– బంగారు మలాం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని దుష్ప్రచారం టీటీడీ ఖండన
శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని హిందూ జన శక్తి సంస్థకు చెందిన శ్రీలలిత్ కుమార్, శ్రీఆదిపట్ల కళాపీఠం అధ్యక్ష్యురాలు శ్రీమతి కరాటే కల్యాణి సోమవారం ( 17-4-2023) న టీటీడీపై అవాస్తవ ఆరోపణలు చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికి వారు చేసిన నానా యాగీని తీవ్రంగా ఖండిస్తున్నాము.
బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. సంబంధిత సిబ్బంది లోనికి వెళ్ళాలన్నా. రిజిస్టర్ లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్ళాలి. ఇది నిషిద్ధ ప్రాంతం. స్ట్రాంగ్ రూమ్, పనిజరిగే ప్రాంతం లో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుంది. ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనం.
ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు,అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శిల్పసంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదు. ఈ విషయం తెలుసుకోకుండా సదరు వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదు.
గోల్డ్ మలాం పనులు చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశం( ఇది గోల్డ్ మలాం పనులు జరిగే ప్రాంతం కాదు ) లో బంగారు మలాం పనులు చేసే కాంట్రాక్టర్ జ్యోతికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చారు.
సదరు వ్యక్తులు ఈ సమయంలో అతన్ని పట్టుకుని యాగీ చేశారు. గోల్డ్ మలాం పనులకు అతనికి ఏ మాత్రం సంబంధం లేదు. అతనికి ఎలాంటి సబ్ కాంట్రాక్టు ఇవ్వలేదు. పబ్లిసిటీ పిచ్చితో ఇలాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరడమైనది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.