేసేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం… ‘మన పార్టీ మన జెండా’ పేరుతో గ్రామస్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని రాజమహేంద్రవరం బీజేపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం లో ఉన్నాం కానీ సరైన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం మూడు పార్టీల కేడర్ లో ఉందన్నారు. కూటమిలో సముచిత స్థానం, స్థానిక సంస్థల్లో పదవులు తెచ్చు కోవలసిన అవసరం ఉందని నొక్కివక్కానించారు. గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో నాయకులు కింగ్ అవ్వాలి లేదా కింగ్ మేకర్ కావాలి…
ప్రజాక్షేత్రంలో పార్టీ నాయకులు తిరిగి ప్రజల సమస్యలను పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 15 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. జాతీయ రహదారులు, ప్లే ఓవర్ బ్రిడ్జి లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టాం… రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి నేరుగా నిధులు ఇస్తోంది. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, పార్టీ పటిష్ఠం చేసేందుకు ఒక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు
దేశానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది… రాహుల్ గాంధీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని పీవీఎన్ మాధవ్ అన్నారు. ఓట్లు చోరీ చేసి నెహ్రూను ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని, ఈ కాంగ్రెస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాదు, ఇది కేవలం నకిలీ కాంగ్రెస్ అని విమర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా పరమపదించిన ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని రాహుల్ గాంధీ విమర్శించడం చూస్తే ఆయన రాజకీయానికి అర్హుడా అనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వైసీపీ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేసిందని మాధవ్ ఆరోపించారు.