తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీర్ పేటను ఆమె సర్వ నాశనం చేస్తున్నారని… దీన్ని తాను చూస్తూ ఊరుకోబోనని అన్నారు. కబ్జాలను సబిత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. స్కూళ్ల స్థలాలు, చెరువులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. తమ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం నిరాహారదీక్షకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు. సబిత టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవలేదని… వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారని తీగల అన్నారు. తాను ఎప్పటికీ టీఆర్ఎస్ వాడినే అని చెప్పారు.
గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సబిత, తీగల కృష్ణారెడ్డి ఇద్దరూ పోటీ పడ్డారు. కాంగ్రెస్ తరపున సబిత, టీఆర్ఎస్ తరపున తీగల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సబిత గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి, మంత్రి అయిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.