Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీల అభ్యున్నతికి ఏపీలో పలు సంక్షేమ పథకాలు

– ఎస్సీల రాజ్యాంగ బిల్లుపై రాజ్యసభ చర్చలో విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 9: షెడ్యూల్డు కులాలకు చెందిన సామాజికవర్గం ప్రజల సమగ్ర ఉద్దరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక వినూత్నమైన చర్యలు చేపట్టిందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి చెప్పారు. ఎస్సీల రాజ్యాంగ ఆర్డర్‌ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కంకణబద్దులై పనిచేస్తున్నారని అన్నారు.

ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి మేలు చేకూర్చేలా చేపట్టిన కొన్ని వినూత్న సంక్షేమ పథకాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద రాష్ట్రంలో 12 లక్షల ఎస్సీ కుటుంబాలకు మేల కలిగేలా 2,600 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు.

సామాజికంగా, ఆర్థికంగా బలహీన నేపధ్యం కలిగిన మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా సహాయ పడేందుకు ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ చేయూత పథకం కింద 6.4 లక్షల మంది ఎస్సీ మహిళలకు 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దోహదం చేసేలా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం కింద 2.3 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇతర ఖర్చుల కోసం 340 కోట్లు, క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ పొందిన టాప్‌ 200 యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నదని ఆయన తెలిపారు.

17 లక్షల ఎస్సీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు జోడించి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడాలని ఆయన సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE