-కళ్ల నుంచి నీళ్లు కాదు.. నిప్పులు వస్తాయి
-వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ముందుకు వెళ్లాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభిస్తాం
-కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారు
-కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా దాడులు చేస్తున్నారు. దాడులకు భయపడేది లేదు. మన సమయాన్ని వృధా చేస్తున్నారు.. మనకు మిగిలిన సమయంలో డబుల్, ట్రిపుల్ పని చేయాలి కానీ వెనక్కి తగ్గొద్దు
-ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ లోపు మన సత్తా చూపిద్దాం
-తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయని తేల్చిచెప్పారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ముందుకు వెళ్లాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభిద్దామని తెలంగాణ జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు.
కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారు అని కవిత పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా దాడులు చేస్తున్నారు. దాడులకు భయపడేది లేదు. మన సమయాన్ని వృధా చేస్తున్నారు.. మనకు మిగిలిన సమయంలో డబుల్, ట్రిపుల్ పని చేయాలి కానీ వెనక్కి తగ్గొద్దు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ముందుకు వెళ్లాలి. ప్రజల శక్తి, వారి ప్రేమ ఏంటో తెలిసిన వాళ్లం మనం. ప్రజలను ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్లం. ప్రతి చోట మన కార్యక్రమాలను అమలు చేయాలి. రెస్ట్ తీసుకునేది లేదు.. రిలాక్స్ అయ్యేది లేదు.. భారతదేశం ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం అనేక ఇండెక్సుల్లో కిందకు పడిపోయింది. ఇటువంటి దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ లోపు మన సత్తా చూపిద్దాం అని కవిత పేర్కొన్నారు.
మన భాష, పండుగల మీద జరుగుతున్న వివక్షను ఉద్యమంలో భాగంగా ప్రజలకు వివరించాం. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా జరుపుకుంటున్నారు. అనేక మంది యువకులు, కళాకారులు పాల్గొంటున్నారు. స్కూల్ పాఠ్యాంశాల్లో బతుకమ్మ చేరింది. సంస్కృతి, సంప్రదాయాలకు చోటు లభించింది. రాష్ట్రం సాధించిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం అని కవిత తెలిపారు.
నిరాశ, నిస్పృహాల్లో మేధావులు, కవులు, రచయితలు..
ఇవాళ మళ్లీ ఒక సందర్భం వచ్చింది. యువతీయువకులు ఈ దేశం గురించి ఆలోచించాలి అని కవిత సూచించారు. తెలంగాణ కోసం గొంతెత్తాం. మన హక్కు అడిగాం. మన దేశంలో ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. మన హక్కులను కోల్పోతున్నామన్న విషయం తెలియకుండా ఉన్నాం. మేధావులు మాట్లాడటం బంద్ చేసిండ్రు. కవులు గళమెత్తడం మానేసిండ్రు. రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రు. అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. రచయితలు తమకు వచ్చిన అవార్డులను కేంద్రానికి విసిరికొట్టారు అని కవిత గుర్తు చేశారు.
ఇవాళ తెలంగాణ జాగృతి నుంచి ప్రతి రాష్ట్రానికి వెళ్లి దేశ వ్యాప్తంగా అనేక అంశాలపట్ల జాగృతం చేయాలి. ఆ అవసరం కనబడుతుంది అని కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నోబోబడిన సర్కార్లను బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తుంటే, పెద్ద పెద్ద పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తా కథనాలు రాస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తోంది. తెలంగాణలో చేసిందే దేశంలో చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడినప్పుడే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుకుంటుందన్నారు. కేంద్రం తప్పులను దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ తప్పులను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు.
సమూహాన్ని చైతన్య పరచాలంటే భావజాల వ్యాప్తి అవసరం అని కవిత అన్నారు. సమీకరించు, బోధించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పారు. ఇదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమం సందర్భంలో అనేకసార్లు చెప్పారు. ఇవాళ ఆలోచించాల్సిన సమయం, సందర్భం వచ్చింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలి. దేశ వ్యాప్తంగా అనేక రంగాల్లో నష్టపోతున్నాం. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు బంద్ చేశారు. మన చైతన్యాన్ని దేశ వ్యాప్తంగా రగిలించాలి. ఆ శక్తి, సత్తా తెలంగాణ జాగృతికి ఉంది. దేశ వ్యాప్తంగా మన కార్యాచరణను అమలు చేయాలి.
దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను, రచయితలను, విద్యార్థులను, మహిళలను ఏకం చేస్తాం, రైతులు, కార్మికులతో మాట్లాడుతాం. అన్ని గ్రామాల్లో చర్చలు పెడుతాం. అలాంటి చారిత్రాత్మకం అవసరం ఉంది. తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉంది. ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. 18 దేశాల్లో మన కమిటీలు పని చేస్తున్నాయి. ఒక్క పిలుపు ఇస్తే ప్రతి రాష్ట్రంలో మన శాఖ ఏర్పడే శక్తి ఉందని కవిత అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, ఉద్యమ నేతలు దేవి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ జాగృతి అన్ని జిల్లాల ప్రతినిధులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.